మృత్యు శకటం

ABN , First Publish Date - 2022-01-31T06:45:28+05:30 IST

కరీంనగర్‌ కమాన్‌ సమీపంలో రోడ్డు పక్కన కమ్మరి వృత్తి చేసుకుని జీవిస్తున్న మహిళలపైకి ఆదివారం ఉదయం ఓ కారు(టీఎస్‌ 02 ఇవై 2121) అదుపుతప్పి దూసుకుపోయింది.

మృత్యు శకటం

- బడుగుజీవులను బలితీసుకున్న అతివేగం

- మహిళలపై దూసుకుపోయిన కారు

- నలుగురు మృత్యువాత, ముగ్గురికి తీవ్రగాయాలు

కరీంనగర్‌ కమాన్‌ ప్రాంతం.. సమయం ఉదయం 6.45.. నగరమంతా పొగమంచు కమ్ముకుని ఉంది.. కమాన్‌ సమీపంలో సీస కమ్మరుల మహిళలు తాము పని చేసుకునే ప్రాంతానికి వచ్చారు.. కొలిమిలను సిద్ధం చేసుకుని టీ పెట్టుకునేందుకు సమాయత్తమవుతున్నారు.. ఇంతలో ఎక్కడి నుంచో ఓ కారు వేగంగా వచ్చింది. కన్ను మూసి తెరిచేంతలో మహిళలపైకి దూసుకెళ్లింది. తేరుకుని చూసేసరికి ఓ మహిళను వంద మీటర్లు ఈడ్చుకెళ్లి ఓ విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని నిలిచిపోయింది. ఆ అభాగ్యురాలు అక్కడే ప్రాణం విడిచింది. కారులో ఉన్న వారు అక్కడి నుంచి పరారయ్యారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించగా అందులో ముగ్గురు చికిత్స పొందుతూ మృతి చెందారు. 

కరీంనగర్‌ క్రైం, జనవరి 30: కరీంనగర్‌ కమాన్‌ సమీపంలో రోడ్డు పక్కన కమ్మరి వృత్తి చేసుకుని జీవిస్తున్న మహిళలపైకి ఆదివారం ఉదయం ఓ కారు(టీఎస్‌ 02 ఇవై 2121) అదుపుతప్పి దూసుకుపోయింది. పవార్‌ పరియాంగ్‌(32) అనే మహిళ సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. మరో ముగ్గురు పవార్‌ సునీత(30), పవార్‌ లలిత (27),  సోలంకి జ్యోతి(14) తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందారు. వీరంతా దగ్గరి బంధువులు. పద్మ (35), రాణి (34), అవంతి(3)లకు తీవ్రగాయాలుకాగా కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. మృతుల కుటుంబాలు 30 ఏళ్ల క్రితం ఆదిలాబాద్‌ నుంచి కరీంనగర్‌కు వలసవచ్చి ఇక్కడే రోడ్డు పక్కన (డేరా) వేసుకుని కత్తులు, గొడ్డళ్లు, ఇతర పనిముట్లకు సానపడుతుంటారు. ఉదయం పూట మేక, గొర్రెల తలకాయలు, కాళ్లు కాలుస్తారు. కమాన్‌కు సమీపంలోని ప్రధాన మురికి కాలువ వద్ద ఫుట్‌పాత్‌ కింద రోడ్డును ఆనుకుని ఐదు చోట్ల చిన్న కొలిమిలు ఏర్పాటు చేసుకుని అక్కడే వృత్తి పని చేస్తుంటారు. ఉదయం నుంచి రాత్రి వరకు కొలిమిల వద్ద పనిచేసి, రాత్రి సమీపంలోని అద్దె గదుల్లో నిద్రిస్తుంటారు. ఉదయం  6:45 గంటల సమయంలో ఒక కారు అతివేగంగా వస్తూ అదుపుతప్పి మహిళలపైకి దూసుకు వచ్చింది. మహిళలు అరుస్తుండగానే కారు వారిని ఢీకొని, వారి దేహాలపైకి ఎక్కి దాదాపు 100 మీటర్ల దూరంలో రోడ్డు పక్కనే ఉన్న ఎలక్ట్రికల్‌ పోల్‌ను ఢీకొట్టి నిలిచిపోయింది. కారులో ఉన్న ముగ్గురు అక్కడి నుంచి పరారయ్యారు. సంఘటనా స్థలంలో సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు గాయత్రీ నగర్‌కు చెందిన కచ్చకాయల రాజేంద్రప్రసాద్‌, అతని కొడుకు (16), మరో ఇద్దరు బాలురిని అరెస్టు చేశారు. మృతుల కుటుంబాల ఫిర్యాదుతో నలుగురు నిందితులపై ఐపీసీ సెక్షన్‌ 304(2) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ కేసును కరీంనగర్‌ ఏసీపీ తుల శ్రీనివాసరావు దర్యాప్తు చేస్తున్నారు. 

- కారు నడిపింది బాలుడే..

బాలుడి ర్యాష్‌ డ్రైవింగ్‌ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీస్‌ కమిషనర్‌ వి సత్యనారాయణ తెలిపారు. కారు ప్రమాదం ఘటనలో నిందితుల అరెస్టును ఆదివారం సాయంత్రం చూపించారు. ఈ సందర్భంగా సీపీ సత్యనారాయణ విలేకరులతో మాట్లాడుతూ ప్రమాదం సమయంలో కారు నడిపింది 16 బాలుడు అని తెలిపారు. అతని తండ్రి రాజేంద్రప్రసాద్‌ కొడుకుకు కారు ఇవ్వడంతోనే ఈ ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాద సమయంలో మరో ఇద్దరు బాలురు కారులో ఉన్నారని తెలిపారు. ఉదయం పొగమంచుకారణంగా కారులో తేమ రావడం, దారి కనిపించక, బ్రేక్‌పై కాలు వేయకుండా పొరపాటున ఎక్స్‌లేటర్‌పై కాలు వేయడంతో అతవేగంగా కారు అదుపుతప్పి రోడ్డు పక్కన మహిళలపైకి దూసుకుపోయిందన్నారు. నలుగురు మహిళల మృతదేహాలకు కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.  

- ఆసుపత్రివద్ద మిన్నంటిన రోదనలు

అప్పటి వరకు తమతో ఉన్న నలుగురు మహిళలు తెల్లారగానే ఈ లోకం విడిచిపెట్టి వెళ్లారనే విషయం తెలిసి మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కష్టాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తున్న ఆ కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. నలుగురు మహిళలు ప్రమాదంలో మరణించిన విషయం తెలుసుకుని సీస కమ్మరులు, ఇతరులు పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకోగా వారి అర్తనాదాలతో అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. తమకు బతుకుదెరువు లేకనే వలస వచ్చామని, ఇటువంటి సమయంలో కారు రూపంలో నలుగురిని కాటేసిన ఘటనతో నాలుగు కుటుంబాలు కకావికలమయ్యాయని రోదిస్తున్నారు. తమకు సహాయం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. ఽమృతుల కుటుంబాలను ఆదుకోవాలంటూ మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటనాస్థలంలో ధర్నా చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అదనపు జాయింట్‌ కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌ మృతుల కుటుంబాలకు డబుల్‌బెడ్‌రూం ఇళ్ళు అర్హతపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు అన్నిరకాల సహాయం అందిస్తామన్నారు. అనంతరం సంఘటనా స్థలాన్ని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ పరిశీలించారు. 

-కనీస అవగాహన లేకుండా డ్రైవింగ్‌

అసలే శీతాకాలం.. దట్టంగా పొగమంచు ఆవరించి ఉంది.. ఈ సమయంలో ఎంత అనుభవం ఉన్నా డ్రైవింగ్‌ చేయడానికి భయపడతారు. ఒకవేళ బయటకు వెళ్లినా నెమ్మదిగా వెళతారు. ఆదివారం జరిగిన ప్రమాదానికి కారణమైన కారును ఓ బాలుడు అతి వేగంగా నడుపుతున్నాడు. కారులో తేమ ఆవరించి ఉంది. బయటి దృశ్యాలు సరిగా కనిపించవు. వేగంగా ఉండడంతో కారు అదుపుతప్పింది. బ్రేక్‌పైన కాలు వేయాల్సిన బాలుడు ఎక్స్‌లెటర్‌పై కాలు ఉంచడంతో కారు మరింత వేగాన్ని పుంజుకుంది. కన్నుమూసి తెరిచేంతలో మహిళల పైకి దూసుకెళ్లి స్తంభాన్ని ఢీకొని ఆగిపోయింది. ఒకవేళ స్తంభాన్ని ఢీకొనకపోతే ఇంకెంత బీభత్సం సృష్టించేదో..

కనీస అవగాహన లేకుండా అతివేగంగా బాలురు వాహనాలు నడుపుతూ తరచుగా ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ ప్రమాదాల్లో అమాయకుల ప్రాణాలు కోల్పోన్నారు. తల్లిదండ్రులు కూడా ఉంటుంది.  తమ పిల్లలకు అడిగినా, అడగకపోయినా స్టేటస్‌ కోసమని లక్షల ఖరీదు చేసే వాహనాలు కొనుగోలు చేసి బహుమతులుగా ఇస్తున్నారు. వాహనాల డ్రైవింగ్‌పై అవగాహన ఉండదనే కారణంగానే బాలురికి డ్రైవింగ్‌ అనుమతి ఇవ్వరు. అనుభవం లేనివారు ఎదురుగా వచ్చే వాహనాల వేగాన్ని అంచనా వేయలేరని, వాహనాలదూరాన్ని సరిగా గమనించలేరని, ఆ వాహనాలు సమీపంలోకి వచ్చేసరికి హైరానాతో నిస్సహాయ స్థితిలోకి వెళుతూ ప్రమాదాల బారిన పడుతున్నారని పోలీసులు విశ్లేసిస్తున్నారు. ఆదివారం జరిగిన ప్రమాదం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నది. 

- గుడిసెలను తొలగించారు.. ఉపాధి మరిచారు..

కరీంనగర్‌ స్మార్ట్‌ సిటీ పేరున రోడ్లు, ఫుట్‌పాత్‌లను అందంగా తీర్చిదిద్దే క్రమంలో ఫుట్‌పాత్‌లపై సీస కమ్మరులు వేసుకున్న డేరాలను మున్సిపల్‌ కార్పొరేషన్‌, పోలీస్‌ అధికారులు తొలగించారు. దీంతో వేరే పనులు చేయలేక వారు ఏడాదిన్నరగా ఉపాధిని కోల్పోయారు. 30 ఏళ్ల క్రితం వలస వచ్చి ఇక్కడే ఉంటూ కొలిమి పనులతో ఉపాధి పొందుతున్న సుమారు 30 కుటుంబాలు, రోజూ పనిచేస్తేనే వచ్చే కొద్దీ డబ్బులతో పూటగడిచే బడుగు జీవులైన సీస కమ్మరులు వీధినపడ్డారు. వీరు ఉపాధిని కోల్పోయేలా చేసిన అధికారులు వారికి ఇతర చోట్ల స్థలం చూపించకపోవటంతో విధిలేని పరిస్థితుల్లో డేరాలు తొలగించిన స్థలంలోనే రోడ్డు చివరన చిన్నగా కొలిమిలు ఏర్పాటు చేసుకుని బతుకుబండీని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే భద్రత లేకపోవడంతో కారు దూసుకెళ్లి నలుగురు మృత్యువాత పడ్డారు. పేదల పేరిట ఎందరికో స్థలాలను అందిస్తున్న పాలకులు ఈ బడుగుజీవులకు చోటిస్తే వారి ప్రాణాలు ఇలా గాలిలో కలిసేవి కాదని అభిప్రాయపడుతున్నారు. 

- మైనర్‌లపై నియంత్రణేది.... ఏడాదిలో 179 కేసులు

మైనర్‌లు వాహనాలను నడుపుతూ తరచుగా పోలీసుల తనిఖీల్లో పట్టుబడినా డోంట్‌కేర్‌ అంటూ మళ్లీ వాహనాలు నడుపుతున్నారు. గడిచిన 2021 సంవత్సరంలో కరీంనగర్‌లో 179 మంది మైనర్‌లు వాహనాలు నడుపుతూ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు. వీరిపై కరీంనగర్‌ ట్రాఫిక్‌ పోలీసులు సెక్షన్‌ 181 కింద కేసు నమోదు చేసి 500 రూపాయల జరిమానాను విధించి వదిలిపెట్టారు. దీంతో వారిలో భయం లేకుండా పోయింది. తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్‌ ఇచ్చినా ఫలితం ఉండడం లేదు. ఆదివారం జరిగిన ప్రమాదానికి కారణమైన బాలుడు, అతని స్నేహితులు తరచుగా కారులో అంబేడ్కర్‌ స్టేడియంకు వెళతాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. 

- న్యాయం చేయాలని బాధితుల రాస్తారోకో

సుభాష్‌నగర్‌: ప్రమాదంలో గాయపడిన వారితోపాటు మృతదేహాలను జిల్లా ఆసుపత్రికి తరళించారు.  అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌ క్షతగాత్రులను పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ప్రమాదంలో గాయపడిన, మరణించిన వారి కుటుంబాలను కాంగ్రెస్‌, సీపీఎం, బీజేపీ నాయకులు పరామర్శించారు. తమకు న్యాయం చేయాలని బాదిత కుటుంబాలు ఆసుపత్రి ఎదురుగా రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. వారికి కాంగ్రెస్‌, సీపీఎం, బీఎస్పీ నాయకులు మద్దతు తెలిపారు. సుమారు మూడు గంటలపాటు రాస్తారోకో నిర్వహించారు. వారి వద్దకు ఆర్డీవో ఆనంద్‌కుమార్‌, ఏసీపీ తుల శ్రీనివాసరావు అక్కడకు చేరుకొని వారితో మాట్లాడారు. ఎక్స్‌గ్రేషియా కోసం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామని, తగిన న్యాయం చేస్తామన్నారు. తమకు నమ్మకంలేదని, గత ఏడు నెలల క్రితం బస్సు ప్రమాదంలో తమ వ్యక్తి మరణించిన సమయంలో ఇలాగే హామి ఇచ్చారని, అవి నేటికి నెరవేరలేదన్నారు. మంత్రి వచ్చి హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆర్డీవో పై అధికారులతో మరోసారి మాట్లాడారు. ప్రస్తుతం వారు ఉంటున్న స్థలంనుంచి పునరావసం కింద మరోచోట స్థలం కేటాయిస్తామని, డబుల్‌ బెడ్రూం ఇంటిని ఇస్తామని, ఎక్స్‌గ్రేషియా మాత్రం ప్రభుత్వ చేతిలో ఉందని, అదికూడా వస్తుందని హామీ ఇచ్చారు. 

తక్షణ సహాయం కింద వారికి పదివేల రూపాయలు అందించారు. తమను కనీసం మనుషులుగా కూడా పరిగణించడంలేదని, పదివేల రూపాయలతో అంత్యక్రియలు ఎలా చేస్తారని బాదిత కుటుంబాలు ప్రశ్నించారు. తమను కేవలం ఓట్లకోసమే వాడుకుంటున్నారని ఇంతమంది చనిపోతే  మంత్రి రాలేదని రోదించారు.

- పరపతి ఉన్నోళ్లనే మంత్రి పరామర్శిస్తారా...

- కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి 

పరపతి ఉన్నోళ్లనే మంత్రి పరామర్శిస్తారా.. పేదోళ్లను పట్టించుకోరా అని కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌ రెడ్డి ప్రశ్నించారు. బాధితులను పరామర్శించిన ఆయన వారు చేపట్టిన రాస్తారోకోకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి నగరంలో ఉండి బాఽధితులను పరామర్శించకపోవడం తగదన్నారు.  అజాగ్రత్తగా కారు నడిపిన బాలుడి తండి మంత్రికి సన్నిహితుడు కాబట్టే ఇలా చేశారా అని ప్రశ్నించారు. బాధిత కుటుంబానికి 20 లక్షల ఎక్స్‌గ్రేషియా, పునరావాసంతోపాటు డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, అర్హులైన వారికి పెన్షన్‌, అనాథలైన పిల్లలకు ఉచిత విద్య అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బాధ్యులపై కేసు నమోదుచేసి కఠిన చర్యలు తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఆయనతోపాటు కాంగ్రెస్‌ నాయకులు శ్రవణ్‌ నాయక్‌, లింగంపల్లి బాబు, దీకొండ శేఖర్‌బాబు, కుర్ర పోచయ్య, రోళ్ల సతీశ్‌, కాల్వల రాంచంద్రం, వొద్దుల శ్రీనివాస్‌, గుండాటి శ్రీనివాస్‌ రెడ్డి, సత్యనారాయణరెడ్డి, ఎజ్రా తదితరులు పాల్గొన్నారు. 

-20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి...

- సీపీఎం, సీపీఐ, బీఎస్పీ నాయకులు

నగరంలోని కమాన్‌ ప్రాంతంలో జరిగిన కారు ప్రమాదంలో మరణించిన మృతుల ఒక్కో కుటుంబానికి 20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, సీపీఐ నగర కార్యదర్శి సురేందర్‌ రెడ్డి, బీఎస్పీ నాయకులు డిమాండ్‌ చేశారు. ప్రమాదం జరిగి ఎనిమిది గంటలైనప్పటికి ప్రభుత్వ అధికారులుగాని, మంత్రి, ఎంపీ పరామర్శించకపోవడం సిగ్గుచేటన్నారు. వారంతా అనేక సందర్భాలలో ఇళ్ల స్థలాలు కావాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నప్పటికి ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. కారు ప్రమాదం చేసిన వ్యక్తులు, మంత్రి, ఎంపీ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో టీఆర్‌ఎస్‌, బీజేపీ లోలోపల ఒప్పందం చేసుకొని కుల రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. మరణించింది సంచార జాతుల కుటుంబాలు కావడంతోనే ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులు పట్టించుకోవడం లేదని, సంపన్నులకు ఒక న్యాయం, పేదలకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బాధితులకు సరైన న్యాయం చేయాలని, పేదలకు డబుల్‌ బెడ్‌రూంల ఇళ్లు ఇవ్వాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలందించాలని డిమాండ్‌ చేశారు. సీపీఎం కార్యదర్శివర్గ సభ్యులు గుడికందుల సత్యం, వర్ణ వెంకట్‌ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యుల ఎడ్ల రమేశ్‌, సీపీఐ నాయకులు పైడిపెల్లి రాజు, మణికంఠరెడ్డి, బీఎస్పీ నాయకులు కొంకటి శేఖర్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-31T06:45:28+05:30 IST