పోలీసులు చట్టాన్ని గౌరవించాలి

ABN , First Publish Date - 2022-01-25T05:25:27+05:30 IST

ఏపీలో ఎప్పుడూ ఒకే ప్రభుత్వం ఉండదని, పోలీసులు చట్టాన్ని గౌరవిస్తూ పనిచేయాలని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్‌ అన్నారు.

పోలీసులు చట్టాన్ని గౌరవించాలి
బుడ్డా శ్రీకాంత్‌రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి

  1. కేంద్ర మంత్రి వి.మురళీధరన్‌ 
  2. బుడ్డా శ్రీకాంత్‌రెడ్డి కుటుంబానికి పరామర్శ


నంద్యాల, జనవరి 24: ఏపీలో ఎప్పుడూ ఒకే ప్రభుత్వం ఉండదని, పోలీసులు చట్టాన్ని గౌరవిస్తూ పనిచేయాలని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్‌ అన్నారు. బీజేపీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు డాక్టర్‌ బుడ్డా శ్రీకాంత్‌రెడ్డి కుటుంబాన్ని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాయలసీమ జోన్‌ ఇన్‌చార్జి విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులతో కలిసి సోమవారం పరామర్శించారు. అనంతరం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. ఆత్మకూరు ఘటనలో దోషులను వదిలేసి, నిర్దోషి బుడ్డా శ్రీకాంత్‌రెడ్డిపై కేసులు నమోదు చేసి జైలులో పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీ ఒకవర్గానికి, ఒక మతానికి చెందినది కాదని, అన్ని మతాలకు సమాన హక్కులు కల్పించడమే పార్టీ ముఖ్య ఉద్దేశమని అన్నారు. చట్ట విరుద్ధంగా ప్రార్థన మందిరాన్ని నిర్మిస్తుండటంతో బుడ్డా శ్రీకాంత్‌రెడ్డి అడ్డుకున్నారని, మతాన్ని అడ్డుకోలేదన్న విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు. ఆత్మకూరులో కొందరు అల్లర్లు సృష్టించడానికి చేసిన ప్రయత్నమే అక్కడి ఉద్రిక్తతకు ప్రధాన కారణమని ఆరోపించారు. వైసీపీ నాయకుల సమావేశాలకు, ధర్నాలకు అనుమతిస్తూ, ఆత్మకూరుకు చెందిన బీజేపీ వారిని ఎందుకు అనుమతించడం లేదని మండిపడ్డారు. చట్టవ్యతిరేకంగా పాల్పడిన వారిని వదిలేసి, తమ పార్టీ వారిని అరెస్టు చేయడం ఏమిటని సీఎం జగన్‌ను సూటిగా ప్రశ్నిస్తున్నామని అన్నారు. బుడ్డా శ్రీకాంత్‌రెడ్డి కుటుంబానికి బీజేపీ ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు. శ్రీకాంత్‌రెడ్డిపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేసేంత వరకు బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పొలిటికల్‌ ఫ్యీడ్‌ బ్యాక్‌ కమిటీ రాష్ట్ర కో కన్వీనర్‌ డాక్టర్‌ ఇంటి ఆదినారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాదర్‌బాద్‌ నరసింగరావు, లింగన్న, జాతీయ కౌన్సిల్‌ మాజీ సభ్యుడు కశెట్టి కృష్ణమూర్తి, పట్టణ అధ్యక్షుడు బ్రహ్మయ్య ఆచారి, భరత్‌ రెడ్డి, సురే్‌షబాబు తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-01-25T05:25:27+05:30 IST