Abn logo
Sep 22 2021 @ 03:41AM

హైదరాబాద్‌ విమానాశ్రయ జేవీకీ కేంద్రం గుడ్‌బై!

  • ఏఏఐ వాటా విక్రయానికి రెడీ
  • కేంద్ర కేబినెట్‌ ఆమోదమే తరువాయి


న్యూఢిల్లీ: విమానాశ్రయాల ప్రైవేటీకరణ ప్రక్రియ మరింత ఊపందుకుంది. ఇందులో భాగంగా ముందుగా  ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్య (పీపీపీ) నిర్వహణలోని హైదరాబాద్‌, బెంగళూరు విమానాశ్రయాలకు గుడ్‌బై చెప్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రెండు విమానాశ్రయాల్లో కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని భారతీయ విమానాశ్రయ ప్రాధికారిక సంస్థ (ఏఏఐ)కి 13 శాతం వాటా ఉంది. ఈ వాటా అమ్మకానికి ఏఏఐ డైరెక్టర్ల బోర్డు ఇప్పటికే ఆమోదం తెలిపింది. కేంద్ర కేబినెట్‌ ఆమోదమే దీనికి తరువాయి అని అధికార వర్గాలు చెప్పాయి. 


తర్వాత ఢిల్లీ, ముంబై విమానాశ్రయాలు: ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో పైవేటు కంపెనీలతో కలిసి ఏఏఐ ఈ విమానాశ్రయాలను అభివృద్ధి చేసింది. హైదరాబాద్‌, బెంగళూరు ఎయిర్‌పోర్టుల్లో వాటా అమ్మకం తర్వాత ప్రభుత్వం ముంబై, ఢిల్లీ ఎయిర్‌పోర్టులపై దృష్టి పెడుతుందని సమాచారం. ఈ రెండు ఎయిర్‌పోర్టుల ఈక్విటీలో ఏఏఐకి 26 శాతం వాటా ఉంది. ఢిల్లీ, హైదరాబాద్‌ విమానాశ్రయాల్లో మెజారిటీ వాటా జీఎంఆర్‌ గ్రూప్‌నకు ఉండగా ముంబై విమానాశ్రయంలో మెజారిటీ వాటా అదానీ గ్రూప్‌నకు ఉంది. కాగా బెంగళూరు విమానాశ్రయంలో కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్‌ మెజారిటీ వాటా కలిగి ఉంది. అయితే ఏఏఐ వాటాలను కూడా ఈ సంస్థలే కొనుగోలు చేస్తాయని భావిస్తున్నారు. కాగా హైదరాబాద్‌ విమానాశ్రయంలో ఏఏఐతో పాటు తెలంగాణ ప్రభుత్వానికి 13 శాతం వాటా ఉంది. 


ప్రైవేట్‌ చేతికి తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి విమానాశ్రయాన్నీ ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు రంగం సిద్ధమవుతోంది. ప్రధాన నగరాల్లోని ఇతర ఎయిర్‌పోర్టులతో పోలిస్తే తిరుపతి ఎయిర్‌పోర్టు చిన్నది. దీంతో భువనేశ్వర్‌ ఎయిర్‌పోర్టుతో కలిపి దీన్ని ప్రైవేటు కంపెనీలకు అప్పగించాలని ఏఏఐ నిర్నయించింది. ఇటీవల ఏఏఐ బోర్డు ఇందుకు ఆమోదం కూడా తెలిపింది. ఈ ఎయిర్‌పోర్టులో విమానాల మరమ్మత్తులు, నిర్వహణ కేంద్రం (ఎంఆర్‌ఓ) ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపింది. దీంతో తిరుపతి విమానాశ్రయ కొనుగోలుకూ ప్రైవేటు కంపెనీలు ముందుకు వస్తాయని భావిస్తున్నారు. 


మొత్తం రూ.20,782 కోట్లు: జాతీయ ఆస్తుల నగదీకరణ పైప్‌లైన్‌ (ఎన్‌ఏఎంపీ) కింద విమానాశ్రయాల ప్రైవేటీకరణ ద్వారా 2025 నాటికి రూ.20,782 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో రూ.10,000 కోట్లు ప్రధాన విమానాశ్రయాల్లో  ఏఏఐ వాటా అమ్మకం ద్వారా సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏఏఐ నిర్వహణలోని 25 చిన్నచిన్న విమానాశ్రయాలను ఇతర ఎయిర్‌పోర్టులతో కలిపి అమ్మడం ద్వారా మిగతా మొత్తం సాధించాలని భావిస్తోంది.