Advertisement
Advertisement
Abn logo
Advertisement

స్థలం మాది.. వ్యాపారం మీది

స్థలం మాది.. వ్యాపారం మీది

సిద్దిపేట శివారులో ప్లగ్‌ అండ్‌ ప్లే సెంటర్‌

టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలో శ్రీకారం

శరవేగంగా రూపుదిద్దుకుంటున్న ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌

యువత, నిరుపేద ఔత్సాహికులకు ప్రాధాన్యం

మంత్రి హరీశ్‌ చొరవతో తొలి సెంటర్‌ 

చిరు పరిశ్రమల నిర్వహణకు ప్రోత్సాహం


పారిశ్రామిక ప్రాంతంగా సిద్దిపేట జిల్లా ఇప్పుడిప్పుడే ఒక్కో మెట్టు ఎక్కుతున్నది. అయితే వ్యాపారంలో ఆసక్తి ఉన్నా.. తగిన వసతి లేని ఔత్సాహికులను ప్రోత్సహించడానికి రాష్ట్రంలోనే తొలిసారిగా ప్లగ్‌ అండ్‌ ప్లే ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ సెంటర్‌ను సిద్దిపేట ప్రాంతానికి తెచ్చారు. త్వరలోనే ఇది అందుబాటులోకి రానున్నది.ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, నవంబరు 27 : తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన(టీఎస్‌ఐఐసీ) ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల భూములు సేకరిస్తున్నారు. నూతన పరిశ్రమల ఏర్పాటు, ఇండస్ర్టియల్‌ కారిడార్‌ నిర్వహణ దిశగా ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం సిద్దిపేట శివారులోని మందపల్లి, ముండ్రాయి, నర్సాపూర్‌ గ్రామాల పరిధిలో పెద్ద ఎత్తున భూమి సేకరించారు. ఇక్కడే ఆటోనగర్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ర్టీలను నెలకొల్పుతున్నారు. తాజాగా నంగునూరు మండలం నర్మెట గ్రామంలో ఆయిల్‌ ఫామ్‌ పరిశ్రమను నిర్మించడానికి స్థల సేకరణ చేశారు. ఇదే కోవలో రాష్ట్రంలోనే తొలిసారిగాసిద్దిపేటలో ప్లగ్‌ అండ్‌ ప్లే ప్యాక్టరీ కాంప్లెక్స్‌ సెంటర్‌కు శ్రీకారం చుట్టారు.


ప్లగ్‌ అండ్‌ ప్లే సెంటర్‌ అంటే..

ప్లగ్‌ అండ్‌ ప్లే సెంటర్‌ అంటే ఒక చిరు పరిశ్రమల సమూహం. దీనిని ఫ్యాక్టరీ కాంప్లెక్‌గానూ పిలుస్తారు. ఇక్కడ చిన్న తరహా పరిశ్రమలను ఏర్పాటు చేయడం కోసం వసతి కల్పిస్తారు. విద్యుత్‌ సౌకర్యం, ఇతర సౌకర్యాలు ఉంటాయి. ఈ కాంప్లెక్స్‌లో అనేక రకాల పరిశ్రమలను ఏర్పాటు చేసుకునే వీలుంటుంది. దీనిని కొన్ని యూనిట్లుగా విభజించి ఒక్కో యూనిట్‌ స్థలాన్ని అద్దెకు ఇస్తారు. లేదా లీజుకు ఇచ్చే అవకాశం ఉంది. ప్లగ్‌ అంటే విద్యుత్‌ సౌకర్యం, ప్లే అంటే అన్ని రకాల వసతుల కల్పనతో సిద్ధం చేయబడిన ఏరియా అని అర్థం. విదేశాలలో ఈ ప్లగ్‌ అండ్‌ ప్లే టెక్‌ సెంటర్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. మన దేశంలోనూ మెట్రోపాలిటన్‌ నగరాల్లో ఉన్నాయి.

  

యుద్ధప్రాతిపదికన నిర్మాణం

ప్రస్తుతం సిద్దిపేట అర్బన్‌ మండలం మందపల్లి శివారులో ఈ ప్లగ్‌ అండ్‌ ప్లే సెంటర్‌ను నిర్మిస్తున్నారు. 5 ఎకరాల స్థలంలో మొదటి, రెండు అంతస్థుల వారీగా నిర్మాణం జరుగుతోంది. ఇందులో 1500 చదరపు ఫీట్ల చొప్పున ఒక యూనిట్‌గా విభజించారు. ఈ 1500 చదరపు ఫీట్ల స్థలంలో వ్యాపారం చేయడానికి అన్ని వసతులు కల్పిస్తారు. దీనిని ఒక యూనిట్‌గా విభజించి లీజుకు ఇవ్వనున్నారు. ఇలా తొలి దశలో 20 మంది కొత్తవారిని ఎంపిక చేయనున్నారు. పారిశ్రామిక రంగంలో అవగాహనతోపాటు ఇతర అర్హతలను పరిశీలించి వారికి ఈ స్థలాన్ని అద్దెకు ఇస్తారు. సృజనాత్మకత కలిగిన ఆలోచనలు ఉన్నా పేదరికం అడ్డుగా ఉన్న చిరువ్యాపారులకు తొలి ప్రాధాన్యం కల్పించనున్నారు. మందపల్లిలోని డీఎక్స్‌ఎన్‌ పరిశ్రమకు సమీపంలోనే ఈ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. త్వరలోనే అర్హుల ఎంపికపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించనున్నారు. మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతోనే ఈ ప్లగ్‌ అండ్‌ ప్లే సెంటర్‌ సాకారమైంది. తెలంగాణలోనే మొదటి సెంటర్‌ను ఇక్కడే ఏర్పాటు చేయనుండడంతో పక్కా ప్రణాళిక ప్రకారం నిర్మాణం చేపట్టారు. జిల్లాను ఒక పారిశ్రామిక ప్రాంతంగా, కాలుష్య రహిత పరిశ్రమలకు చిరునామాగా చేయాలనే దృక్ఫథంతో మంత్రి హరీశ్‌రావు ఈ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. 


Advertisement
Advertisement