ప్రణాళిక ఆయనదే!

ABN , First Publish Date - 2021-01-01T06:31:22+05:30 IST

‘‘మానవులు సొంత అవగాహనల మీదా, ఆలోచనల మీదా ఆధారపడకుండా హృదయపూర్వకంగా దైవాన్ని విశ్వసించాలి. మన మార్గాలన్నిటిలోనూ ఆయనను పరిగణనలోకి తీసుకోవాలి.

ప్రణాళిక ఆయనదే!

‘‘మానవులు సొంత అవగాహనల మీదా, ఆలోచనల మీదా ఆధారపడకుండా హృదయపూర్వకంగా దైవాన్ని విశ్వసించాలి. మన మార్గాలన్నిటిలోనూ ఆయనను పరిగణనలోకి తీసుకోవాలి. అప్పుడే ఆమార్గాలన్నిటినీ ఆయన సుగమం చేస్తాడు’’ (సామెతలు 3:5-6). కొత్త సంవత్సరాన్ని కొందరు సెలవు దినంగా భావించి వేడుకలు చేసుకుంటారు. చాలా కొద్దిమంది మాత్రం ఆత్మావలోకనం చేసుకొనే సందర్భంగా పరిగణిస్తారు.


దైవాన్ని పూర్తిగా విశ్వసించి, ఆయన మార్గంలో ప్రయాణం చేస్తున్న వారికి ప్రతి రోజూ కొత్తదే. పాత జీవితంలోని పేజీలను తొలగించి, కొత్త జీవితాన్ని లిఖించుకోవాలనుకొనేవారికి దైవం నుంచి ఎల్లప్పుడూ సహాయం అందుతుంది. కొత్త ఏడాదిలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా... ఇంతకుముందు మనం దైవం నుంచి అందుకున్న సహాయాలను గుర్తుచేసుకోవాలి. మనం తీసుకుంటున్న ప్రతి ఊపిరీ ఒక అద్భుతం. అది మనకు సృష్టికర్త ఇచ్చిన, ఆయన మాత్రమే ఇవ్వగలిగిన ఒక గొప్ప వరం.


గాలీ, నీరూ, ప్రకృతి... ఇలా వెలలేని సంపదలు ఎన్నో తన బిడ్డలైన మానవులకు ఆయన అనుగ్రహించాడు. అందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకొంటూ... నూతన సంవత్సరాన్ని ప్రారంభించాలి. జీవితాంతం ఈ కృతజ్ఞతల చెల్లింపును కొనసాగించాలి. అలాగే తెలిసో, తెలియకో ప్రతిఒక్కరూ కొన్ని చెడ్డ కర్మలు చేసి ఉంటారు. వాటికి పశ్చాత్తాపం చెందాలి. ఆత్మశోధన చేసుకోవాలి. తన కాంతిని మన జీవితాల్లో ప్రసరించడం ద్వారా ఆ పాపాల చీకటిని తొలగించాలనీ, మన కోసం కొత్త దారులను తెరవాలనీ దైవాన్ని ప్రార్థించాలి.


దైవానికి మనల్ని దగ్గర చేసే కొత్త దారుల్ని అన్వేషించాలి. పవిత్ర గ్రంథాన్ని పఠించడం, సువార్తను అర్థం చేసుకోవడం, దానిలోని గొప్ప విషయాలను పాటించడం ద్వారా మనల్ని మనం పునరుత్తేజపరచుకోవాలి. దేనికోసమో అత్యాశ పడడం,  భవిష్యత్తు గురించి బెంగపెట్టుకోవడం వల్ల ఆందోళన చెందడం తప్ప మరే ప్రయోజనమూ లేదు. మన భవిష్యత్తుకు ప్రణాళిక వేసేదీ, నడిపించేదీ దైవమే. ఆయనే మన బలం. ఆయన మనతోనే ఉన్నాడు. మనం చేయాల్సిందల్లా ప్రార్థన.... దైవం చూపిన దారిలో ఎలాంటి సంకోచం, సంశయం లేకుండా ముందుకు సాగడం. 


Updated Date - 2021-01-01T06:31:22+05:30 IST