ఆశీర్వాద బలం

ABN , First Publish Date - 2021-08-06T05:30:58+05:30 IST

మన జీవితాల్లో ఎన్నో రకాలైన విపత్కర పరిస్థితులు చోటుచేసుకుంటాయి. వాటిని ఎదుర్కోవడానికి మనం చేసే ప్రయత్నాలన్నీ కొన్ని సార్లు విఫలం కావచ్చు.

ఆశీర్వాద బలం

న జీవితాల్లో ఎన్నో రకాలైన విపత్కర పరిస్థితులు చోటుచేసుకుంటాయి. వాటిని ఎదుర్కోవడానికి మనం చేసే ప్రయత్నాలన్నీ కొన్ని సార్లు విఫలం కావచ్చు. అప్పుడు ‘నాకు కాలం కలిసి రాలేదు. భగవంతుడి కృప, ఆశీస్సులు నాకు లేవేమో?’ అనిపిస్తుంది. అసలు ‘ఆశీస్సులు’ అంటే ఏమిటి? వాటికి ఉన్న శక్తి ఎలాంటిది? ఆశీస్సులు కావాలని మనం ఎందుకు కోరుకుంటాం?ఏదైనా శుభకార్యాన్ని, కొత్త పనినీ ప్రారంభించడానికి ముందు పెద్దల దగ్గర ఆశీర్వాదాలు తీసుకోవడం మన సంస్కృతిలో ఆనవాయితీ. పుట్టినది మొదలు మనిషి జీవితంలో ప్రతి ఘట్టాన్నీ వేడుకగా చేసుకుంటూ...బంధువులనూ, మిత్రులనూ పిలిచి, వారి ఆశీస్సులు పొందడం ఒక తప్పనిసరి ఆచారంగా పూర్వులు నిర్దేశించారు. 


‘‘మనం ఖాళీ చేతులతో వచ్చాం, అలాగే వెళ్ళిపోతాం. మనం సంపాదించుకున్న ధన సంపదలేవీ మన వెంటరావు’’ అని అనుకుంటాం. కానీ అది పొరపాటు. గత జన్మలలో మనం చేసుకున్న పుణ్య కర్మల ఆధారంగానే... మన ప్రస్తుత జన్మ జరుగుతుంది. ఒకరి జీవితం వడ్డించిన విస్తరిలా సకల భోగభాగ్యాలతో ఉంటే... మరొకరికి పుట్టుకతోనే దుఃఖం ఉంటుంది. 


పిల్లలు ఏదైనా మంచి పని చేస్తే సంతోషంగా ఆశీర్వదిస్తారు. వారి జీవితం నిర్విఘ్నంగా సాగిపోవాలని కోరుకుంటారు. మరి, తల్లితండ్రుల మాటలు విననప్పుడు ఆశీస్సులు ఎలా లభిస్తాయి? అలాగే భగవంతుణ్ణి పూజిస్తాం. ఆయన గొప్పతనాన్ని కీర్తిస్తాం. కానీ మన మాటలు, చేతలు భగవంతుడికి నచ్చే విధంగా ఉన్నాయా? ఆయనకు నచ్చేలా సన్మార్గంలో నడుస్తున్నామా? దయాసాగరుడైన దేవుడిలా ఇతరులను కష్టాల్లో మనం ఆదుకుంటున్నామా? లేదంటే మన ఇష్టానుసారం నడుచుకుంటున్నామా? సర్వమానవాళికీ తల్లీ, తండ్రీ అయిన ఆ భగవంతుడు మన చేతలకు సంతోషించి, మనల్ని ఆశీర్వదిస్తాడా? ఎవరైనా వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేస్తే... మనకు ఎన్నో ఆశీస్సులు ఇస్తారు. ఇది అందరికీ అనుభవమే. ఈ ఆశీర్వచనాలు మన పుణ్యాల ఖాతాలో నిధిలా జమ అవుతాయి. వాటిని ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. ఆపత్సమయంలో అవసరం కోసం బ్యాంక్‌ బ్యాలెన్స్‌ ఎలా పెట్టుకుంటామో... ఆశీస్సులను కూడా అలాగే జమ చేసుకోవాలి. మన ఆలోచనలు, కర్మలు, వ్యవహారం, సహయోగాల ద్వారా నిత్య జీవితంలో ఆశీస్సులను జమ చేసుకొని, పెంచుకోవాలి. ఇవి కఠిన సమయంలో, ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు ఆత్మశక్తిని ప్రసాదిస్తాయి. అప్పుడు పర్వతం లాంటి సమస్య కూడా దూదిపింజలా తేలికవుతుంది. 


ఒక్కొక్కసారి మనం చాలా కష్టపడి పని చేస్తాం. కానీ కాలం కలిసిరాకపోతే శాపగ్రస్తులైనట్టు ఎన్నో విఘ్నాలు వస్తాయి. కార్య సఫలత పొందలేం. దీనికి కారణం మన గతంలో చేసుకున్న పాప కర్మల ఖాతా. అందుకే... మనం చేసే ప్రతి పని ఇతరులకు సంతోషం ఇచ్చే విధంగా ఉండాలి. మన మాటలు అందరికీ ఉల్లాసాన్నీ, ఉత్సాహాన్నీ కలిగించాలి. ఇతరులకు మనస్ఫూర్తిగా సాయపడాలనేది మన లక్ష్యం కావాలి. మన ఆశీస్సులను మనకు సమీపంలో ఉండే వ్యక్తులకే కాదు, ప్రపంచంలోని ప్రతి వ్యక్తికీ అందించవచ్చు. దూరదేశంలో ఉండేవారికి కూడా మన శుభ భావనలను పంపవచ్చు. అప్పుడు... మనం వాళ్ళ ఎదుటే ఉన్న అనుభూతిని వారు పొందుతారు. అందుకే ఆశీస్సులు ఇవ్వండి, తీసుకోండి. దీనివల్ల మన జీవితాలు సుఖంతో, శాంతితో, సంతోషంతో మెరుస్తాయి. భావితరాలకు కూడా ఆశీస్సుల విలువ అర్థమయ్యేలా చెయ్యండి. ఈ విధమైన సేవ ద్వారా మన జీవితాలే కాదు... ఈ ప్రపంచ పరిస్థితులే మారిపోతాయి.


బ్రహ్మ కుమారీస్‌

7032410931

Updated Date - 2021-08-06T05:30:58+05:30 IST