తొలి రోజే రచ్చ

ABN , First Publish Date - 2021-07-20T06:52:32+05:30 IST

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. సోమవారం తొలిరోజే తీవ్ర గందరగోళం చెలరేగింది.

తొలి రోజే రచ్చ

  • స్తంభించిన పార్లమెంటు.. కొత్త మంత్రుల పరిచయాన్ని అడ్డుకున్న ప్రతిపక్షాలు
  • ప్రధానిని మాట్లాడనివ్వని వైనం
  • సాగు చట్టాలు, పెట్రో ధరలు, పెగాసస్‌ స్పైవేర్‌పై చర్చకు పట్టు
  • వెల్‌లో ప్లకార్డులతో నినాదాలు
  • ఉభయ సభల్లో తీవ్ర గందరగోళం
  • బడుగు మంత్రులను పరిచయం చేయనివ్వరా?
  • విపక్షాలపై ప్రధాని ఆగ్రహం
  • రెండు సభలూ నేటికి వాయిదా


వర్షాకాల సమావేశాల మొదటి రోజే రభస జరిగింది. సాగు చట్టాలు, పెగాసస్‌ స్పైవేర్‌, పెట్రో ధరల అంశాలు ఉభయసభలను కుదిపేశాయి. చివరకు కొత్త మంత్రుల పరిచయ కార్యక్రమాన్ని కూడా విపక్ష ఎంపీలు అడ్డుకున్నారు. ప్రధాని మోదీని సైతం మాట్లాడనివ్వకపోవడంతో అధికార పక్షం విరుచుకుపడింది. సభా కార్యకలాపాలు పెద్దగా జరక్కుండానే సభలు వాయిదా పడ్డాయి.


 న్యూఢిల్లీ, జూలై 19 (ఆంధ్రజ్యోతి): పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. సోమవారం తొలిరోజే తీవ్ర గందరగోళం చెలరేగింది. వ్యవసాయ చట్టాలపై రైతుల నిరసన, పెరుగుతున్న చమురు ధరలు, పెగాసస్‌ స్పైవేర్‌, కొవిడ్‌-19 తదితర అనేక అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రతిపక్షాలు హంగామా సృష్టించడంతో.. ఉభయసభలూ స్తంభించిపోయాయి. కొత్త మంత్రులను పార్లమెంటుకు పరిచయం చేయడం ఆనవాయితీ కావడంతో తొలుత లోక్‌సభలో, తర్వాత రాజ్యసభలో ప్రధాని మోదీ వారందరినీ పరిచయం చేయడానికి ఉపక్రమించారు. కానీ విపక్ష ఎంపీలు అడ్డుకున్నారు. వెల్‌లోకి దూసుకొచ్చి బిగ్గరగా నినాదాలు చేయడంతో ఆయన మండిపడ్డారు. బలహీన వర్గాలకు కేబినెట్‌లో ప్రాతినిధ్యం ఇవ్వడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. తన మంత్రివర్గ సభ్యులను పరిచయం చేసినట్లే భావించాలని సభాపతి ఓం బిర్లాను, రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడిని మోదీ కోరడంతో.. వారు అంగీకరిస్తున్నట్లు ప్రకటించారు.

 

లోక్‌సభ రెండు సార్లు వాయిదా..

ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే నూతన సభ్యులు.. ఎం.గురుమూర్తి (వైసీపీ), మంగళ్‌ సురేశ్‌ అంగడి (బీజేపీ), అబ్దుస్సమద్‌ సమదానీ (ముస్లింలీగ్‌), విజయకుమార్‌ (కాంగ్రెస్‌) పదవీ ప్రమాణం చేశారు. తర్వాత ఇటీవల చనిపోయిన 40 మంది మాజీ ఎంపీలకు సభ నివాళులు అర్పించింది. ఈ దశలోనూ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేయడంతో కనీసం నివాళులు అర్పించేవరకైనా ప్రశాంతంగా ఉండాలని సభాపతి కోరారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దీక్షలు చేస్తూ చనిపోయిన రైతులకు కూడా నివాళులు అర్పించాలని హర్‌సిమ్రత్‌ కౌర్‌ (అకాలీదళ్‌) ఈ సమయంలో పట్టుబట్టారు. అనంతరం కొత్త మంత్రివర్గ సభ్యులను ప్రధాని పరిచయం చేస్తుండగా.. పలువురు విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చారు. తాము లేవనెత్తిన అంశాలపై చర్చించాలని పట్టుబట్టారు. ప్రతిపక్షాల తీరును ప్రధాని తప్పుబట్టారు. మహిళలు, ఓబీసీలు, దళిత, గిరిజన మంత్రులను పరిచయం చేయడాన్ని అడ్డుకోవడం వాటి మానసిక పరిస్థితికి అద్దం పడుతోందని అన్నారు. పార్లమెంటులో ఇలాంటి మనఃప్రవృత్తిని చూడడం ఇదే ప్రథమం అని ప్రధాని ఆగ్రహం వ్యక్తంచేశారు. అయినా విపక్షాలు తగ్గకపోవడంతో కొత్త మంత్రుల జాబితాను సభలో ప్రవేశపెడుతున్నట్లు ఆయన ప్రకటించారు. తర్వాత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రతిపక్షాల వైఖరిని తీవ్రంగా నిరసించారు. ఆ తర్వాత రెండుసార్లు వాయిదా అనంతరం... తీవ్ర గందరగోళం మధ్యే కొత్త ఐటీ, కమ్యూనికేషన్ల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌..  పెగాసస్‌ స్పైవేర్‌ వ్యవహారంపై వివరణ ఇచ్చారు. తర్వాత స్పీకర్‌ సభను మంగళవారానికి వాయిదా వేశారు. 


రాజ్యసభలో..

రాజ్యసభ ఉదయం సమావేశం కాగానే.. సభానాయకుడిగా ఎంపికైన పీయూష్‌ గోయల్‌ను చైర్మన్‌ వెంకయ్యనాయుడు పరిచయం చేశారు. మూడోసారి సభకు ఎన్నికైన ముస్లింలీగ్‌ ఎంపీ అబ్దుల్‌ వహాబ్‌ పదవీప్రమాణం చేశారు. తర్వాత కరోనాతో మరణించిన సిటింగ్‌ సభ్యులు రాజీవ్‌ సతవ్‌, రఘునాథ్‌ మహాపాత్రలకు; ఇటీవల మరణించిన మరో పది మంది మాజీ సభ్యులకు, వెటరన్‌ హీరో దిలీ్‌పకుమార్‌, స్ర్పింట్‌ కింగ్‌ మిల్కాసింగ్‌, కేంద్ర మాజీ మంత్రి అజిత్‌సింగ్‌లకు సభ నివాళులు అర్పించి.. మధ్యాహ్నం 12 గంటలకు వాయిదాపడింది. తర్వాత సమావేశం కాగానే కొత్త మంత్రులను ప్రధాని పరిచయం చేస్తుంటే ప్రతిపక్ష సభ్యులు అడ్డుకున్నారు. కాంగ్రెస్‌, టీఎంసీ, వామపక్షాలు, వైసీపీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చారు. బలహీన వర్గాలకు చెందినవారికి కేంద్ర మంత్రి పదవులు దక్కడం వారు జీర్ణించుకోలేకపోతున్నారని ప్రధాని నిరసించారు. అంతకుముందు, రాజ్యసభలో ముందుగా నిర్ణయించిన కార్యకలాపాలను ఆపేసి.. తాము లేవనెత్తిన 17 అంశాలపై తక్షణమే చర్చించాలని పలువురు సభ్యులు నోటీసులు ఇచ్చారు. చైర్మన్‌ వెంకయ్యనాయుడు వాటన్నిటినీ తిరస్కరించారు. ఒకేసారి 17 అంశాలపై చర్చ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. వాటిపై ప్రాధాన్య క్రమంలో తగు సమయంలో చర్చించేందుకు అవకాశమిస్తానని హామీ ఇచ్చినా విపక్షాలు వినలేదు. తీవ్ర గందరగోళం కొనసాగుతుండటంతో సభ మంగళవారానికి వాయిదాపడింది. కాగా,  పెగాసస్‌ అంశంతోపాటు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనలు, ధరల పెరుగుదల అంశాలపై ఉభయసభల్లోనూ ప్రభుత్వాన్ని నిలదీయాలని విపక్షాలు తీర్మానించాయి. ఈ మేరకు ప్రతిపక్షాల నేతలు సోమవారం పార్లమెంటు హౌస్‌లో భేటీ అయి వ్యూహం రూపొందించారు.

Updated Date - 2021-07-20T06:52:32+05:30 IST