మండే అక్షరాన్ని పిడికిట పట్టిన కవి

ABN , First Publish Date - 2022-01-12T06:48:31+05:30 IST

నూనూగు మీసాల జగిత్యాల యువకుల ఆలోచనల్లోంచి 1973లో ఆవిర్భవించిన సాహితీ మిత్ర దీప్తి చిరు కవితా, కథా సంకలనాలతో పాటు ఓ చిరస్మరణీయ కవిని కూడా కన్నది...

మండే అక్షరాన్ని పిడికిట పట్టిన కవి

నూనూగు మీసాల జగిత్యాల యువకుల ఆలోచనల్లోంచి 1973లో ఆవిర్భవించిన సాహితీ మిత్ర దీప్తి చిరు కవితా, కథా సంకలనాలతో పాటు ఓ చిరస్మరణీయ కవిని కూడా కన్నది. అతడే అలిశెట్టి ప్రభాకర్. చమురు తగ్గి ఆ సంస్థ క్రమంగా కొడికట్టినా జ్వలితాక్షరాల కలాన్ని మాత్రం కాపాడుకుంది. ఆ బాటలో ఎదుగుతూ ఎగదోస్తూ కల్లోలిత జగిత్యాల మట్టి మహత్తును తన కవితలకద్ది, తెలుగు నేలపై వెదజల్లి, ఆ వేడి చల్లారకుండా చూడమని అగ్నిగోళంలా మండుతూ అంతర్థానమైన కవి అలిశెట్టి.


తొలి అక్షరం నుంచి శ్రామిక పక్షాన నిలుస్తూ వచ్చిన ప్రభాకర్ కవిత్వానికి జగిత్యాల జైత్రయాత్ర సైద్ధాంతిక పునాదినిచ్చింది. అప్పటి నుంచి తన అక్షరాల సాలును ఈ త్యాగాల పోరుకు జోడించాడు. ‘‘చరిత్రకు రక్తపాతమే ఉపోద్ఘాతం/ చరిత్రకు చెమటబొట్టే ఆధారం/ చరిత్రకు ఆకలే ప్రేరణ’’ అని గళమెత్తాడు. తుపాకీ మొన మీద జగిత్యాల ఉన్న రోజుల్లో సైతం ‘‘కొమ్మ ఉండీ ఊగని/ కొలిముండీ మండని/ జీవితాలెందుకని’’ తెగువతో ప్రశ్నించాడు. ‘‘పీడితుల పక్షాన నిలిచి పోరుతున్న క్రమంలో నిస్సంకోచంగా నా కలమూ కుంచె రెండూ ఉంటాయ్’’ అని ప్రకటించి మాటకు కట్టుబడి బతికాడు.


ప్రభాకర్ దృష్టిలో కవిత్వం ప్రతిభా ప్రదర్శనో, పాండిత్య ప్రకర్షో కాదు. అదో భావజాల వాహకం, యుద్ధ సన్నాహం. ఎప్పుడైతే ఆయన తన అక్షరం ఉద్యమానికి ఉత్ప్రేరకం అనుకున్నాడో అప్పుడే ఆయనలో ఓ తాపసి జనించాడు. ఈ గమనంలో కష్టాలు కంటకాల్లా తగులుతాయని తెలిసినా, ఈ ప్రయాణంలో అలసి సొలసి ఎక్కడ రాలిపోయినా బతుకు పోరులో భాగమే అనుకున్నాడు. కాలక్రమంగా ఆయన ఆస్తి, ఆరోగ్యం తరిగిపోగా కవిత్వం దేదీప్యమానమైంది. ఆ క్రమంలో అత్యంత స్పష్టత, పారదర్శకతలతో దేశ రాజకీయాల్ని నగ్నంగా నిలబెట్టాడు.


‘‘స్వయంగా శవాలే/ రాబందుల వద్దకి నడిచొస్తుంటే/ అంతకంతకూ పెరుగుతున్న అజ్ఞాన పర్వతం/ చిన్న బ్యాలెట్ పెట్టెలో ఇమిడి పొతే/ మళ్లీ కోటీశ్వరుడి పుట్టలోంచి/ బుస కొట్టేదే ఈ దేశపు ప్రజాస్వామ్యం’’ అనే పంక్తులు నేటి దేశ రాజకీయ పరిస్థితుల నిగ్గు తేలుస్తాయి. యువత నిర్వీర్యత, మహిళ నిస్సహాయత, నేతల దుష్టపాలన ఆయన కావ్య క్షేత్రాలు. ఛీత్కారం, వేదన, సాహసం ఆయన అస్త్రాలు. మరో ప్రపంచమే ఆయన రాజీలేని స్వప్నం. ఆ సాధనలో నిర్విరామ సంగ్రామి అలిశెట్టి.


తన ఇరువై ఏండ్ల కవితా ప్రస్థానంలో ఎన్నడూ ఎక్కడా తన వ్యక్తిగత జీవన ప్రస్తావన తేలేదు. అయితే తన చివరి రోజుల్లో మాత్రం భార్య భాగ్యం ముఖంలోకి చూసి ప్రభాకర్ ఆవేదన చెందాడు. తట్టుకోలేని మనోభారంతో తన మరణానికి ఆరు నెలల ముందు వచ్చిన ‘సిటీలైఫ్’ సంపుటిలో ముందుమాటగా తన ఎలిజీని తానే రాసుకున్నాడు. చావువేలు పట్టుకొని వెళుతున్న మనిషి చివరిమాటగా ఛిద్రమైన తన జీవితాన్ని ఇందులో చిత్రించాడు: ‘‘ఒకప్పుడు పచ్చగా బతికినవాణ్ణి. ఇప్పుడు పత్రహరితం కోల్పోయి పిచ్చిమొక్కలా.. అస్థిపంజరంలా.. మందులు కొనుక్కోలేని నిర్భాగ్యపు నగరంలో ఊపిరితిత్తుల్లో క్షయ రాజుకోవడం పరిపాటైంది. నాలోని అరాచకం, క్రమశిక్షణారాహిత్యం వల్ల ఆరునెలల్లో అవలీలగా నయం చేసుకోవలసిన వ్యాధి అంచెలంచెలుగా ఎదిగి రెండు ఊపిరితిత్తులను పాడు చేసింది. ఆపాదమస్తకం నా దేహమే ఒక ఆసుపత్రి రోదనగా మారిపోయింది. పుట్టినగడ్డ నుండి ఇక్కడికి రావడమే పొరపాటైంది.’’ ...ఇలా ఏ మాత్రం దాపరికం లేకుండా పంచుకున్న తన హృదయఘోషలో తప్పొప్పుల ప్రస్తావన ఉంది. నడమంత్రాన ముగియబోతున్న తన జీవితానికి తానూ ఒక కారణమేననే వేదన ఉంది. పదాల్లో నిజాయితీ, చిత్తశుద్ధి ఉన్నాయి.


నిజానికి ప్రభాకర్ అనారోగ్య దుస్థితికి ఆయన నిర్లక్ష్యం ఎంతుందో ఆకాశమంత ఆయన ఆత్మాభిమానం అంతకన్నా ఎక్కువుంది. మరోవైపు నీడలా నిలువెత్తు నిబద్ధత, పట్టు సడలని పట్టింపుల వల్ల సినిమావాళ్లు ఇంటికొచ్చి అడిగినా రాయను పొమ్మన్నాడు. ఇప్పటికే రాసినవి వాడుకుంటామన్నా కుదురదన్నాడు. ‘‘ఎర్రని తేలు కుట్టిన మంటలాంటిది ఆకలి’’ అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు గాని గీసుకున్న గీత దాటలేదు.


చివరగా– చాలామంది మరిచిపోకుండా వేసే ప్రశ్న ప్రభాకర్ కుటుంబం ఎలా ఉందని. ప్రస్తుతానికైతే తెలుగు యూనివర్సిటీలో ప్రభాకర్ భార్య భాగ్యం ఒప్పంద ఉద్యోగం సర్వీసు ఇంకో నాలుగేళ్లు ఉంది. ఇద్దరు కొడుకుల్లో పెద్దోడు సంగ్రామ్ సంగీతం మాస్టారు. చిన్నోడు సంకేత్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం. తల్లికి చేదోడుగా ఉంటున్నారు. ఈ మధ్యనే నగర శివారులో ఓ ఇల్లు కట్టుకుంటూ అందులోకి మారారు. ‘ఒకప్పుడు పచ్చగా బతికిన వాణ్ణి..’ అని బాధగా రాసుకున్న ప్రభాకర్ లేని ఆయన కుటుంబం మళ్లీ చిగురిస్తోంది.

బి. నర్సన్

(జనవరి 12 అలిశెట్టి ప్రభాకర్ జయంతి, వర్ధంతి)

Updated Date - 2022-01-12T06:48:31+05:30 IST