Abn logo
Oct 22 2021 @ 00:00AM

మానవతా శిఖరం

దైవ ప్రవక్త మహమ్మద్‌ చిన్ననాటి నుంచి అనాథగా పెరిగారు. తాను పుట్టిన సమాజంలో భిన్నమైన మనిషిగా, ఏనాడూ అబద్ధం చెప్పని వ్యక్తిగా, మితభాషిగా, మృదుభాషిగా, ఎన్నడూ, ఎవరినీ దూషణ చెయ్యడం ఎరుగని, తన ప్రవర్తనతో శత్రువుల మనసులను సైతం దోచుకున్న వ్యక్తిగా కీర్తి పొందారు. తనను దూషించినవారినీ, తనపై రాళ్ళు రువ్వినవారినీ, తను పుట్టిన నేలను వదిలేలా చేసినవారినీ, తనపై చెత్తా చెదారం పోసిన వారినీ, తన అనుచరులను కిరాతకంగా హింసించినవారినీ, తన బాబాయి మృతకళేబరం నుంచి కాలేయాన్ని పెరికి, పైశాచికంగా నమిలినవారినీ ఒక్క మాట కూడా ఆయన అనలేదు. ఎవరి మనసునూ గాయపరచలేదు. పగ, ప్రతీకారాలు తీర్చుకోలేదు. ఆయన అందరినీ మన్నించి, వారి ప్రేమకు పాత్రుడైన మానవతా శిఖరం. వంశాలు, వారసత్వాల గురించి గర్వపడే ధోరణిని తొలగించి, ‘అందరూ సమానులే’ అని చాటి చెప్పిన మానవతావాది ఆయన. 


ఆయన ప్రతి రోజూ బజారులో నడిచి వెళ్తున్నప్పుడు... ఒక మహిళ ఆయన మీద ఊడ్చిన చెత్త పోసేది. ఒకసారి రెండు మూడు రోజుల పాటు ఆయన మీద చెత్త పడలేదు. దాంతో ఆయనకు అనుమానం కలిగి, ఆ ఇంటికి వెళ్ళి చూశారు. ఆ మహిళ జబ్బుతో మంచంలో పడి ఉంది. ఆమెకు తన సానుభూతిని మహా ప్రవక్త తెలియజేస్తూ, ఆమె ఆరోగ్యం కోసం దైవాన్ని ప్రార్థించారు. ఆమెకు స్వస్థత చేసూరింది. తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపం చెందింది. 


ఒకసారి ఆయన ఒక చెట్టు కింద నిద్రిస్తున్నారు. ఒక అవిశ్వాసి అక్కడికి వచ్చి, ఒరలోంచీ ఖడ్గం తీసి, వికటాట్టహాసం చేయసాగాడు. ‘‘ఓ మహమ్మద్‌! ఇప్పుడు నా నుంచి నిన్ను రక్షించేవాడెవరో చెప్పు’’ అన్నాడు. 


ఆయన ఏమాత్రం తొణక్కుండా, ఎంతో ప్రశాంతంగా ‘‘దేవుడు’’ అన్నారు. దైవప్రవక్త ఆత్మవిశ్వాసానికీ, సాహసానికీ ఎంతో ప్రభావితుడైన ఆ వ్యక్తి ఖడ్గాన్ని ఒరలో పెట్టేసి, ఆయన ఎదుటే కూలబడిపోయాడు.


ఒక సందర్భంలో... ఒక వృద్ధురాలు తలపై సామాన్ల మూట పెట్టుకొని భారంగా నడుస్తోంది. ఆమె బాధను మహమ్మద్‌ చూడలేకపోయారు. ఆ మూటను అందుకొని మోస్తూ, ఆమె వెనకాలే నడవసాగారు. దారిలో ఆ వృద్ధురాలు మాట్లాడుతూ ‘‘చూడు బాబూ! ఈ ఊళ్ళో ఎవరో మహమ్మద్‌ అట! దైవ ప్రవక్తనని చెప్పుకొంటూ, చేతబడి చేసి, జనాన్ని తనవైపు తిప్పుకొంటున్నాడట. నువ్వు మాత్రం అతని వలలో పడకు’’ అని చెప్పింది. 


ఆ మాట విని ఆయన మౌనంగా ఉండిపోయారు. ఇంతలో ఆమె గమ్యస్థానం వచ్చింది. ఆ సామాను మూటను అక్కడ దించి, బయలుదేరడానికి మహమ్మద్‌ సిద్ధమయ్యారు. తనకు సహాయపడినందుకు ఆ వృద్ధురాలు సంతోషిస్తూ ‘‘నీ పేరేమిటి బాబూ!’’ అని అడిగింది.


‘‘మహమ్మద్‌’’ అని ఆయన బదులిచ్చారు.

‘‘మహమ్మద్‌ అంటే నువ్వేనా? ఇంత మంచి మనిషిని జనం మాంత్రికుడు, పిచ్చివాడు అంటున్నారేమిటి? నువ్వు ఎంతమాత్రం మాత్రికుడివి కాదు. నిజంగా దైవ ప్రవక్తవే’’ అంది.

జంతువుల పట్ల దైవ ప్రవక్త ఎంతో దయగా ఉండేవారు. తనకు ఎవరైనా కానుకలు ఇస్తే, దాని అవసరం తనకు ఎంతగా ఉన్నా... వేరొకరు అడిగితే వెంటనే ఇచ్చేసేవారు. ఆయనకు ఎందరో ఆహారాన్ని పంపేవారు. అయితే ఏనాడూ మహమ్మద్‌ ఒంటరిగా భుజించలేదు. తన సహచరులకు భాగం పంచిపెట్టేవారు. ఉన్నదాన్ని అందరితో పంచుకొని తినేవారు. ఆయన తన పనులను స్వయంగా చేసుకొనేవారు. నిరాడంబరమైన జీవితాన్ని గడిపిన దైవప్రవక్త... అదే విధమైన జీవితాన్ని గడపాలని తన సహచరులకు ఉపదేశించేవారు.

 మహమ్మద్‌ వహీదుద్దీన్‌