బుద్ధుని ఆదర్శం

ABN , First Publish Date - 2021-05-21T05:30:00+05:30 IST

వైశాఖ పున్నమి బౌద్ధులకు విశేషమైన రోజు. బుద్ధుడు పుట్టింది, జ్ఞానోదయం అయింది, మహా పరినిర్వాణం పొందింది కూడా ఆ రోజే! అంతేకాదు, బౌద్ధ సాహిత్యం ప్రకారం యశోధర పుట్టిన రోజు కూడా వైశాఖ పున్నమే...

బుద్ధుని ఆదర్శం

వైశాఖ పున్నమి బౌద్ధులకు విశేషమైన రోజు. బుద్ధుడు పుట్టింది, జ్ఞానోదయం అయింది, మహా పరినిర్వాణం పొందింది కూడా ఆ రోజే! అంతేకాదు, బౌద్ధ సాహిత్యం ప్రకారం యశోధర పుట్టిన రోజు కూడా వైశాఖ పున్నమే! కాబట్టి వైశాఖ పున్నమి బుద్ధ జయంతే కాదు, యశోధర జయంతి కూడా! 


  • (26న బుద్ధ జయంతి)

శాక్య యువరాజైన సిద్ధార్థ గౌతముడు పదహారో యేట కొలియ గణ రాజ్యానికి చెందిన యశోధరను వివాహం చేసుకున్నాడు. పదహారు గణరాజ్యాలలోని యోధులందరినీ యుద్ధ విద్యల్లో గెలిచి, తాను ప్రేమించిన మేనమామ కూతురును స్వయంవరంలో భార్యగా పొందాడు సిద్దార్థుడు. ఆయన యుద్ధ విద్యల్లో ఎంత వీరుడో, తత్త్వ శాస్త్రంలోనూ అంత మేటి. గొప్ప ఆలోచనాపరుడు. ధార్మిక అన్వేషకుడు. ఆ అన్వేషణలో జ్ఞానదీప్తిని వెతుక్కుంటూ తన ఇరవై తొమ్మిదో ఏట ఇల్లు విడిచిపెట్టాడు. రహస్యంగా కాదు, కుటుంబ సభ్యులు అందరికీ తెలియజేసిన తరువాత. 

ఒక రోజు ఉదయాన్నే సిద్ధార్థుడు అడవులకు బయలుదేరాడు. అప్పటికి ఆయనకు ఒక పసిబిడ్డ ఉన్నాడు. ఆరేళ్ళు అనేక చోట్ల తిరిగి, చివరకు బుద్ధ గయలో బోధి వృక్షం కింద జ్ఞానోదయం పొంది బుద్ధుడయ్యాడు. దుఃఖ నివారణా మార్గాన్ని ఆవిష్కరించాడు. ఆ మార్గాన్ని ప్రజలందరికీ బోధించాలని బౌద్ధ సంఘాన్ని స్థాపించాడు. సారనాథ్‌లో అయిదుగురితో ప్రారంభమైన ఈ బౌద్ధ సంఘం అంచెలంచెలుగా పెరుగుతూ వచ్చింది. ఎందరెందరో దాని పట్ల ఆకర్షితులయ్యారు. ధర్మ మార్గంలో నడిచారు. బుద్ధుని ఆదర్శం ఇక్కడే మనకు కనిపిస్తుంది. ప్రపంచంలో ఎందరో తమ భావాలకు అనుగుణంగా ప్రచారం చేసినవారున్నారు. ప్రబోధకులు ఉన్నారు. సంఘాన్ని స్థాపించినవారూ ఉన్నారు. ఆ సంఘాలకు తామే నాయకులై నడిపించినవారూ ఉన్నారు. కానీ, ఆచరణలో, ఆదర్శంలో బుద్ధుని లాంటి వారు ఎప్పుడూ, ఎక్కడా కనిపించరు.

తన బిడ్డ రాజ్య పాలన వదిలి, భిక్షువయ్యాడని తెలిసి తల్లడిల్లిన బుద్ధుని తల్లితండ్రులే తొలిగా బుద్ధ ఉపాసకులయ్యారు. ఆయన బంధువులైన శాక్య యువకులు ఎందరో ఆ తరువాత బౌద్ధ సంఘంలో చేరి భిక్షువులయ్యారు. తనను పెంచి పెద్ద చేసిన పినతల్లి గౌతమి పుత్రుడు, భావి యువరాజు నందుడు కూడా రాజ్యాన్ని వదిలి భిక్షువైపోయాడు. మరో ప్రియమైన తమ్ముడు ఆనందుడు కూడా భిక్షువై, బుద్ధుని జీవితాంతం ఆయన వెంటే నడిచాడు. పినతండ్రి కొడుకు అనిరుద్ధుడు భిక్షువై, బౌద్ధంలోని ‘సతిపట్టాన’లో అగ్రగణ్యుడయ్యాడు. ఇంకా చిన్ననాటి మిత్రడు కాలు ఉదాయి, సోదరులు, దాయాదులు ఎందరో బుద్ధుని మార్గంలో నడిచారు. బుద్ధుణ్ణి పెంచిన తల్లి గౌతమి, భార్య యశోధర భిక్షుణీలుగా మారారు. చివరకు ఏడు సంవత్సరాల వయసులో తన కుమారుడు రాహులుణ్ణి కూడా బాల భిక్షువును చేశాడు బుద్ధుడు. తమ కుటుంబాల్లో సేవకులుగా ఉన్న ఉపాలి లాంటివారు ఎందరినో సంఘంలో చేర్చి, వారికి గౌరవనీయ స్థానం ఏర్పరచడం బుద్ధునికే సాధ్యం. ఇది ఆయనలోని సామ్యవాద సామాజిక స్ఫూర్తికి దర్పణం. బౌద్ధ సంఘంలో కూడా బుద్ధుడి మేనమామ కొడుకు దేవదత్తుడు తప్ప మిగిలిన వారందరూ సాధారణ జీవితాన్నే గడిపారు. 

యశోధరకు చిన్నప్పటి నుంచీ కడుపు బిగదీస్తూ ఉండేది. అప్పుడు ఆమె బాధతో విలవిలలాడేది. రాచ మందిరాల్లో ఉన్నప్పుడు చెరుకు రసం, మామిడి పండు రసాలతో పానీయాలను సేవకులు ఆమెకు ఇచ్చేవారు. ఆ నొప్పి తగ్గిపోయేది. ఆమె భిక్షుణి అయిన తరువాత ఒక రోజు ఆ నొప్పి వచ్చింది. ఆమె అల్లాడిపోయింది. ఈ విషయం బాల భిక్షువుగా ఉన్న రాహులునికి తెలిసింది. తల్లి దగ్గరకు వెళ్ళాడు. ఆమె వేదన చూశాడు. కన్నీరు పెట్టుకొని ఇబ్బంది ఏమిటని అడిగాడు. ఆమె విషయం చెప్పి...

‘‘నాయనా! ఇప్పుడు మనం భిక్షువులం. భిక్షమీదే బతకాలి. మధురమైన చెరకు రసాలు, మామిడి పండ్ల రసాలు మనం కోరుకోకూడదు. మంచి నీరు ఎక్కువగా తీసుకుంటానులే... నెమ్మదిగా అదే తగ్గిపోతుంది’’ అంది. కానీ రాహులుడు తల్లి బాధ చూసి తట్టుకోలేకపోయాడు. తన గురువు సారిపుత్రుని దగ్గరకు వెళ్ళి ఈ విషయం చెప్పాడు.

వెంటనే సారిపుత్రుడు బయలుదేరి, కోసల రాజు దగ్గరకు వెళ్ళి ‘‘నాకు చెరుకు రసం, మామిడి పండ్ల రసం ఇప్పించాలి’’ అని అడిగాడు. వాటిని తెచ్చి రాహులునితో పంపాడు. 

సాధారణంగా భిక్షువులెవరూ ‘ఇవి కావాలి’ అని అడగరు. సారిపుత్రుడు వచ్చి అడిగేసరికి... కోసల రాజుకు అనుమానం వచ్చింది. ‘‘ఏమిటో తెలుసుకురండి’’ అని గూఢచారులను పంపాడు. వారు వెళ్ళి, తిరిగి వచ్చి, యశోధర కడుపు నొప్పి విషయం చెప్పారు.

ఆ మాట వినగానే రాజు తన ఆసనంలో కూలబడి, దుఃఖం ఆపుకోలేక భోరున ఏడ్చాడు. ‘సన్న్యసించకపోతే... ఈ సమస్త జంబూ ద్వీపానికి బుద్ధుడు చక్రవర్తి అయ్యేవాడు. యశోధర మన అందరికీ మహారాణి అయ్యేది. అలాంటి మహారాణి ఈ రోజున గుక్కెడు ఔషధం కోసం అల్లాడిపోతోంది’’ అంటూ కుమిలిపోయాడు. 

వెంటనే మన నగరంలోని ప్రతి ఇంట్లో చెరకు రసం, మామిడి రసం ఏర్పాటు చేయండి. ఆమె భిక్షకు వచ్చినప్పుడు... భిక్షతో పాటు వాటిని అందించేలా చూడండి అని ఆజ్ఞాపించాడు. 

వారందరూ ధర్మం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన ఆదర్శమూర్తులు. బుద్ధుని ధర్మాచరణ, మార్గదర్శకత్వం అంతటి గొప్పవి!

- బొర్రా గోవర్ధన్‌


Updated Date - 2021-05-21T05:30:00+05:30 IST