వంతెనల్ని కలగన్న కవి

ABN , First Publish Date - 2020-06-22T08:03:28+05:30 IST

‘‘పదాలు చలివల్ల చావవు సాహసం లేకపోతే చచ్చిపోతాయి చాలాసార్లు వాతావరణంలో తడివల్ల చచ్చిపోతాయి పదాలు’’...

వంతెనల్ని కలగన్న కవి

కేదార్‌నాథ్‌ సింగ్‌ కవిత్వంలో అత్యధికంగా కనబడే ఇమేజ్‌ రెండింటిని కలిపే ఇమేజ్‌. కలిపేది ఏదైనా ఆయన ఇష్టపడేవారు. రోడ్డయినా, వంతెనయినా, పదం అయినా... ఆయన ప్రజలను కలిపేది ఏదైనా ఇష్టపడేవారు.


‘‘పదాలు చలివల్ల చావవు 

సాహసం లేకపోతే చచ్చిపోతాయి

చాలాసార్లు వాతావరణంలో తడివల్ల

చచ్చిపోతాయి పదాలు’’ (‘పదం’, 1985).



హిందీ సాహిత్య జగత్తులో కేదార్‌నాథ్‌ సింగ్‌ పేరు తెలియని వారెవ్వరు ఉండరు. కేదార్‌నాథ్‌ సింగ్‌ కవిత్వంలో అత్యధికంగా కనిపించే భావం ‘కలపడం’. కలిపేది ఏదైనా ఆయనకిష్టం. అది రోడ్డు కావచ్చు. వంతెన కావచ్చు. ఏదైనా సరే మనుషుల్ని కలిపేది మానవత్వానికి అవసరం. 


కేదార్‌నాథ్‌ సింగ్‌ కవిత్వంలో పల్లెకు, పట్టణానికి మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈయన రాసిన దీర్ఘకవిత ‘బాఘ్‌’ చాలా పేరుపొందింది. ఆధునిక కవిత్వంలో ఒక మైలురాయిగా నిలిచింది. కేదార్‌నాథ్‌ సింగ్‌ జుల్‌ 7, 1934లో జన్మించారు. హిందీ కవితా జగత్తులో తనదైన అధ్యాయం రాసుకుని మార్చి 19, 2018న న్యూఢిల్లీలో మరణించారు. ఆయన రాసిన చివరి కవిత పేరు ‘జావుంగా కహాం’ (ఎక్కడికి వెళ్లేది?) ఈ కవితలో కొన్ని వాక్యాలు ఆయన వీడ్కోలు చెబుతున్నట్లు అనిపిస్తాయి: ‘‘ఎక్కడికి వెళ్ళేది? ఇక్కడే ఉంటాను/ ఏదన్నా తలుపుపై చేతిముద్ర మాదిరిగా/ ఏదన్నా పాత బీరువాలో లేదా సందూకు వాసనలో/ అలా పడి ఉంటాను’’ 


‘అభీ బిల్‌ కుల్‌ అభీ’, ‘జమీన్‌ పాక్‌ రహీ హై’, ‘యహాం సే దేఖో’, ‘అకాల్‌ మేం సారస్‌’, ‘ఉత్తర్‌ కబీర్‌ ఒర్‌ అన్య్‌ కవితాయేం’, ‘టాలెస్టాయ్‌ ఔర్‌ సైకిల్‌’, ‘సృష్టి పర్‌ పహరా’ ఈయన రాసిన కవిత్వ సంపుటులు. ‘కల్పనా ఔర్‌ ఛాయావాద్‌’, ‘ఆధునిక్‌ హిందీ కవితా మే బింబ్‌ విధాన్‌’, ‘మేరే సమయ్‌ కే శబ్ద్‌’, ‘మేరే సాక్షాత్కార్‌’ పేరుతో విమర్శ పుస్తకాలు కూడా రాశారు. ఆయన చాలా సరళమైన భాష వాడేవారు. సాధారణమైన, రోజు వారి వాడుక భాషను ఉపయోగించేవారు. అయితే ఆయన శైలి అనితరసాధ్యమైనది. నదీఝరిలా సాగిపోయే శైలి. కవిత్వాభివ్యక్తికి భాష సరి పోదని ఈయన అభిప్రాయపడే వారు. 


అజ్ఞేయ్‌ సంపాదకత్వంలో ‘తీస్రా సప్తక్‌’ కవిత్వసంకలనం వచ్చినప్పుడు అందులో కేదార్‌ నాథ్‌ సింగ్‌ తన పరిచయంలో రాసిన మాటలు గమనార్హమైనవి. ‘‘కవిత్వం, సంగీతం, ఒంటరితనం.. ఈ మూడు నాకు చాలా ఇష్టం. ప్రతిరోజు పనులు ముగిం చుకుని సాయంత్రం ఇంటికి చేరుకున్న తర్వాత కొంత సేపటివరకు గది అనబడే రాక్షసుడితో పోరాటం తప్పదు. మా ఇద్దరిలో ఎవరూ ఒడిపోరు. మా ఇద్దరి మధ్య సంధి కూడా కుదరదు. అసలు మా ఇద్దరిమధ్య మూడోవాడు కూడా ఉన్నాడు. వాడింకా పుట్టలేదని మా ఇద్దరి అభిప్రాయం కావచ్చు. మా ఇద్దరి మధ్య సంఘర్షణ బహుశా వాడికోసమే కావచ్చు.’’  


కేదార్‌నాథ్‌ సింగ్‌ కవిత్వంలో ఈ మూడో మనిషి కోసం వెదుకులాట కనబడుతుంది. ఆయన రాసిన కవిత ‘మూడో వాడు’ను పరిశీలిస్తే, అందులో అనేక పొరలు కనిపిస్తాయి. కేదార్‌నాథ్‌ సింగ్‌ ఇమేజరీ చాలా లాఘవంగా ఉపయోగించే కవి. తీస్తే సప్తక్‌ లో ఆయన ఈ మాటలు చెప్పాడు. శిల్పం విషయంలో తాను ప్రతిమలను చాలా ఇష్టపడతానని అన్నారు. 


‘‘నా ఇల్లు గంగకు, ఘాఘ్రాకు మధ్యన ఉన్నది. ఇంటి ముందు ఒక కాలువ ఉంది. ఈ కాలువ ఆ రెండింటిని కలుపుతుంది. నా లోపల కూడా గంగా, ఘాఘ్రా అలలు ఒకదానితో ఒకటి ఢీకొంటున్నాయి. నేను పల్లెలోని స్వచ్ఛ మైన వాతావరణాన్ని వదిలి పట్టణంలోని పొగచూరిన వాతావరణానికి వచ్చిన రోజున నా మనస్సులో మొక్క జొన్న పొలాలు, విశాల మైదానాలు, దూరదూరంగా వెళు తున్న కాలిబాటలు ఎంత స్పష్టంగా ఉండేవో ఈ రోజు కూడా వాటి చిత్రాలు అంతే స్పష్టంగా ఉన్నాయి.’’


ఈ మాటలు చదివిన తర్వాత కేదార్‌నాథ్‌ సింగ్‌ పట్టణం లోకి వచ్చిన తర్వాత కూడా వెదికింది ఆ మూడో వ్యక్తినే అని అర్థమవుతుంది. కేదార్‌నాథ్‌ సింగ్‌ కవిత్వంలో అత్యధికంగా కనబడే ఇమేజ్‌ రెండింటిని కలిపే ఇమేజ్‌. కలిపేది ఏదైనా ఆయన ఇష్టపడేవారు. రోడ్డయినా, వంతెనయినా, పదం అయినా ఆయన ప్రజలను కలిపేది ఏదైనా ఇష్టపడేవారు. ఆయనకు బాల్యంలోని గుర్తులు, ఉత్తరప్రదేశ్‌, బీహారు సరిహద్దుల్లో పొద్దుతిరుగుడు పొలాలు, ఘాఘ్రాపై కట్టిన మాంఝీ వంతెన ఆయన జీవితాంతం వాటిని మరిచి పోలేదు. తన కవిత్వంలో వాటిని ఆయన రాసుకున్నారు ‘‘వంతెన అంటే ఏమిటి?/ మనిషిని తనవైపు ఎందుకు లాగుతుంది వంతెన/ రాత్రి చిట్టచివరి రైలు/ మాంఝీ వంతెనపై పట్టాలెక్కినప్పుడు/ మా బస్తీలో ప్రతి మనిషి/గాఢనిద్రలో ఉంటేనేం, అటు ఇటూ ఊగుతుంటాడు’’ (‘మాంఝీకా పుల్‌’, 1979) 


ఈ వంతెన కూలిపోతుం దేమో అనే భయం ఒకటి ఆయన్ను వెంటాడుతూ ఉండేది. కలిపేది ఏదైనా ధ్వంసమవుతుందనే భయం ఆయనకు ఎల్లప్పుడు ఉండేది. ‘‘నాకు అనిపించేది/ అలా అనిపించినప్పుడు వణికిపోయేవాడిని/ ఈ ఊరివాళ్ళకు ఒకరోజున/ ఈ మాంఝీ వంతెన అక్కడ లేదని తెలిస్తే/ వారికి ఎలా ఉంటుంది?/ నన్ను నేనే చాలా సార్లు ప్రశ్నించుకున్నాను/ అసలు ఎవరు గొప్ప/ నదిపై నిలబడిన మాంఝీ వంతెన గొప్పదా/ లేక/ ప్రజల మనస్సుల్లో వేలాడుతున్న మాంఝీ వంతెన గొప్పదా’’. 


ఆయన మనసులో ఉన్న భయం పదాలు తమ ప్రభా వాన్ని కోల్పోతాయేమో అన్న భయం. ఒక చీకటి రోడ్డుపై, ముఖాన్ని కప్పుకుని, చేతుల్లో ఇల్లూవాకిలి లాంటివి పట్టు కుని, నాలుగైదు అందమైన పదాలు ఆయన్ను చుట్టు ముట్టి నప్పుడు, రొప్పుతూ ఒక గూనిపదం అక్కడికి వచ్చి.. ‘‘పదండి తీసుకువెళతాను’’ అంది అని రాశాడు. ఆయనకు పదాలపై చాలా నమ్మకం: 


‘‘పదాలు చలివల్ల చావవు 

సాహసం లేకపోతే చచ్చిపోతాయి

చాలాసార్లు వాతావరణంలో తడివల్ల

చచ్చిపోతాయి పదాలు’’ (‘పదం’, 1985). శబ్ద్‌ అనేపదం ఆయన కవితల్లో చాలాసార్లు కనబడుతుంది. ఆయన అంతః చేతనలో ఈ పదం ఎక్కడో స్థిరపడిపోయింది. రోటీ అనే కవితలో ఆయన ధాన్యం గింజను, పదంతో పోల్చుతారు: ‘‘ఊరుకుంటే లాభం లేదు/ నేను మిత్రులకు చెప్పి పరు గెత్తాను/ సరాసరి పొలాల్లోకి/ అక్కడ పదాలు పండిపో యాయేమో’’. ఆయనకు పదాల పరిమితులు తెలుసు. 1978లో ఆయన ‘ముక్తి’ అనే కవిత రాశారు. అందులో కూడా పదాలు ఆయన్ను చుట్టుముడతాయి. ఆయన వాటిని మనిషి వైపు విసరడానికి ప్రయత్నిస్తాడు: ‘‘మనిషికి ఏమీకాదని తెలిసి కూడా/ నేను రోడ్డుపై ఆ విస్ఫోటం వినాలనుకుంటున్నాను/ మనిషిని పదం ఢీకొన్నప్పుడు జరిగే విస్ఫోటం/ రాయడం వల్ల ఏమీ కాదని తెలుసు/ అయినా రాయాలనుకుంటున్నాను.’’ 


కేదార్‌నాథ్‌ సింగ్‌ కవితల్లో స్వచ్ఛమైన ప్రకృతి ప్రతిమలు ఎన్నో కనిపిస్తాయి. నది, కాలువ, దున్నిన పొలాలు, పిచ్చు కలు, ప్రాక్‌ పశ్చిమాలు, గడ్డి వగైరాలు ఆయన కవితల్లో తరచు కనిపించే దృశ్యాలు. ఆయన గంగానదిని చూస్తున్న ప్పుడు కేవలం గంగానది ప్రవాహాన్ని మాత్రమే కాదు, దాని ఒడ్డున నిలబడిన ముసలి, నిరుపేద పడవవాడిని కూడా చూసేవారు. గంగానదికి నిష్కల్మషంగా వీడ్కోలు పలకడాన్ని చూసేవారు: ‘‘బహుశా వాడి కన్నులు అంటున్నాయి/ ఇక చీకటి పడింది/ సరే గంగతల్లి/ ఇక ఉంటాను’’. 


పట్టణం ప్రజల గుర్తింపును మింగేసే వస్తువు. పొలంలో పండే ఆహారధాన్యానికి కూడా ఇది తెలుసు. అందుకే కల్లం నుంచి వెళ్ళేముందు ఆహారధాన్యాలు చాలా కలతచెందుతు న్నాయి: ‘‘వద్దు/ మనం బజారుకు వెళ్ళవద్దు/ కల్లంనుంచి లేస్తూ అంటున్నాయి ధాన్యం గింజలు/ వెళితే మళ్ళీ వెనక్కి వచ్చేది లేదు./ వెళుతూ వెళుతూ చెప్పి వెళుతున్నాయి ధాన్యం గింజలు/ ఒకవేళ మేం తిరిగి వచ్చినా/ నువ్వు మమ్మల్ని గుర్తించనేలేవు./ తమ చివరి లేఖలో/ రాసి పంపించాయి/ ధాన్యం గింజలు’’. మనిషిని, ధాన్యాన్ని అన్నింటిని మార్చేసే మార్కెట్‌ బలం గురించి ఆయన స్పష్టంగా రాశాడు. ధాన్యం గింజ అనేది నిజానికి మనిషి ఉనికికి ప్రతీక. ధాన్యం గింజ అనే పదం కూడా ఆయన కవితల్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది.


బెనారస్‌లో ఊరి వాసన గుప్పుమంటుంది. అది ఆయనకు చాలా ఇష్టం. పట్టణం అనేది దేశీ జ్ఞాపకాలను తుడిచేసే ప్రాంతం. ఢిల్లీలో కూడా ఆయన పల్లెను తన గుండెల్లో పెట్టుకుని తిరిగేవాడు: ‘‘మిత్రమా, ఇది చాలా కష్టం/ ఈ విశాలమైన రోడ్డుపై/ ఒక ఆకులా ఎగరడం/ ఈ నగరం ఢిల్లీలో/ పొద్దుటి నుంచి రాత్రి వరకు/ మన చేతనలో/ ఒక ముసలి, నిస్తేజ పశు కాపరి ముఖంపెట్టుకుని/ తిరగడం/ చాలా కష్టం’’. 


కేదార్‌నాథ్‌ సింగ్‌ కవిత్వంలో అనేక అద్భుత మైన ప్రతిమలు, రూపకాలు, ప్రతీకలు ఒకదాని తర్వాత ఒకటి ఆశ్చర్యపరుస్తాయి. నగరంలో తప్పిపోయిన మనిషిని వెదికే ఆరాటం కనిపిస్తుంది. అదే ఆయన చెప్పుకునే ఇంకా పుట్టని ‘మూడవవాడు’: ‘‘ఇది ఎంత అద్భుతం/ నీరు పరుగె త్తుకు పోతోంది./ అక్కడ ఆ వంతెన, నది మధ్యన/ చేతులు చాచి/ అలాగే నిలబడి ఉంది’’. 


కేదార్‌నాథ్‌ సింగ్‌ కవితల్లో సగటు మనిషి జీవితం, జీవితంలోని దుఃఖం ఉంది. అంతేకాదు, ప్రేమభావాన్ని ప్రకటించిన కవితలు కూడా అద్భుతమైన అభివ్యక్తికి నిద ర్శనాలు. ఈ క్రింది వాక్యాల్లో ఎంత చక్కగా ఆయన చెప్పాడో చూడండి: ‘‘ ‘నేను వెళుతున్నాను’ ఆమె చెప్పింది/ ‘వెళ్ళు..’ నేనన్నాను/ వెళ్ళడం అనేది/ భాషలో చాలా భయంకర మైన క్రియాపదం అని తెలిసికూడా/ చెప్పాను’’. 


కేదార్‌నాథ్‌ సింగ్‌ కవిత్వాన్ని పరిశీలిస్తే గ్రామీణ జీవన చిత్రణ, ప్రకృతి చిత్రణ, ఆర్థిక సమస్యల చిత్రణ ప్రముఖంగా కనిపిస్తాయి. పల్లెను పట్టణంలో దర్శించడానికి, ధాన్యం గింజల్లో మనిషిని చూడ్డానికి, మార్కెటులో మరణిస్తున్న మానవత్వాన్ని బతికించడానికి రాసిన కవి. నాగార్జున్‌, త్రిలోచన్‌ శాస్త్రి, కేదార్‌నాథ్‌ అగర్వాల్‌ మాదిరిగా ఈయన కూడా పల్లెనుంచి వచ్చిన కవి. నేలను ప్రేమించే కవి. 

యాకూబ్‌

Updated Date - 2020-06-22T08:03:28+05:30 IST