Abn logo
Jul 31 2021 @ 01:29AM

పెగాసస్‌పై పిటిషన్‌ పరిశీలనకు సరే

  • ఎన్‌.రామ్‌ అభ్యర్థనపై సుప్రీం స్పందన.. 
  • సిట్టింగ్‌ జడ్జితో దర్యాప్తు కోరిన పాత్రికేయులు


న్యూఢిల్లీ, జూలై 30: పెగాసస్‌ నిఘా సాఫ్ట్‌వేర్‌తో ప్రభుత్వం వ్యక్తుల జీవితాల్లోకి తొంగిచూస్తోందన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు ప్రస్తుత లేదా మాజీ న్యాయమూర్తితో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలంటూ ప్రముఖ పాత్రికేయులు ఎన్‌.రామ్‌, శశి కుమార్‌లు దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. వచ్చేవారం దానిపై విచారణ చేపడతామని ప్రకటించింది. సుప్రీం రిజిస్ట్రీలో నమోదైన ఈ పిటిషన్‌ అత్యవసరంగా చేపట్టాల్సిన అంశమని న్యాయవాది కపిల్‌ సిబల్‌ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ దృష్టికి తీసుకొచ్చారు. విపక్ష నేతలు, జర్నలిస్టులు, చివరకు కోర్టు సిబ్బంది కూడా ఈ సాఫ్ట్‌వేర్‌ నిఘా నీడలో ఉన్నారని, ఇది పౌరుల స్వేచ్ఛకు భంగం కలిగించే వ్యవహారమని సిబల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చేవారం ఏదో ఒక రోజు విచారణ చేపడతామని ప్రధాన న్యాయమూర్తి హామీ ఇచ్చారు. తాను బిజీగా ఉండే మంగళ, బుధవారాలు తప్ప మిగతా రోజుల్లో విచారణ చేపట్టాలని సిబల్‌ కోరగా, జస్టిస్‌ రమణ అంగీకరించారు. 300 మంది భారతీయుల మొబైల్‌ నంబర్లు పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ నిఘాలో ఉన్నాయని అంతర్జాతీయ పత్రికలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో వేసిన పిటిషన్‌లో పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ లైసెన్స్‌ను భారత ప్రభుత్వం కానీ, భారత ప్రభుత్వ సంస్థలు గానీ తీసుకున్నాయా? కేంద్ర ప్రభుత్వం వెల్లడించాలని పిటిషనర్లు కోరారు. మిలిటరీ గ్రేడ్‌  నిఘా వ్యవస్థలను సామాన్య పౌరులపై వినియోగించడం ప్రాథమిక హక్కుల్లో భాగమైన వ్యక్తి గోప్యతకు భంగమని పేర్కొన్నారు. జర్నలిస్టులు, వైద్యులు, న్యాయవాదులు, ఉద్యమకారులు, మంత్రులు, విపక్ష నేతల ఫోన్లను హ్యాక్‌ చేయడం వారి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం కలిగించడమే అవుతుందని అభిప్రాయపడ్డారు. ఐటీ చట్టం కింద ఇలాంటి చర్యలు జైలుశిక్ష పడేంత తీవ్రమైన నేరాలని ప్రస్తావించారు. 


మంత్రి ప్రకటన తర్వాత వివరణ అడగండి

పెగాసస్‌ ఆరోపణల మీద ఐటీ మంత్రిని ప్రకటన చేయనివ్వకుండా విపక్షం అడ్డుకోవడాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి తప్పుబట్టారు. మంత్రి ప్రకటన తర్వాత కూడా అనుమానాలు ఉంటే విపక్షాలు అడిగి వివరణ తీసుకోవచ్చన్నారు. అసలు పెగాసస్‌ సభలో చర్చించాల్సినంత పెద్ద అంశమే కాదని చెప్పారు. ప్రజలను వేధిస్తున్న సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. విపక్షాలు మాత్రం పెగాసస్‌పై సభలో చర్చకు పట్టుబడుతున్నాయి. కాంగ్రెస్‌, తృణమూల్‌ రాజకీయాల కోసం సభా సమయాన్ని వృధా చేస్తున్నాయని సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మండిపడ్డారు.  


‘పెగాసస్‌’ సమావేశానికి గైర్హాజరైన అధికారులపై చర్య తీసుకోండి: శశిథరూర్‌ 

పెగాసస్‌ స్పైవేర్‌ వ్యవహారంలో అధికారులను ప్రశ్నించడానికి ఈనెల 28న ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశానికి గైర్హాజరైన అధికారులపై చర్య తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఐటీపై పార్లమెంటరీ స్థాయీ సంఘం అధ్యక్షుడు శశిథరూర్‌ విజ్ఞప్తి చేశారు. కాగా థరూర్‌ను స్థాయీ సంఘం అధ్యక్ష పదవి నుంచి తొలగించేందుకు వెంటనే ప్రక్రియను ప్రారంభించాలని బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దూబే మరోసారి లోక్‌సభ స్పీకర్‌ను కోరారు. 


ఇజ్రాయెల్‌ విచారణ

పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ తయారీ సంస్థ ఎన్‌ఎ్‌సఓపై ఇజ్రాయెల్‌ ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. రక్షణ శాఖ అధికారులు కంపెనీ కార్యాలయాల్లో సోదాలు చేశారు. పెగాసస్‌ ద్వారా తప్పుడు పనులకు ఎన్‌ఎ్‌సఓ పాల్పడిందన్న ఆరోపణలపై ఇజ్రాయెల్‌ విచారిస్తోంది.