గంగవరం పోర్టు మాటేమిటి?

ABN , First Publish Date - 2021-06-15T08:25:39+05:30 IST

అంతకుముందు కృష్ణపట్నం... ఆ తర్వాత గంగవరం! ఏపీలో రెండు కీలక పోర్టులు కైవశం చేసుకున్న ‘అదానీ’ గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టిన ఎఫ్‌పీఐల ఖాతాల స్తంభన వ్యవహారం రాష్ట్రంలోనూ సంచలనం సృష్టించింది

గంగవరం పోర్టు మాటేమిటి?

వాటాల విక్రయంపై సర్కారు ఏమంటుంది?

సాధికార కమిటీ నిర్ణయంపై ఉత్కంఠ


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

అంతకుముందు కృష్ణపట్నం... ఆ తర్వాత గంగవరం! ఏపీలో రెండు కీలక పోర్టులు కైవశం చేసుకున్న ‘అదానీ’ గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టిన ఎఫ్‌పీఐల ఖాతాల స్తంభన వ్యవహారం రాష్ట్రంలోనూ సంచలనం సృష్టించింది. గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వ విక్రయంపై ఇది ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి గంగవరం పోర్టులో 10.39శాతం వాటా ఉంది. ఈ వాటాను కూడా అదానీ పోర్ట్సు సెజ్‌ (ఏపీసెజ్‌)కు అమ్మేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. రూ.645కోట్లకు తన వాటాను అమ్మేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది. ఇప్పుడు అదానీ గ్రూప్‌లోని మూడు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన ఎఫ్‌పీఐలపై ‘సెబీ’ కూడా వీటిపై విచారణ చేపట్టిందని సమాచారం. సాధారణంగా విదేశీ నిధులు వచ్చినప్పుడు.. అవి ఏ కంపెనీల నుంచి వచ్చాయి?ఆయా కంపెనీలకు నిధులకు వనరులెక్కడ నుంచి వచ్చాయి? తదితర వివరాలను సెబీకి, ఇతర సంస్థలకు సమర్పించాల్సి ఉంటుంది. అయితే.. అలాంటి వివరాలు సమర్పించలేదని అంటున్నారు. దీంతో ఈ వ్యవహారంలో మనీలాండరింగ్‌ (అక్రమ సొమ్మును విదేశాలకు పంపి... మళ్లీ అక్కడి విదేశీ కంపెనీల పెట్టుబడుల పేరుతో తిరిగి తమ కంపెనీల్లోకి తెచ్చుకోవడం.) వ్యవహారాలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అదే కంపెనీకి ప్రభుత్వ వాటాను కూడా అమ్మడం వివాదాస్పదం అవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.


అధికారుల కమిటీ ఏమంటుందో?

గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా అమ్మాలన్న నిర్ణయంపైనే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వానికి ఉన్న వాటా వల్లే సదరు పోర్టుకు అనుమతులు వచ్చాయన్నది బహిరంగ రహస్యమే. గంగవరం పోర్టు కొనుగోలు చేసిన అదానీ పోర్ట్సు సెజ్‌ లిమిటెడ్‌కు వాటాల బదిలీ సజావుగా జరిగేలా ప్రభుత్వం ఇటీవలే ఒక సాధికారిక కమిటీని కూడా నియమించింది. ఈ డీల్‌కు సంబంధించి ప్రభుత్వ ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత కూడా ఈ కమిటీదే. ఇప్పుడు అదానీ గ్రూప్‌పై వస్తున్న మనీలాండరింగ్‌ ఆరోపణలను ఈ కమిటీ పరిగణలోకి తీసుకుంటుందా? అన్నది వేచి చూడాలి. సాధారణంగా ఎన్‌ఎ్‌సడీఎల్‌, సెబీలు విచారణ చేస్తున్నప్పుడు... ఆ పరిణామాలను కూడా సాధికారిక కమిటీ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని అంటున్నారు.

Updated Date - 2021-06-15T08:25:39+05:30 IST