అక్కడ లాక్‌.. ఇక్కడ లాభం!

ABN , First Publish Date - 2021-08-02T04:07:11+05:30 IST

అక్కడ లాక్‌.. ఇక్కడ లాభం!

అక్కడ లాక్‌.. ఇక్కడ లాభం!
జీడిపిక్కలపై ఉన్న రేపర్‌ను తొలగిస్తున్న జీడి కార్మికురాలు

- పలాస జీడికి కలిసొచ్చిన కాలం

- ఉత్పత్తులకు పెరిగిన గిరాకీ

- అన్నిరకాల పప్పుల ధరలు పెరుగుదల

- కేరళలో లాక్‌డౌన్‌తో పరిశ్రమల మూతే కారణం

(పలాస)

కేరళలో లాక్‌డౌన్‌తో పలాసలో జీడి పరిశ్రమలకు కలిసి వచ్చినట్టు కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితిని చూస్తే అక్కడి పరిశ్రమలు మూతపడడంతో ఇక్కడి జీడి ఉత్పత్తుల ధరలు పెరిగినట్టు అర్థమవుతోంది. కేరళలో ఇటీవల కరోనా కేసులు గణనీయంగా పెరిగాయి. దీంతో అక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. అక్కడి జీడి పరిశ్రమలు మూతపడ్డాయి. దీనికితోడు వియత్నాం నుంచి జీడిపిక్కల దిగుమతి నిలిచిపోవడం కూడా పలాస పరిశ్రమలకు కలిసొచ్చింది. దేశీయ పిక్కలకు గిరాకీ ఏర్పడింది. ప్రస్తుతం అన్ని రకాల జీడి పప్పులకు కేజీపై రూ.60 నుంచి రూ.70 ధర పెరగగా, 80 కిలోల జీడి పిక్కల బస్తా ధర రూ.10 వేలు దాటింది. దీంతో పలాస జీడి వ్యాపారం అంతర్జాతీయంగా ఊపందుకుంది. అన్ని పరిశ్రమల యాజమాన్యాలు జీడి ఉత్పత్తులపై దృష్టి సారించాయి. ఆర్డర్లు ఎక్కువగా రావడంతో వ్యాపారులు వారి స్థాయికి తగిన విధంగా సరఫరా చేస్తున్నారు. మొదటిరకం జీడిపప్పు నిన్నటి వరకు రూ.680  ఉండగా... ప్రస్తుతం రూ.750కు చేరుకుంది.


ఇప్పుడిప్పుడే కష్టాలు అధిగమించి...

నాలుగేళ్లుగా జీడి పరిశ్రమలు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. పరిశ్రమల నిర్వహణే కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో కేరళ, వియత్నాంలో కరోనా ప్రభావం కలసి వచ్చింది. 2018లో తితలీ తుపానుతో జీడిపంటకు అపార నష్టం సంభవించింది. ఇక కోలుకోవడం కష్టమని అంతా భావించారు. బ్యాంకర్లు, ప్రభుత్వ ప్రోత్సాహం ఇవ్వడంతో పరిశ్రమలు ఆర్థికంగా నిలదొక్కుకున్నాయి. లాభాలు లేకపోయినా పరిశ్రమలు మాత్రం నిర్వహిస్తూ వచ్చారు. దేశీయంగా జీడి పిక్కల ధరలు రూ.6000 నుంచి రూ.7000 వరకూ కొనుగోలు చేసి వ్యాపారం సాగించేవారు. గిట్టుబాటు ధర కోసం రైతులు కూడా పోరాడుతున్న తరుణంలో కరోనా దేశవ్యాప్తంగా వ్యాపించడంతో పలాస జీడి పరిశ్రమలు ఏడాదిపాటు మూతపడ్డాయి. మూడు నెలల నుంచి కరోనా కేసులు తగ్గడంతో పరిశ్రమలు తెరిచి ఉన్న పిక్కలను పీలింగ్‌ చేస్తూ బ్రోకర్లకు, ఇతర రాష్ట్రాలకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. పలాస జీడి మార్కెట్‌కు ఎక్కువగా వియత్నాం, ఐవరికోస్ట్‌ తదితర దేశాల నుంచి జీడి పిక్కలు వస్తుంటాయి.  ఎక్కువగా వియత్నాం నుంచి దిగుమతి అవుతాయి. విదేశాలకు కేరళ రాష్ట్రం నుంచి జీడిపప్పు ఎగుమతి అవుతుంటుంది. కానీ ఇటీవల కరోనా కేసుల పెరుగుదలతో ప్రభుత్వం సంపూర్ణ లాక్‌డౌన్‌ను ప్రకటించింది. దీంతో పరిశ్రమలు మూతపడి జీడి ఉత్పత్తుల విక్రయాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా జీడిపప్పుకు గిరాకీ ఉండడంతో పలాస జీడి పరిశ్రమల వైపు ఎగుమతిదారులు చూస్తున్నారు. కొనుగోలుకు ఆసక్తి చూపించడంతో పలాస జీడిపప్పు ధర పెరిగింది.  ప్రస్తుతం వ్యాపారుల వద్ద అధిక మొత్తంలో స్టాక్‌ ఉంది. జీడి పిక్కలను కూడా రూ.10వేలకు పైబడి కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం పలాస పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా జీడి పరిశ్రమలు తెరిచి పనులు చేస్తుండడం కనిపిస్తోంది. మరో మూడు నెలలు ఇలాగే కొనసాగితే గత నష్టాల నుంచి పూర్తిగా గట్టెక్కగలమని జీడి వ్యాపారులు చెబుతున్నారు. 


ప్రస్తుతం పలాస జీడి మార్కెట్‌లో ధరలు ఇలా...

-------------------------------------------

జీడిపప్పు రకం.... కిలోకు రూపాయల్లో..

-------------------------------------------

180          - 750

210          - 670

240         - 630

320         - 600

400         - 570

జెహెచ్‌      - 570

కె           - 470

ఎల్‌డబ్యూపి  - 370

----------------------

జీడి పిక్కలు బస్తా(80) కిలోలు రూ.10,000

-------------------------------------------

 

Updated Date - 2021-08-02T04:07:11+05:30 IST