Abn logo
Oct 22 2020 @ 00:36AM

ఆగిపోయిన ఆంధ్రాభ్యుదయం

ముఖ్యమంత్రి జగన్ శాసనసభలో మూడు రాజధానుల ప్రకటన చేసిననాటి నుంచి అమరావతి రైతులు రోడ్ల పైనే ఉన్నారు.రాజధాని ఉద్యమం 300 రోజులు దాటింది. ఎంతో మంది రైతులు అమరావతి కోసం అసువులు బాశారు. మహిళల కన్నీళ్లతో అమరావతి భూములు తడవని రోజు లేదు. రాజధాని రైతులు పెద్ద మనసుతో చేసిన త్యాగాలను జగన్ ప్రభుత్వం మరిచినా చరిత్ర మరువదు.


ఇంద్రకీలాద్రి నుంచి సంకల్పజ్యోతి యాత్రతో అమరావతికి అంకురార్పణ జరిగింది. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో తెలుగు ప్రజల కీర్తి కిరీటంలో కలికితురాయిగా నిలిచిపోయేలా రాజధాని అమరావతి శంకుస్థాపన మహోత్సవం సరిగ్గా ఐదేళ్ల కిందట ఇదే రోజున (2015 అక్టోబర్ 22) జరిగింది. వేలాది రైతుల త్యాగాలతో రాష్ట్రాభివృద్ధికి బాటలు వేసేలా పునాది రాయి పడింది. విజయదశమి రోజు అన్నీ విజయాలే సిద్ధిస్తాయన్న నమ్మకంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన స్వహస్తాలతో నవ్యాంధ్ర రాజధానికి భూమి పూజ చేశారు. వేద మంత్రోచ్ఛారణలు, రైతుల హర్షధ్వానాలు, కోట్ల మంది ఆశల మధ్య ప్రపంచం మెచ్చే నగర నిర్మాణానికి తొలి అడుగు పడింది. సరిగ్గా ఐదేళ్ల తర్వాత అదే అమరావతిలో రైతుల ఆక్రందనలు, మహిళల కన్నీళ్లు, పోలీసు బూట్ల చప్పుళ్లు, కేసులు, అరెస్ట్‌లు మాత్రమే కనిపిస్తున్నాయి. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో అమరావతి ద్వారా రాష్ట్రాభివృద్ధికి అడుగులు పడ్డాయి. అంకుర అమరావతి అభివృద్ధిని అడ్డుకొని రాష్ట్రం పదేళ్లు వెనక్కి వెళ్ళేలా ప్రస్తుత ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతోంది. ఐదున్నర కోట్ల ఆంధ్రుల కలల్ని, రైతుల త్యాగాలను కాలరాస్తూ అమరావతి అభివృద్ధిని జగన్ ప్రభుత్వం దెబ్బతీసింది. 


2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు నవ్యాంధ్రలో పెద్ద పరిశ్రమలు ఏమీ లేవు. ఐటి రంగం అంతా హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమైంది. రూ.16వేల కోట్ల రెవెన్యూ లోటుతో రాష్ట్రంలో పాలన మొదలైంది. కనీసం రాజధాని లేదు. రాజధాని అంటే రాష్ట్రాభివృద్ధికి బాటలు వేయాలి. ఉపాధి చూపించాలి. యువతకు కొత్త అవకాశాలను కల్పించాలి. సరిగ్గా ఆ సమయంలోనే అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐదున్నర కోట్ల ఆంధ్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సరికొత్త నగర నిర్మాణానికి నడుం బిగించారు. పరిశ్రమలను ఆకర్షించేలా, స్థిరమైన అభివృద్ధి జరిగేలా, గ్రీన్ సిటీ నిర్మాణానికి సంకల్పించారు. అందుకోసం ఎంతో కసరత్తు చేశారు. తన అపార అనుభవాన్ని ఉపయోగించారు.


ఆ ప్రయత్నంలో భాగంగానే సరిగ్గా ఐదేళ్ల క్రితం అంటే 2015 అక్టోబర్ 22న రాష్ట్ర ప్రజల కలలను సాకారం చేసేందుకు తొలి అడుగు పడింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమరావతికి వచ్చి భూమి పూజ చేశారు. చంద్రబాబు కృషితో, రైతుల త్యాగాలతో 33 వేల ఎకరాల సమీకరణ ఎలాంటి సమస్యలు లేకుండా సాధ్యమైంది. మేము సైతం అంటూ రాష్ట్రంలోని మారుమూల పల్లె ప్రజలు రాజధాని నిర్మాణంలో భాగస్వాములయ్యారు.


అలా అమరావతి కేంద్రంగా రూపుదిద్దుకోనున్న అభివృద్ధిపై ఐదున్నర కోట్ల ఆంధ్రుల్లోనే కాదు, ప్రపంచం నలుమూలలా నమ్మకం ఏర్పడింది. ఆ తర్వాత ఒక్కొక్కటిగా ప్రభుత్వ కార్యాలయాలు అమరావతికి మారాయి. రాజ్‌భవన్ వచ్చింది. సచివాలయ నిర్మాణం జరిగింది. కొత్త అసెంబ్లీ వచ్చింది. కొత్త శాసనాలు అమరావతి గడ్డ నుంచే నిర్మాణమయ్యాయి. అధికారులకు, ప్రజాప్రతినిధులకు అమరావతిలో ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తయింది.


ప్రపంచ స్థాయి నగరానికి తగ్గట్టే రోడ్ల నిర్మాణమూ వేగం పుంజుకుంది. విమాన, రైలు కనెక్టివిటి బాగా పెరిగింది. పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడుతూ ప్రపంచానికే మార్గదర్శకంగా ఉండేలా రాజధాని నిర్మాణానికి వేగంగా అడుగులు పడ్డాయి. అమరావతి నిర్మాణ సంకల్పాన్ని అప్పటి ప్రతిపక్షనేత, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ స్వాగతించారు. అసెంబ్లీలోనూ, బయట కూడా అమరావతిలోనే రాజధాని ఉంటుందని వైసీపీ ప్రకటించింది. అయితే అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే జగన్ మాట తప్పారు. మడమ తిప్పారు. అమరావతిని చీల్చి, మూడు రాజధానులు అంటూ ఎక్కడా లేని ఆలోచనను తెరపైకి తెచ్చి నవ్యాంధ్ర రాజధానిని మూడు ముక్కలు చేస్తున్నారు.


ముఖ్యమంత్రి జగన్ శాసనసభలో మూడు రాజధానుల ప్రకటన చేసినప్పటి నుంచి అమరావతి రైతులు రోడ్లపైనే ఉన్నారు. రాజధాని ఉద్యమం 300 రోజులు దాటింది. ఎంతో మంది రైతులు అమరావతి కోసం అసువులు బాశారు. మహిళల కన్నీళ్లతో అమరావతి భూములు తడవని రోజు లేదు. ప్రభుత్వం ఎంత మొండిగా ఉన్నా రైతులు శాంతియుతంగానే నిరసనలు తెలుపుతున్నారు, ఆందోళనలు చేస్తున్నారు. అయినా జగన్ ప్రభుత్వం వారిపై పోలీసులతో కేసులు పెట్టిస్తోంది. అమరావతిలో ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తోంది. ఈ వ్యవహారం హైకోర్టు వరకు వెళ్ళింది. ప్రస్తుతం స్టేటస్‌ కో (యథాతథ పరిస్థితి) కొనసాగుతోంది.


ఈ పరిస్థితుల్లో కేంద్రం జోక్యం చేసుకోవాలన్నది ఆంధ్రుల, ముఖ్యంగా అమరావతి ప్రాంత ప్రజల డిమాండ్‌. పార్లమెంట్‌లోనూ ఈ అంశాన్ని ప్రస్తావించాం. మొన్నటి వర్షాకాల సమావేశాల్లోనూ మరోసారి కేంద్రం దృష్టికి తీసుకెళ్ళాం. అమరావతిని ఢిల్లీ కన్నా మెరుగైన నగరంగా రూపొందించేందుకు కేంద్రం మద్దతు పూర్తిగా ఉంటుందన్న తాను సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇచ్చిన హమీని ప్రధాని మోదీ గుర్తు చేసుకోవాలి. మూడు రాజధానుల నిర్ణయంతో ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. కాబట్టి కేంద్రం జోక్యం చేసుకోవాలి. రైతుల త్యాగాలను, రాష్ట్ర్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకోవాలి. అమరావతిని రక్షించాలి.


రైతులు తమ భూములను కన్నతల్లిలా భావిస్తారు. తమకు ప్రాణప్రదమైన భూములను రాజధాని కోసం త్యాగం చేశారు. భావి తరాల శ్రేయస్సుకు ఉపయోగపడతాయనే చిన్న ఆశతో పెద్ద మనసుతో రాజధాని అమరావతి రైతులు చేసిన త్యాగాలను జగన్ ప్రభుత్వం మరిచినా నేను మరువను, చరిత్ర మరువదు. ప్రపంచంలోనే అద్భుత నగరంగా నిర్మాణం కావాలని భారత ప్రధానమంత్రి, ఇరుగు పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ దేశాధినేతలు, మరీ ముఖ్యంగా ఐదున్నర కోట్ల ఆంధ్రులు కోరుకున్నారు. కానీ తాను కూర్చున్న కొమ్మను నరుక్కుంటోంది నవ్యాంధ్ర ప్రస్తుత ప్రభుత్వం!
-గల్లా జయదేవ్‌

(వ్యాసకర్త పార్లమెంట్‌ సభ్యులు)

Advertisement
Advertisement
Advertisement