పగబట్టి పొగబెడుతున్నారు

ABN , First Publish Date - 2021-08-06T07:35:07+05:30 IST

ఆ ఆస్పత్రికి ఒకప్పుడు సొంత భవనం లేదు. నిరుపయోగంగా వున్న బడి భవనంలో నడిచేది. ఒక డాక్టరు, ముగ్గురు ఏఎన్‌ఎంలు వుండేవారు.

పగబట్టి పొగబెడుతున్నారు
రాజన్న ప్రాథమిక ఆరోగ్యకేంద్రం

పల్లెజనం ఆరోగ్యానికి భరోసా

పేటమిట్ట పీహెచ్‌సీ

 

   ఆ ఆస్పత్రికి ఒకప్పుడు సొంత భవనం లేదు. నిరుపయోగంగా వున్న బడి భవనంలో నడిచేది. ఒక డాక్టరు, ముగ్గురు ఏఎన్‌ఎంలు  వుండేవారు. ల్యాబ్‌ గానీ, ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టు గానీ లేవు. అప్పుడొకరూ అప్పుడొకరూ రోగులు వచ్చేవారు. అయితే 2013లో అమరరాజా సంస్థ రాజన్న ట్రస్టు పేరుతో పేటమిట్ట పీహెచ్‌సీని దత్తత తీసుకున్నాక దాని రూపురేఖలే మారిపోయాయి. పూతలపట్టు మండల ప్రజల ఆరోగ్యానికి ఒక నమ్మకమైన భరోసాగా ఇప్పుడు కొనసాగుతోంది. ఆధునిక వైద్యం పల్లె ప్రజలకు అందిస్తోంది. ప్రజా సేవలో సుదీర్ఘంగా ఉన్న అమరరాజా పరిశ్రమలను కాలుష్యం పేరుతో మూసేయమంటూ ప్రభుత్వం ఆదేశించిన తీరు చిత్తూరు జిల్లా ప్రజలను విస్తుపరుస్తోంది. అమరరాజా సంస్థ వ్యాపార విస్తరణకే పరిమితం కాక సేవారంగం లోనూ విస్తరిస్తున్న తీరును ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. తమిళనాడుకు అమరరాజా తరలిపోతే ఇటువంటి సేవలన్నీ తమకు ఆందవేమో అని ఆందోళన చెందుతున్న నేపథ్యంలో రాజన్న ట్రస్టు ఆధ్వర్యంలో పేటమిట్ట పీహెచ్‌సీ అందిస్తున్న సేవలపై ప్రత్యేక కథనం.

 

తిరుపతి-ఆంధ్రజ్యోతి 

  పూతలపట్టు మండలంలోని పేటమిట్ట పీహెచ్‌సీని  రాజన్న ట్రస్టు ద్వారా దత్తత తీసుకున్న గల్లా కుటుంబం దానికి రాజన్న ఆస్పత్రిగా నామకరణం చేసింది. ఆస్పత్రి పరిధిలోని తలపులపల్లె, రంగంపేట, కొత్తకోట, పాటూరు గ్రామాల్లో ఆరోగ్య ఉప కేంద్రాలను కూడా రాజన్న ట్రస్టు దత్తత తీసుకుంది. పేటమిట్టలోని ప్రధాన ఆస్పత్రితో పాటు ఆరోగ్య ఉప కేంద్రాల్లోని వైద్యులను, సిబ్బందిని ప్రభుత్వమే నియమిస్తుంది. వారి జీతభత్యాలు, ఆస్పత్రి నిర్వహణ, మందుల కొనుగోలు వంటివన్నీ రాజన్న ట్రస్టు భరిస్తోంది.  గల్లా కుటుంబం ఆస్పత్రి నిర్వహణ చేపట్టాక ఆరోగ్య కేంద్రం రూపురేఖలు సమూలంగా మారిపోయాయి. ఆస్పత్రికి అధునాతన భవనాన్ని గల్లా కుటుంబం నిర్మించింది. ఇపుడు ఇద్దరు డాక్టర్లు వున్నారు. ఏఎన్‌ఎంలు ముగ్గురు కాస్తా ఐదుగురయ్యారు. కొత్తగా ల్యాబొరేటరీ ఏర్పాటైంది.ల్యాబ్‌ టెక్నీషియన్‌ కూడా వచ్చారు. అలాగే ఆశా వర్కర్లు 20 మంది, సచివాలయ ఏఎన్‌ఎంలు ఏడుగురు చొప్పున విధులు నిర్వర్తిస్తున్నారు.


చిన్ని గ్రామంలో అధునాతన సదుపాయాలు

  పేటమిట్ట వంటి చిన్న గ్రామంలోని రాజన్న ఆస్పత్రిలో అధునాతన సదుపాయాలను గల్లా కుటుంబం అందుబాటులోకి తెచ్చింది.  ఈ కుగ్రామంలోని ఆస్పత్రిలో ఐసీయూ విభాగం వుంది. ఆరు పడకలతో కూడిన వార్డు ఏర్పాటు చేశారు. అంటు వ్యాధులతో వచ్చే రోగుల కోసం ప్రత్యేకంగా ఇన్‌ఫెక్షన్‌ రూమ్‌ పేరిట ఓ విభాగం పెట్టారు. వీటికి మించి గుండె జబ్బులను పసికట్టే ప్రాథమిక పరికరమైన ఈసీజీ వంటివి ఏర్పాటు చేశారు.  గ్రామాల నుంచీ రోగులను ఆస్పత్రికి తీసుకొచ్చి, వైద్య పరీక్షలు, చికిత్స అందించిన అనంతరం వారిని తిరిగి ఇళ్ళ వద్ద దిగబెట్టేందుకు ఉచిత బస్సు సదుపాయం కూడా గల్లా కుటుంబం అందుబాటులోకి తెచ్చింది. ఈ తరహా సౌకర్యం బహుశా మరెక్కడా వుండకపోవచ్చునని ఆ ప్రాంత వాసులు గర్వంగా చెబుతున్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు పాలు, బిస్కెట్లు ఉచితంగా అందజేస్తున్నారు. మరోవైపు వైద్య సిబ్బందికి ఆవరణలోనే క్వార్టర్లు నిర్మించి ఇవ్వడంతో వారంతా అక్కడే నివాసముంటున్నారు. దానివల్ల 24 గంటలపాటూ వైద్య సిబ్బంది రోగులకు అందుబాటులో ఉంటున్నారు. ఆవరణలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొల్పారు. ఈ సదుపాయాలు, సేవల ఫలితంగా రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మొత్తం మీద పుట్టిన గడ్డపై మమకారంతో అమరరాజా సంస్థ అధినేత గల్లా రామచంద్ర నాయుడు కుటుంబం అందిస్తున్న విశేష వైద్య సేవలకు సొంత మండలంలో ప్రజల నుంచీ ప్రశంసల వర్షం కురుస్తోంది. మరింత మంది పారిశ్రామికవేత్తలకు, సంపన్నులకు స్ఫూర్తిదాయకంగా ఈ ఆస్పత్రి నడుస్తోంది.


సిబ్బంది సేవలు అద్భుతం


 రాజన్న ఆస్పత్రిలో సిబ్బంది రోగుల పట్ల చాలా మర్యాదగా వ్యవహరిస్తారు. పలకరింపు కూడా బాగుంటుంది. అనారోగ్యంతో వచ్చిన వారు సంతృప్తిగా వెనుదిరిగి పోయేలా వుంటుంది ఆస్పత్రిలో సిబ్బంది తీరు, వాతావరణం. ఆస్పత్రికి రాగానే రోగికి ఒక నమ్మకం కలుగుతుంది.

-పద్మ, గొడుగుచింత, పూతలపట్టు మండలం





రుణపడి ఉంటాం


పల్లెల నుంచీ  ఆటోలో లేదా బస్సుల్లో చాలా అగచాట్లు పడి ఆస్పత్రికి పోయి రావాలి. అట్లాంటిది ఫ్రీ బస్సు పెట్టి వాళ్ళే పల్లెలకు వచ్చి రోగులను తీసుకపోయి ట్రీట్‌మెంట్‌ ఇచ్చాక మళ్ళా మా ఇళ్ళ దగ్గర వదిలిపెట్టి పోతున్నారు. ఇలాంటి సౌకర్యం కల్పించిన అమరరాజా సంస్థ యజమానులకు మా ప్రాంత ప్రజలు ఎప్పటికీ రుణపడి వుంటాం.

-కవిత, పోటుకనుమ దళితవాడ, పూతలపట్టు మండలం



అర్ధరాత్రి వచ్చినా వైద్యం అందుతోంది!


ఒకప్పుడు సాయంత్రమయ్యేసరికి పేటమిట్ట ఆస్పత్రికి తాళాలు పడేవి. జ్వరమొచ్చినా మరోటి వచ్చినా 25 కిలోమీటర్ల దూరంలో వున్న చిత్తూరుకు పోవాల్సి వచ్చేది. అమరరాజా వాళ్ళు ఆస్పత్రిని తీసుకున్నాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అనారోగ్యంతో అర్ధరాత్రి వచ్చినా సరే తగిన వైద్యం ఇపుడు అందుతోంది. గ్రామాల్లో జనానికి ఇంతకు మించి ఇంకేం కావాలి?

-జయచంద్ర నాయుడు, పేటమిట్ట


Updated Date - 2021-08-06T07:35:07+05:30 IST