Abn logo
Oct 26 2021 @ 23:27PM

ఇన్‌చార్జి డీలర్ల ఇష్టారాజ్యం

జిల్లాలో 48 రేషన్‌ దుకాణాలకు ఇన్‌చార్జిలే

ఏళ్ల తరబడి భర్తీకాని డీలర్ల నియామకాలు

మామూలుగానే తీసుకుంటున్న అధికారులు

నిబంధనలు పట్టించుకోని పౌరసరఫరాల శాఖ

ఆదిలాబాద్‌, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌ సరుకుల పంపిణీలో అనేక సంస్కర ణలు చేపడుతున్నా జిల్లాలో మాత్రం ఇన్‌చార్జి డీలర్ల ఇష్టారాజ్యం నడుస్తోంది. ప్రభుత్వం పేదలకు అందిం చే నిత్యావసర సరుకులు పక్కదారి పడుతున్నా పట్టింపేలేకుండా పోయింది. బినామీ దందాకు అడ్డు కట్ట వేసేందుకు ప్రభుత్వం పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో ప్రయోజనం కనిపించడం లేదు. ఏదైనా ఫిర్యాదులు ఉన్నతాధికారుల దృష్టికి వస్తే తప్ప క్షేత్ర స్థాయిలో అధికారులు పర్యవేక్షణ చేయడం లేదంటున్నారు. తూతూ మంత్రంగా 6ఏ కేసులను నమోదు చేస్తూ చేతులు దులుపుకుంటు న్నారు. జిల్లాలో మొత్తం 355 రేషన్‌ దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో అంత్యోదయ కార్డులు 12924, తెల్ల రేషన్‌కార్డులు 70వేల, అన్నపూర్ణ కార్డులు 275 మొత్తం 83199 వివిధ రకాల రేషన్‌ కార్డులున్నాయి. జిల్లాకు నెలవారీగా 40లక్షల 7551 క్వింటాళ్ల బియ్యా న్ని సరఫరా చేస్తున్నారు. సరుకుల సరఫరాలో అవక తవకలకు పాల్పడిన రేషన్‌ డీలర్లపై కేసులు నమోదు చేసి సస్పెండ్‌ చేస్తున్నా రేషన్‌ దుకాణాల్లో సమయ పాలన పాటించకపోవడంతో పేద ప్రజలకు సరిగా నిత్యావసర సరుకులు అందడం లేదంటున్నారు. అడపదడపా దుకాణాలను తెరిచినా ఆపై సరుకులు లేవనడంతో ప్రజలు లబోదిబోమంటున్నారు. 

రాజకీయ అండదండలు..

జిల్లాలో కొందరు రేషన్‌ డీలర్లకు రాజకీయ అండదండలు పుష్కలంగా ఉన్నాయన్న ఆరోపణలు విన వస్తున్నాయి. దీంతో రేషన్‌ షాపుల ఇన్‌చార్జి బాధ్యతలను దక్కించుకుంటూ అందినకాడికి దండు కుంటున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి. కొందరైతే ఏకంగా అధికారపార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ గ్రామాల్లో చక్రం తిప్పుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నా ఉన్నతాధికారులకు మాత్రం పట్టింపేలేకుండా పోయిందంటున్నారు. జిల్లాలో 48 రేషన్‌ షాపులకు ఇన్‌చార్జి డీలర్లే పని చేస్తున్నారు. బోథ్‌ మండల కేం ద్రానికి చెందిన రేషన్‌ డీలర్‌ అనారోగ్యానికి గురికావడంతో మ రొకరు ఈ దుకాణాన్ని నడుపుతు న్నట్లు తెలుస్తోంది. అలాగే ఇదే మండలానికి చెందిన కౌఠ గ్రామంలో ఉన్న రెండు రేషన్‌ దుకాణాలను కూడా బినామీలే నడుపుతున్నట్లు సమాచారం. అలా గే ఇచ్చోడ మండలంలో కోకస్‌ మన్నూర్‌, బోరిగాం, ముక్ర(బి) గ్రామాల్లో ఇతరులే రేషన్‌ దుకాణాలను నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదే మండలంలో నర్సాపూర్‌ గ్రామానికి చెందిన డీలర్‌ రెండేళ్ల క్రితమే ప్రమాదంలో మృతిచెందడంతో ఇన్‌చార్జి డీలర్‌తోనే కాలం గడుపుతున్నారు. జిల్లాలో పని చేస్తున్న కొందరు డీలర్లకు రెండు, మూడు రేషన్‌ దుకాణాల ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు విన వస్తున్నాయి.

పర్యవేక్షణ కరువు..

జిల్లాలోని చౌకధరల దుకాణాలపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారే విమర్శలున్నాయి. అసలు అర్హత ఉన్న స్థానికులను కాదని స్థానికేతరులకు బాధ్యతలు అప్ప గించడంపై అనుమానాలు వస్తున్నాయి. కొన్ని మండ లాల్లో రిజర్వేషన్‌పై ఎస్సీ, ఎస్టీ, వెనకబడిన తరగతు లకు రేషన్‌ దుకాణాలు దక్కుతున్నా ఆర్థిక స్థోమత లేదన్న కారణంతో ఇతర వర్గాలకు చెందిన నాయ కులు దుకాణాలను నిర్వహిస్తున్నారు. అలాగే ఒకే కుటుంబానికి రెండు దుకాణాల లైసెన్స్‌లను కేటా యించడం వెనక అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు ఉన్నట్లు సమాచారం. ఎక్కువ శాతం భార్యల పేర్ల మీద దుకాణాల లైసెన్సులు ఉన్న వారి భర్తలు, బంధువులే పెత్తనం చెలాయిస్తున్నారు. దుకాణం వద్ద విధిగా డీలర్‌ పేరుతో పాటు అందుబాటులో ఉన్న సరుకుల వివరాలను ప్రత్యేక బోర్డుపై నమోదు చేయాల్సి ఉన్నా ఎక్కడా నిబంధనలు పట్టించుకోవడం లేదు. తూకంలో కూడా మోసాలే జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. కానీ అధికారులు మాత్రం అడపదడపగా తనిఖీలు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు లేక పోలేదు. ఇంత జరుగుతున్నా పౌరసరఫరా శాఖ అధికారులు తేలికగానే తీసుకుంటున్నారు.

విచారణ జరిపిస్తాం..

సుదర్శన్‌ (జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి)

ఇన్‌చార్జి రేషన్‌ డీలర్లమీద వస్తున్న ఆరోపణలపై వెంటనే విచారణ జరిపిస్తాం. మండల స్థాయిలో పని చేస్తున్న అధికారులకు ఆదేశాలు ఇస్తాం. డీలర్ల ఖాళీలు ఏర్పడడంతో తహసీల్దార్లు సమీప డీలర్లకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే డీలర్ల నియామకం ఉంటుంది. ఎవరైనా బినామీ పేర్లతో రేషన్‌ సరుకులను అమ్మినట్లు తెలిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం.