పోటెత్తిన జనం

ABN , First Publish Date - 2021-04-09T07:09:20+05:30 IST

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు..

పోటెత్తిన జనం
జనసందోహం నడుమ చంద్రబాబు

చంద్రబాబు పర్యటనకు అనూహ్య స్పందన

శ్రీకాళహస్తిలో గత ఎన్నికల సభకు మించి జనం 

మలుపు తిరిగిన ఉప ఎన్నికల ప్రచార సరళి


తిరుపతి, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి ఉప ఎన్నికల ప్రచార పర్యటనలో భాగంగా తొలిరోజు శ్రీకాళహస్తిలో జరిపిన ఎన్నికల ప్రచారానికి అనూహ్య స్పందన లభించింది. గురువారం సాయంత్రం శ్రీకాళహస్తి పట్టణంలో రోడ్‌షో, ప్రచార సభలకు జనం పోటెత్తారు. అడుగడుగునా ఆయనకు నీరాజనం పట్టారు. పట్టణ జనానికి తోడు నియోజకవర్గవ్యాప్తంగా తరలివచ్చిన పార్టీ శ్రేణులతో ముక్కంటి క్షేత్రం పసుపుమయంగా మారింది. పట్టణంలో రోడ్‌షో సాగినంత మేరా ప్రధాన రహదారులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. చంద్రబాబును చూసేందుకు మహిళలు, వృద్ధులు కూడా పెద్ద ఎత్తున ఎగబడ్డారు. చంద్రబాబు అభివాదం చేసిన ప్రతి సందర్భంలోనూ కేరింతలు కొట్టారు. ప్రధాన రహదారుల వెంబడీ రోడ్‌షో సాగినంత మేరా అటూ ఇటూ వున్న భవనాలపై నుంచీ ఆయనపై పూలవర్షం కురిపించారు. సూపర్‌ బజారు ప్రాంతంలో అయితే ఆయన రావడానికి ముందే రోడ్డంతా పూలతో నిండిపోయింది. ఇక చంద్రబాబు ప్రసంగానికి సైతం సభకు హాజరైన జనం నుంచీ పెద్దఎత్తున స్పందన కనిపించింది.


ముఖ్యంగా సీఎం జగన్‌పై, జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై విమర్శలు, ఆరోపణలు చేసిన సందర్భాల్లో ఈలలు, కేరింతలతో స్పందించారు. టీడీపీ పాలనలో మాత్రమే శ్రీకాళహస్తి ప్రాంతం అభివృద్ధి చెందిందన్నారు. అనేక పరిశ్రమలు  ఏర్పాటు చేయించిన ఘనత టీడీపీదేనన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు చేయలేదన్నారు. వచ్చిన పరిశ్రమలు కూడా వైసీపీ నేతల దౌర్జన్యాలకు భయపడి వెళ్లిపోతున్నాయని చెప్పారు. శ్రీకాళహస్తి ప్రాంతంలో ఉన్న పరిశ్రమల్లో మామూళ్లు, కాంట్రాక్టుల కోసం ఓ నేత దౌర్జన్యాలకు దిగుతూ పనులు కూడా ఆపిస్తున్నారన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటు ద్వారా ఇలాంటి వారికి బుద్ది చెప్పాలని చంద్రబాబు కోరారు. గంటా ఆరు నిమిషాల పాటు సుదీర్ఘంగా ప్రసంగించినా సభ ముగిసే వరకూ జనం కదలకుండా వుండిపోయారు. కాగా రోడ్‌షోకు 20 వేల మంది హాజరైనట్టు అంచనా. శ్రీకాళహస్తి టీడీపీ నేతలు జనసమీకరణపై ప్రత్యేక దృష్టి సారించారు.అధినేత తొలి ప్రచార సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేతలు దానికి అనుగుణంగా ప్రణాళికా బద్దంగా కార్యాచరణకు దిగారు.


పట్టణంలో ప్రతి వార్డు నుంచీ అలాగే నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీ నుంచీ పార్టీ శ్రేణుల్ని, జనాన్ని సమీకరించాలన్న లక్ష్యంతో పనిచేసి సత్తా చాటుకున్నారు. దీనికి తోడు స్వచ్ఛందంగా కూడా పెద్దఎత్తున జనం తరలి వచ్చారు. దీంతో 2019 సాధారణ ఎన్నికల సందర్భంలో చంద్రబాబు పాల్గొన్న ఎన్నికల బహిరంగసభ కంటే కూడా ఇపుడు ఎక్కువ జనం హాజరయ్యారన్న భావన పట్టణ వాసుల నుంచీ వినిపించింది. శ్రీకాళహస్తి రోడ్‌షో, ప్రచార సభ అంచనాలకు మించి సక్సెస్‌ కావడంతో పార్టీ శ్రేణులు ఉబ్బితబ్బిబ్బవుతున్నాయి. దీంతో శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం ఇనుమడించినట్టు కనిపించింది. మొత్తానికీ చంద్రబాబు తొలిరోజు పర్యటనతో తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచార సరళే ఓ మలుపు తిరిగిందన్న వ్యాఖ్యలు అన్ని వర్గాల నుంచీ వినిపిస్తున్నాయి.


‘బంటి’వి అన్నీ అవినీతి పనులే

శ్రీకాళహస్తి: ‘శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధును ఏమనాలో తెలియడం లేదు. ఆయన్ను ఇక్కడి జనం ముద్దుగా బంటి అని పేరు పెట్టుకున్నారు. అయితే ఆయన చేసేది మొత్తం అవినీతి పనులే’ అని చంద్రబాబు అన్నారు. శ్రీకాళహస్తిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ జగన్‌ ఏరి కోరి బంటిలను తన ప్రభుత్వంలోకి తెచుకున్నారన్నారు. టీడీపీ హయాంలో వచ్చిన టీసీఎల్‌ కంపెనీ కాంట్రాక్టును వైసీపీ అధికారంలోకి వచ్చాక బియ్యపు మధు చేజిక్కించుకున్నారన్నారు. ఈ కంపెనీ నుంచి ఆయన రూ.10కోట్లు మామూళ్లు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోందన్నారు. శ్రీకాళహస్తి, ఏర్పేడు, తొట్టంబేడు మండలాల పరిధిలో గల పరిశ్రమల నుంచి కూడా బియ్యపు మధు మామూళ్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.


తనకు మామూళ్లు ఇవ్వలేదనే సాకుతో ఓ పరిశ్రమలో పనులు కూడా ఆపించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. శ్రీకాళహస్తి మండలంలో పేదల ఇళ్ల స్థలాల కోసం సేకరించిన భూమిలో ఈయన రూ.కోట్లు దండుకున్నారని చెప్పారు. శ్రీకాళహస్తి పట్టణంలో విలువైన స్థలాలన్నింటినీ బియ్యపు మధు కుటుంబ సభ్యులు, బంధువులు కబ్జా చేస్తున్నారన్నారు. ఇక స్వర్ణముఖినది నుంచి పెద్దఎత్తున ఇసుకను అక్రమంగా బెంగళూరు, చెన్నైకి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. కరోనా ముసుగులో బెంగళూరు నుంచి అక్రమంగా మద్యం తెచ్చి విక్రయిస్తున్నాడని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వస్తే బంటి అటలు సాగనివ్వమని హెచ్చరించారు.


కూల్‌గా చంద్రబాబు తొలిరోజు పర్యటన

టీడీపీ అధినేత చంద్రబాబు తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచార పర్యటనలో తొలిరోజు కూల్‌గా మొదలైంది. ఆయన గురువారం ఉదయం తిరుపతి విమానాశ్రయానికి చేరుకోగా కొందరు నేతలు మాత్రమే స్వాగతం పలికారు. మెజారిటీ నేతలు ఎవరికి అప్పగించిన ప్రాంతాల్లో వారు ప్రచార కార్యక్రమాల్లోనూ, జనసమీకరణ ఏర్పాట్లలోనూ నిమగ్నమై వుండడమే దీనికి కారణం. రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, అభ్యర్థి పనబాక లక్ష్మి, తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌ చినబాబు, తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడు నరసింహయాదవ్‌, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ,  రాయలసీమ మీడియా కోఆర్డినేటర్‌ శ్రీధర్‌ వర్మ, తిరుపతి పార్లమెంటు టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ అధ్యక్షుడు రవినాయుడు, మాజీ ఎమ్మెల్యే మోహన్‌ తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడ నుంచీ నేరుగా తిరుమల చేరుకున్న చంద్రబాబు ఆ నేతలతో పాటు శ్రీవారిని దర్శించుకున్నారు.టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, తిరుపతి పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ సంధ్యారాణి తదితరులు ఆయన వెంట వున్నారు.


అనంతరం తిరుమల టీడీపీ కార్యకర్తలు రాజుయాదవ్‌, ఆర్‌.కేశవులు కోరిక మేరకు బాలాజీనగర్‌లోని వారి ఇళ్లకు చంద్రబాబు వెళ్లారు.మజ్జిగ, నీరు స్వీకరించి కొద్దిసేపు ముచ్చటించారు.అధినేత తమ ఇళ్ళకు రావడంతో కార్యకర్తల సంతోషానికి పట్టపగ్గాల్లేకుండాపోయింది. తిరుమల నుంచీ బయల్దేరిన చంద్రబాబు రేణిగుంట నక్షత్ర హోటల్‌కు చేరుకుని కొద్దిసేపు గడిపారు. అక్కడ ఆయన్ను పలువురు నేతలు, కార్యకర్తలు శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. ఆయనతో ఫొటోలు దిగారు. తర్వాత హోటల్‌ ఆవరణలోనే తనకోసం ప్రత్యేకంగా వచ్చిన వ్యానిటీ బస్సులో మధ్యాహ్న భోజనం చేసి సాయంత్రం 4 గంటల వరకూ అందులోనే గడిపారు. బస్సులోకి పరిమితంగానే నేతలను అనుమతించారు. కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎంపీ కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి తదితరులు వచ్చి చంద్రబాబును కలిసి మాట్లాడి వెళ్ళారు. సాయంత్రం 4 గంటల తర్వాత చంద్రబాబు శ్రీకాళహస్తి ఎన్నికల ప్రచారానికి బయల్దేరి వెళ్ళారు. ప్రచారం ముగిసిన అనంతరం శ్రీకాళహస్తి పార్టీ కార్యాలయ ఆవరణలోనే బస్సులో రాత్రికి బస చేశారు. 



Updated Date - 2021-04-09T07:09:20+05:30 IST