నస్తీపూర్‌ మహిళా సంఘాల పనితీరు భేష్‌

ABN , First Publish Date - 2020-12-05T05:29:50+05:30 IST

నస్తీపూర్‌ గ్రామంలో ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల పని తీరు అభినందనీయమని కలెక్టర్‌ హన్మంతరావు అన్నారు.

నస్తీపూర్‌ మహిళా సంఘాల పనితీరు భేష్‌
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ హన్మంతరావు

అభినందించిన కలెక్టర్‌ హన్మంతరావు


హత్నూర, డిసెంబరు 4: నస్తీపూర్‌ గ్రామంలో ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల పని తీరు అభినందనీయమని కలెక్టర్‌ హన్మంతరావు అన్నారు. శుక్రవారం హత్నూర మండలం నస్తీపూర్‌ గ్రామాఖ్య సంఘం సభ్యులతో కలెక్టర్‌ హన్మంతరావు సమావేశం నిర్వహించి వారు చేపట్టిన కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులు సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టడం అభినందనీయమన్నారు. సొంత డబ్బులతో గ్రామ మహిళా సంఘ భవనాన్ని ఏర్పాటు చేసుకోవడం జిల్లాలో ఎక్కడా జరగలేదన్నారు. పారిశుధ్య పనులతో పాటు శ్రమదానం, మద్యపాన నిషేధం, వృద్ధ మహిళలకు సహాయం అందించడం, ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పింఛన్లను లబ్ధిదారుల ఇంటికి తీసుకెళ్లి ఇవ్వడం మహిళా సంఘాలు చేస్తున్న సేవా నిరతికి నిదర్శనమని కొనియాడారు. కుటుంబంలో సమస్యలు తలెత్తితే పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లకుండా గ్రామంలోని మహిళా సంఘాల సభ్యులు పరిష్కరించుకోవడం ఎంతో గొప్పదనం అని అన్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా చేసి ట్రాక్టర్‌లో వేయడం, మురుగు కాలవల్లో చిత్త నిలవకుండా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు సంపూర్ణ పారిశుధ్యం దిశగా తీర్చిదిద్దిన మహిళలను కలెక్టర్‌ అభినందించారు. 


పచ్చళ్లు, ప్లేట్ల తయారీకి కృషి చేయాలి

ఆర్థికంగా సంఘ బలోపేతం కోసం పచ్చళ్లు, ప్లేట్లు తయారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని మహిళా సంఘాలకు సూచించారు. మిషన్ల కోసం తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలోని పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లేలా చూడాలని అవసరమున్న తరగతి గదులను నిర్మించేందుకు నిధులను మంజూరు చేస్తానని కలెక్టర్‌ పేర్కొన్నారు. ప్రతి ఇంటికీ ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకోవాలని మహిళా సంఘాల సభ్యులకు సూచించారు. అనంతరం డంపింగ్‌ యార్డులో తడి, పొడి చెత్త నిర్వహణను పరిశీలించారు. శ్మశాన వాటిక నిర్మాణం చాలా బాగుందని సర్పంచ్‌ను అభినందించారు. పల్లె ప్రకృతివనాన్ని పరిశీలించిన కలెక్టర్‌ మొక్కలను సంరక్షించుకోవాలని సూచించారు. గ్రామాభివృద్ధికి ఎమ్మెల్యే మదన్‌రెడ్డి సహకారంతో తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా పంచాయతీ అధికారి సతీ్‌షరెడ్డి, డీపీఎం మల్లేశం, తహసీల్దార్‌ జయరాంనాయక్‌, సర్పంచ్‌ ఎల్లయ్య, ఏపీఎం శ్రీదేవి, ఎంపీడీవో సువర్ణ, ఏపీవో ప్రవీణ్‌కుమార్‌, గ్రామాఖ్య సంఘం అధ్యక్ష, కార్యదర్శులతో పాటు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-05T05:29:50+05:30 IST