Abn logo
Apr 18 2021 @ 23:44PM

నిర్లక్ష్యానికి పరాకాష్ట!

కరోనా నిర్ధారణ ఫలితాల నమోదులో ల్యాబ్‌ సిబ్బంది నిర్లక్ష్యం

పాజిటివ్‌ వచ్చినా.. నెగెటివ్‌గా నమోదు చేస్తున్న వైనం

రెండు రోజుల తరువాత తీరిగ్గా.. పాజిటివ్‌ వచ్చిందంటూ ఫోన్లు

ఈలోగా బాధితుల నుంచి వందలాది మందికి వైరస్‌ వ్యాప్తి 

ఉన్నతాధికారుల ఉదాసీనతతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న సిబ్బంది


(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం) 

‘హలో రామారావు గారు.. ఇటీవల మీకు కొవిడ్‌ పరీక్ష చేశారు. రెండు రోజుల క్రితం నెగెటివ్‌ వచ్చినట్టు మీకు సమాచారం పంపాం. అయితే మా సిబ్బంది పొరపాటు వల్ల మీకు నెగెటివ్‌ వచ్చినట్టు రిపోర్టు పంపించారు. కానీ వాస్తవంగా మీకు పాజిటివ్‌ వచ్చింది. మీకు కరోనా లక్షణాలు ఉంటే వెంటనే దగ్గరల్లోని ఆస్పత్రిలో చేరండి. అంత వరకు కుటుంబ సభ్యులకు దూరంగా ఒక గదిలో ఉండండి’.... కొవిడ్‌ పరీక్ష చేయించుకుని, నెగెటివ్‌ రిపోర్టు వచ్చిందని సమాచారం రావడంతో విధి నిర్వహణలో ఉన్న ఓ ప్రైవేటు ఉద్యోగికి వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది నుంచి ఫోన్‌ ద్వారా తెలియజేసిన సారాంశం ఇది. 

  ఈ ఒక్క ఫోన్‌ కాల్‌.. కొవిడ్‌ పరీక్షా ఫలితాల వెల్లడిలో సిబ్బంది ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ముఖ్యంగా కొవిడ్‌ ల్యాబ్‌లో పని చేస్తున్న సిబ్బంది అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఫలితాలను ఆన్‌లైన్‌లో(ఐసీఎంఆర్‌, ఇతర అధికారులకు అందించే డేటా) పొందుపరచడం వల్ల వందలాది మందికి కరోనా సోకేందుకు కారణమవుతున్నారు. ముఖ్యంగా వీరి నిర్లక్ష్య ధోరణి కొంత మంది వైరస్‌ బాధితుల ప్రాణాలతో చెలగాటమాడడంగానే భావించాలని నిపుణులు, అధికారులు పేర్కొంటున్నారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి ఫలితాలను నెగెటివ్‌గా పేర్కొనడం వల్ల సదరు వ్యక్తి.. ఇంట్లో, బయట అందరితో కలిసి తిరుగుతాడని, దీనివల్ల చాలా మంది వైరస్‌బారిన పడే ప్రమాదం వుందని ఆందోళన చెందుతున్నారు. ‘కరోనా నెగెటివ్‌ రిపోర్ట్‌’ అని చెప్పిన రెండు, మూడు రోజుల తరువాత సిబ్బంది తీరిగ్గా.. ఫోన్లు చేసి ‘మీకు పొరపాటున నెగెటివ్‌ అని చెప్పామని, కానీ మీకు పాజిటివ్‌’ అని చెబుతున్నారు. అప్పటికే సదరు పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి 50 నుంచి 100 మందినైనా ప్రత్యక్షంగా కలిసి ఉంటారు. ఆయా వ్యక్తులు సెకండరీ కాంటాక్టుగా ఒక్కొక్కరు 20 నుంచి 30 మందిని కలిసే అవకాశముంది. కొవిడ్‌ పరీక్షా కేంద్రం సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఒక వ్యక్తి నుంచి వందల మందికి వైరస్‌ వ్యాప్తి చెందవచ్చు. కొవిడ్‌ ఫలితాన్ని సక్రమంగా నమోదు చేయడంలో సిబ్బంది చేసే చిన్నపాటి తప్పిదం వల్ల తీవ్రమైన నష్టానికి దారి తీయొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. 


ప్రాణాలతో చెలగాటమే.. 

సాధారణంగా కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులు అత్యంత అప్రమత్తంగా ఉంటారు. లక్షణాలనుబట్టి ఏ ఆస్పత్రిలో చేరాలి, ఎక్కడ వైద్యం చేయించుకోవాలో నిర్ణయించుకుంటారు. అదే ఫలితం నెగెటివ్‌ వస్తే.. శరీరంలో లక్షణాలు ఉన్నా.. చాలా మంది తేలిగ్గా తీసుకుంటారు. అయితే పాజిటివ్‌ వచ్చి.. సిబ్బంది నిర్లక్ష్యం వల్ల నెగెటివ్‌గా భావించే వారి పాలిట ఇది పెనుప్రమాదంగా మారే అవకాశముంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాల మీదకు రావచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. పాజిటివ్‌ లక్షణాలు ఉన్నా... ఫలితం నెగెటివ్‌ వచ్చింది కాబట్టి తనకు ఎటువంటి సమస్య ఉండకపోవచ్చని చాలా మంది భావిస్తారు. దీనివల్ల సదరు వైరస్‌ బాధితుడు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం వుందని, సిబ్బంది నిర్లక్ష్యంగా నమోదు చేసిన ఫలితం వందలాది మందికి వైరస్‌ వ్యాప్తికి కారణం కావడంతోపాటు కొన్ని సందర్భాల్లో ప్రాణాల మీదకు తీసుకువచ్చే ప్రమాదం వుందని అంటున్నారు.


అందరికీ అదే సమాచారం.. 

కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలతో బాధపడే వ్యక్తి నుంచి నమూనా సేకరించడం దగ్గర నుంచి ల్యాబ్‌లో పరీక్షించేంత వరకు జరిగే ప్రక్రియ మొత్తంతో పోలిస్తే.. వచ్చిన ఫలితాన్ని అత్యంత జాగ్రత్తగా పొందుపర్చడమే కీలకం. వచ్చిన ఫలితానికి, అధికారులకు అందించే ఫలితానికి మధ్య ఏమాత్రం తేడా ఉన్నా ప్రమాదంగానే భావించాలి. అందుకే ఈ ల్యాబ్‌లో చేరినప్పుడే సిబ్బందికి ఒకటికి రెండుసార్లు ఫలితాలను నమోదు చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తారు. అయినప్పటికీ, కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఈ తరహా తప్పులకు పాల్పడుతున్నారు. అటువంటివారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా మరోసారి ఈ తరహా పొరపాట్లకు ఆస్కారం లేకుండా చేయాలని పలువురు పేర్కొంటున్నారు. రోజువారీ నమోదు చేసే ఫలితాల్లో ఈ తరహావి ఎన్ని ఉన్నాయో తెలియడం లేదని పేర్కొంటున్నారు. కొవిడ్‌ ల్యాబ్‌లో పని చేసే సిబ్బందిపై పర్యవేక్షణ పెంచాల్సిన అవసరం ఉన్నతాధికారులపై ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. 


నూరు శాతం వాస్తవ ఫలితం రాదు

కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షల్లోనూ నూటికి నూరు శాతం వాస్తవ ఫలితం రాదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కొవిడ్‌ పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చినా.. కరోనా లక్షణాలతో బాధపడుతున్న వాళ్లు కొంత అప్రమత్తంగా ఉండాలని, లక్షణాలనుబట్టి వైద్య నిపుణుల సలహా మేరకు అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. అంత వరకు కుటుంబ సభ్యులు, సన్నిహితులకు దూరంగా ఉండడం ద్వారా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చని పేర్కొంటున్నారు. మరో నెల రోజులపాటు వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా వుంటుందని, అందువల్ల ప్రజలు మరింత జాగ్రత్తగా వుండాలని సూచిస్తున్నారు. 


38 ప్రైవేటు ఆస్పత్రుల్లో సగం బెడ్లు రిజర్వు 

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండంతో జిల్లా యంత్రాంగం ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా పడకలను సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ పరిధిలోని ఏడు ఆస్పత్రుల్లో 1,650 బెడ్లు ఇప్పటికే అందుబాటులోకి తీసుకువచ్చారు. తాజా 38 ప్రైవేటు ఆస్పత్రులను గుర్తించారు. ప్రతి ఆస్పత్రిలో మొత్తం బెడ్లలో సగం కొవిడ్‌ బాధితులకు కేటాయించాలని ఇప్పటికే యాజమాన్యాలను ఆదేశించారు. ఇదిలావుండగా ఎటువంటి పాజిటివ్‌ రిపోర్టు వచ్చినప్పటికీ కొవిడ్‌ లక్షణాలు లేని వ్యక్తులు, హోమ్‌ ఐసోలేషన్‌కు అవకాశం లేని వారికి కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటుచేసి, రెండు వేల బెడ్లు సిద్ధం చేస్తున్నారు. త్వరలో వీటిని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇదిలావుండగా జిల్లాలో కొవిడ్‌ పరీక్షల నిర్వహణలో ఇబ్బందులులేవని జాయింట్‌ కలెక్టర్‌ అరుణ్‌బాబు తెలిపారు. కొవిడ్‌ అనుమానం ఉన్న లేదా కొవిడ్‌ లక్షణాలున్న వ్యక్తులు మాత్రమే పరీక్షలు చేయించుకోవాలన్నారు. ప్రస్తుతం ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేస్తున్నారని, శస్త్ర చికిత్సలు అవసరమైన రోగులు, డెలివరీకి వచ్చే గర్భిణులకు మాత్రం రాపిడ్‌ టెస్టులు చేస్తున్నారని ఆయన చెప్పారు.68,000  ప్లస్‌


జిల్లాలో ఉధృతంగా కరోనా సెకండ్‌ వేవ్‌

కొత్తగా 551 మందికి వైరస్‌ నిర్ధారణ

68,447కు చేరిన పాజిటివ్‌ కేసులు

చికిత్స పొందుతూ మరొకరి మృతి

569కు చేరిన కొవడ్‌ మరణాలు


విశాఖపట్నం, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి) : 

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు 68 వేలు దాటాయి. ఆదివారం 551 మందికి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. వీటితో కలిపి జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసులు 68,447కు చేరాయి. వీరిలో 63,816 మంది వైరస్‌ నుంచి కోలుకోగా,  4,062 మంది చికిత్స పొందుతున్నారు. కాగా చికిత్స పొందుతూ ఆదివారం ఒకరు మృతి చెందడంతో జిల్లాలో కొవిడ్‌ మరణాలు 569కి చేరాయి. ఈ నెల ఒకటో తేదీన 189 పాజిటివ్‌ కేసుల నమోదుతో మొత్తం కేసులు 62,487కు చేరాయి. 17 రోజుల్లోనే సుమారు ఆరు వేలు పెరగడం జిల్లాలో కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రతకు అద్దం పడుతున్నది.
జిల్లాకు 62 వేల డోసుల వ్యాక్సిన్‌

నేడు ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌, ఆరోగ్య సిబ్బందికే ప్రాధాన్యం

ఒకటి రెండు రోజుల్లో మరో 3 లక్షల డోసుల వ్యాక్సిన్‌ రాక

విశాఖపట్నం, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం విశాఖ జిల్లాకు శనివారం రాత్రి పంపిన 62 వేల డోసుల వ్యాక్సిన్‌ను ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌, ఆరోగ్య సిబ్బందికే వినియోగించాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. సోమవారం నుంచి వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పునఃప్రారంభిస్తామని, అయితే ముందుగా నిర్ణయించినట్టు ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌, ఆరోగ్య సిబ్బందికే  తొలిప్రాధాన్యం ఇస్తామని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ సూర్యనారాయణ తెలిపారు. జిల్లాకు చేరిన 62 వేలు డోసుల వ్యాక్సిన్‌లో 51 వేల డోసులు కొవిషీల్డ్‌, 11 వేల డోసులు కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ వచ్చాయన్నారు. సోమ, మంగళవారాల్లో రెండు నుంచి మూడు లక్షల డోసుల వ్యాక్సిన్‌ వచ్చే అవకాశముందని, తరువాత జిల్లాలో యథావిధిగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తిస్థాయిలో కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.


Advertisement
Advertisement
Advertisement