సాఫల్య జీవన కావ్యం

ABN , First Publish Date - 2020-07-20T05:50:12+05:30 IST

‘‘అమ్మా! జాగ్రత్త!! కరోనా కాలం... జెర్ర పైలం’’ ముందున్న పోర్షన్‌లో అద్దెకుంటున్న ముసలమ్మతో అన్నాను...

సాఫల్య జీవన కావ్యం

‘‘అమ్మా! జాగ్రత్త!!

కరోనా కాలం... జెర్ర పైలం’’

ముందున్న పోర్షన్‌లో అద్దెకుంటున్న

ముసలమ్మతో అన్నాను


‘‘అయ్యా!

అగ్గెనగాండ్ల బొండిగె పిసికినట్లు

పెండ్లైన ఎనిమిదేండ్లకే

పెనిమిటి జచ్చిండు

కండ్లల్ల కెల్లి

చెర్వులు అల్గులు దుంకినై

పల్లేరు కాయల్ల

బొర్లిచ్చినట్లయి పాయె బత్కు

అవ్వగారింటికి పోదామంటే

ఆడ అన్నదమ్ముల

నెత్తుల మీద జెట్టక్కనే కూసునె

పిడాత పానం దీసుకుందామంటే

కడ్పుల పుట్టిన మూడు కొమ్మలుండె

ఇగ... గుండె దైర్నం జేసుకున్న సారూ

రెక్కలు ముక్కలు జేస్కోని

పిల్లల్ని సాది సవరిచ్చిన

ఉన్నొక్క ఆడివిల్లను

ఎదురు సూడని ఇంటికిచ్చిన

మొగ పోరగాండ్లకు

వర్దచ్చిన జూడకుంట

మంచి కాన్దాన్‌ల కెల్లి

ఇంటిదీపాలు నిల్పుకున్న

అందరి కడ్పులు పండి

మన్మలు మన్మరాండ్ల తోటి

నా తీగె పెద్దగైంది బిడ్డా

దిక్కు మల్లె మొగబాయి గాల్ల లోకంల

నియ్యతిగ బత్కిన నాయినా

ఈ మాయదారి దుర్జెట్ట రోగం పాడుగాను

ఇప్పుడు నా పికరంత

నా కోసురం కాదు తండ్రీ

బత్క పుట్టినోల్ల గురించి బాద

ఈ గండంల కెల్లి గడ్డకు పడి నేను

ఒగాల్ల ఉంటినా... నా బల్గానికి కండ్ల సల్వ

దబ్బన పోతినా... నా బత్కే ఒగ ఇల్వ

ఎటైనా మా బాగ్యమే సారూ’’ అంది నిమ్మలంగ


ఎంత తన్నుకున్నా ఒక రసాత్మక వాక్యం

ఏనాడూ కాలేకపోయిన నా ముందు

అలవోకగా ఓ గొప్ప దార్శనిక కావ్యం

‘‘ఎటైనా మా బాగ్యమే’’ కురిసి

వెళిపోయింది ఆ గొంతు

నలిమెల భాస్కర్‌


Updated Date - 2020-07-20T05:50:12+05:30 IST