Abn logo
Mar 25 2020 @ 02:21AM

జనం ఇంట్లోనే ఉన్నారు

జనం ఇంట్లోనే ఉన్నారు

పుస్తకాలు చదివారు, 

చెబుతున్నది విన్నారు

విశ్రాంతి తీసుకొన్నారు, కసరత్తులు చేశారు

బొమ్మలు గీశారు, ఆటలు ఆడారు

ఉండటం ఎలాగో,

ఉన్నచోట ఆగిపోవడం ఎలాగో,

లోతుగా చెవొగ్గి వినడం ఎలాగో కొత్త తరీఖా నేర్చుకొన్నారు.

వారిలో కొందరు ధ్యానించారు

కొందరు క్రీడించారు, కొందరు చిందేశారు

తమ నీడ తాము కొందరు కలుసుకొన్నారు

భిన్నంగా ఆలోచించడం మొదలుపెట్టారు

అలా జనం స్వస్థత పొందారు


ఈ జనం

ఎవరైతే ఇప్పటిదాకా 

ఏం పట్టకుండా బతికేశారో

ఎవరైతే ప్రమాదకరంగానూ, 

అర్థం లేకుండానూ,

కించిత్తు జాలీ లేకుండానూ జీవించేశారో

ఆ జనం పరోక్షంలో భూమీ స్వస్థత పొందటం మొదలుపెట్టింది.

ప్రమాదం తొలగిపోయాక

మనుషులు ఒకరిని ఒకరు కనుగొన్నారు

చనిపోయినవారికోసం సమాధులు తీశారు

తమకోసం కొత్త అవకాశాలను గాలించారు

రేపటి దునియాను స్వప్నించారు

జీవితానికి కొత్త పాదులు తీయడం మొదలుపెట్టారు

ఇలా వారు తమను 

తాము స్వస్థపరుచుకొన్నట్టే

ఈ భూమినీ సంపూర్ణంగా స్వస్థపరిచారు..

మూలం: కేథలిన్ ఓ మారా

అనువాదం: రివేరా

Advertisement
Advertisement
Advertisement