‘‘పెర్కిట్‌’’ ఒక ప్రేరణ

ABN , First Publish Date - 2020-05-19T06:26:50+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తిని ఎదుర్కొనడానికి దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌లు, ప్రజా జీవితాన్ని స్తంభింపజేయడమే కాదు, కల్లోల పరిచాయి. దిన వేతనాలపై ఆధారపడే వారి మీద ఇది పిడుగుపాటు అని, ఆర్థిక వ్యవస్థకు ఇది గొడ్డలివేటు,...

‘‘పెర్కిట్‌’’ ఒక ప్రేరణ

కరోనా వైరస్‌ వ్యాప్తిని ఎదుర్కొనడానికి దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌లు, ప్రజా జీవితాన్ని స్తంభింపజేయడమే కాదు, కల్లోల పరిచాయి. దిన వేతనాలపై ఆధారపడే వారి మీద ఇది పిడుగుపాటు అని, ఆర్థిక వ్యవస్థకు ఇది గొడ్డలివేటు, అనేక ఉపాధులను, వ్యాపారాలను చావుదెబ్బ తీస్తుందని సహజంగానే ఆందోళన కలిగింది. కానీ, ఎవరూ ఊహించని విధంగా కరోనా లాక్‌డౌన్‌ కల్లోలానికి ప్రతీకగా కోట్లాది మంది వలసశ్రామికుల పాదయాత్ర ప్రత్యక్షమైంది. ఈ దేశ వాస్తవికతను అత్యంత స్పష్టంగా, దయనీయంగా ఆవిష్కరించింది. జరుగుతున్న అభివృద్ధి వెనుక ఉన్నది ఏ హస్తాలో తెలియజెప్పింది. అసంఖ్యాకులైన శ్రామికులు, తమ స్వస్థలాలకు వెళ్లాలనే ఉద్దేశంతో, యుద్ధప్రాంతాల్లో ఉన్నట్టో, ప్రకృతివైపరీత్యాలు ముంచుకువచ్చినట్టో తరలిపోవడం ఒక వేదనాభరితమైన దృశ్యం. గమ్యాన్ని చేరుకోవాలనే వారి సంకల్పం ముందు ప్రభుత్వం నిస్సహాయంగా నిలబడిపోయింది. వారి పాదయాత్ర వేస్తున్న ప్రశ్నల ముందు, నిలదీస్తున్న నైతికత ముందు వ్యవస్థే దోషిగా నిలబడింది. ఈ మానవీయ సంక్షోభాన్ని స్పృశించి, కనీస ఉపశమనాన్ని, కాసింత ఆదరువును, అన్నపానాలను అందించడానికి మానవత్వపు తపనే ముందుకు వచ్చింది. దుఃఖాన్ని చూడలేని, బాధను పంచుకోకుండా ఉండలేని మనుషులు, అంతిమంగా మనిషికి మనిషికి మధ్య ఉండవలసింది మానవీయ సంబంధమే అని నమ్మే మనుషులు రంగంలోకి దిగారు. కాలపరీక్షలో శిరస్సు అవనతం కాకుండా మనిషి పరువును కాపాడుతున్నారు. 


ఎందరో ఉన్నారు మహానుభావులు, ఎన్నో ఉంటాయి ఉదాహరణలు, కానీ, ఒక నమూనా చెప్పదలచుకుంటే తెలంగాణలో జాతీయరహదారి 44 పై జరుగుతున్న ప్రయత్నాలను చెప్పుకోవాలి. జాతీయరహదారి 44 అంటే, భారతదేశపు నిడివిని, వైవిధ్యాన్ని, విస్తృతిని చెప్పడానికి ఉపయోగించే కశ్మీర్‌–కన్యాకుమారులను కలిపే రహదారి. స్థానికంగా చెప్పుకోవాలంటే, హైదరాబాద్‌ నుంచి నాగపూర్‌ వెళ్లే రహదారి. ఈ దారి మీద చెన్నై నుంచి, కేరళ నుంచి, కర్ణాటక నుంచి ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ జార్ఖండ్‌ వెళ్లే వలసకార్మికులంతా బారులు తీరి ప్రయాణిస్తున్నారు. లాక్‌డౌన్‌ సడలింపులు ఆచరణలోకి వచ్చి ఒక వారం రోజుల నుంచి ట్రక్కుల మీద వెడుతున్న కార్మికులు పెరిగారు. కానీ, సైకిళ్ల మీద, మోటార్‌సైకిళ్ల మీద వెళ్లే వారితో పాటు, కాలినడకన సాగుతున్న బృందాలుకూడా ఇంకా అనేకం జాతీయరహదారిపై యాత్రలో ఉన్నాయి. ఇప్పుడు సగం దారిలో ఉన్నవారు ఇంకో రెండు వారాలు గడిస్తే గానీ గమ్యాలు చేరరు. ఇప్పుడిప్పుడే మొదలైనవారు చెప్పనక్కరలేదు. నాలుగో లాక్‌డౌన్‌లో ప్రకటించిన సడలింపులు వారి ప్రయాణాన్ని ఎంతవరకు సరళం చేస్తాయో తెలియదు. 


జాతీయరహదారిపై నిజామాబాద్‌ – ఆర్మూర్‌ల సమీపంలోని పెర్కిట్‌ గ్రామం దగ్గర యాభైరోజులకుపైగా సాగుతున్న సహాయశిబిరం మానవీయ ఆచరణకు, సమష్టి భావనకు ఒక మచ్చు తునక. మూడు మండలాలకు చెందిన ఉపాధ్యాయులు, కొందరు చొరవ కలిగిన సామాజిక కార్యకర్తలు కలిసి, వేలాదిమందికి భోజనం అందిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి దాకా పన్నెండు గంటలపాటు ఎడతెగకుండా సాగే ఆ శిబిరం రోజుకు 300 మందికి భోజనం పెట్టాలనే ఆశయంతో మొదలై, అవసరం పెరిగి ఇప్పుడు 5 వేల మందికి పైగా సేవ చేస్తున్నది. ఒక మండల విద్యాశాఖాధికారి, తెలంగాణ ఉద్యమంతో కలసినడిచిన ఒక స్థానిక కార్యకర్త చొరవ తీసుకుని, వందల మందిని ఈ కృషిలో భాగస్వాములను చేశారు. కూలీలను తరలిస్తున్న లారీలకు ఎదురుపడి, అన్నం పెడుతున్నాం, తినడానికి రండని కేకలు పెడుతున్న ఒక ప్రధానోపాధ్యాయుడిని అక్కడ చూడవచ్చు. వడ్డిస్తున్న ఉపాధ్యాయులను చూడవచ్చు.


ఆ శిబిరానికే వచ్చి తమకు చేతనైనంత సాయం చేసేవారు, పండో ఫలమో ఇచ్చే వారు కనిపిస్తారు. రోజుకో రెండు ట్రిప్పులు మహారాష్ట్ర సరిహద్దుదాకా కూలీలను చేరవేయడానికి ఒక ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీ యజమాని బస్సులను పంపిస్తాడు. నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ దాటితే, మహారాష్ట్రలో అడివి బాట. ఇక్కడి ఆదరణ వారికి ఎంతో విలువైనది. రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు విఫలమైన చోట, ఈ ప్రయత్నం గొప్ప ఫలితం ఇచ్చింది. సామాజిక మాధ్యమాలలో ఈ కార్యాచరణ గురించి తెలుసుకుని, అనేకమంది దాతలుగా మారారు, కార్యకర్తలుగా మారారు. ఆ చివర నిజామాబాద్‌లో ఉన్నట్టే ఒక శిబిరాన్ని హైదరాబాద్‌ శివార్లలో నిర్వహిస్తే మంచిదని వివిధరంగాలకు చెందిన సామాజిక కార్యకర్తలు మేడ్చల్‌ దగ్గర తమ ప్రయత్నాన్ని సాగిస్తున్నారు. ఈ ప్రయత్నంలో న్యాయవాదులు, పాత్రికేయులు, రచయితలు, కవులు, కళాకారులు పాలుపంచుకుంటున్నారు. 


ఇదేదో అన్నదాన శిబిరం నడపడం కాదు. ప్రచార కార్యక్రమమూ కాదు. ఇక్కడ ఆదరణ పొందుతున్నవారు కేవలం ఆకలిగొన్నవారు కాదు. ఇదొక మానవీయ విషాదం. ఇదొక చారిత్రక సంక్షోభం. దారి వెంట పోతున్న ఈ అనామక, అసంఖ్యాక శ్రమజీవులు, భిక్షుకులు కాదు. ఈ దేశ సంపద మీద హక్కు కలిగిన భారతీయులు. మనలోపలే ఉంటూ, మనం వెలిగా ఉంచిన ఈ కార్మికులను ఒక్కసారైనా, ఈ కష్టకాలంలో అయినా అక్కున చేర్చుకుంటున్నది తక్కిన సమాజం. ఈ ఐక్యత గొప్పది. ఈ సహానుభూతి, ఆర్ద్రత విలువైనవి. జరుగుతున్న సమస్తమూ ఆశలను తుంపేస్తున్నప్పుడు, ఒక నిస్సత్తువ ఆవహిస్తున్నప్పుడు– ఈ చేయూత ఒక వాగ్దానం. 


పెర్కిట్‌ స్ఫూర్తితో జాతీయ రహదారులన్నిటా మానవత్వపు చలివేంద్రాలు వెలియాలి. ఎండాకాలపు తీక్షణతను ఓడించలేము కానీ, ఒక నీడను సృష్టించగలము.

Updated Date - 2020-05-19T06:26:50+05:30 IST