Abn logo
Jul 14 2020 @ 01:10AM

భావితరాల శ్రేయస్సు మనదే!

కరోనా మహమ్మారితో దేశ ఆర్థిక వ్యవస్థకు, ప్రజల ఆదాయాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ నష్టాన్ని మనకు మనమే భరించాలి, అదెంత కష్టమైనా సరే. ఎట్టి పరిస్థితులలోను భావితరాల వారి సంక్షేమానికి హాని జరగకుండా మనం వ్యవహరించాలి. ఈ నైతిక కర్తవ్య పాలన జరగాలంటే ద్రవ్య విధానాన్ని కాకుండా కోశ విధానాన్ని మాత్రమే మనం అనుసరించాలి.


మనకేంద్ర బ్యాంక్ ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) కరెన్సీ నోట్లను ముద్రిస్తుంది. కరోనా మహమ్మారితో తగ్గిపోయిన ఆదాయాన్ని భర్తీ చేసుకునేందుకు గాను భారత ప్రభుత్వం ఆ కరెన్సీని రుణంగా తీసుకొంటున్నది. ప్రస్తుత సంక్షోభానికి ఇది సమర్థనీయమైన ప్రతిస్పందనే అయినప్పటికీ, ఇంకా అనేక అంశాలు దానితో ముడివడివున్నాయి. 


ప్రభుత్వ ఆర్థిక విధానంలో రెండు భాగాలు: కోశ విధానం, ద్రవ్య విధానం. పన్నుల వసూలు, ఆ రాబడిని అవసరమైన వ్యయాలకు ఉపయోగించడానికి సంబంధించినది కోశ విధానం (ఫిస్కల్ పాలసీ). ఒక దేశ కేంద్ర బ్యాంకు రుణ నియంత్రణకు తీసుకునే చర్యలే ద్రవ్య విధానం (మానెటరీ పాలసీ) గా నిర్వచించవచ్చు. ఆర్బీఐ ఆధ్వర్యంలో కరెన్సీ నోట్ల ముద్రణ, ఆ నోట్లను బ్యాంకులకు సరఫరా చేయడం, బ్యాంకులు ఆ డబ్బుతో ప్రభుత్వం విక్రయించే బాండ్లను కొనుగోలు చేయడం, తద్వారా ప్రభుత్వం ధనాన్ని పొందడం అనేవి ద్రవ్య విధానానికి సంబంధించిన అంశాలు.


కోశ విధానాన్ని అనుసరిస్తే ప్రజలపై తక్షణమే ఆర్థిక భారం పడుతుంది. ఉదాహరణకు ప్రభుత్వం వస్తుసేవల పన్ను (జీఎస్టీ)ని 18 నుంచి 24 శాతానికి పెంచిందనుకుందాం అప్పుడు మీరూ, నేనూ కొనే మొబైల్ ఫోన్‌కు మరింత అదనంగా చెల్లించవలసివుంటుంది. ప్రతి వినియోగదారుడికీ ఈ భారం అనివార్యం. ప్రభుత్వాలు అనివార్యంగా అనేక వ్యయాలు చేస్తుంటాయి. ఈ వ్యయాల నుంచి ప్రయోజనాలు వెన్వెంటనే ప్రాప్తించవచ్చు లేదా భవిష్యత్తులోనైనా సమకూరతాయి. ప్రభుత్వం తన ఆదాయాన్ని గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలుకు, ఆహార సబ్సిడీలకు, ఉద్యోగుల భవిష్యనిధిలో యజమాని వాటాను చెల్లించేందుకు గాను చిన్న తరహా పరిశ్రమలకు సహాయం సమకూర్చేందుకు ఉపయోగించడం జరిగితే ప్రయోజనాలు తక్షణమే ప్రాప్తిస్తాయి. ఆ డబ్బు వెన్వెంటనే ప్రజల జేబుల్లోకి వెళుతుంది. అలా కాకుండా అదే డబ్బును బుల్లెట్ ట్రైన్, జాతీయ జల రహదారులు, లేదా అంతరిక్ష పరిశోధనలకు, అణు, జన్యు సాంకేతికతల అభివృద్ధి మొదలైన వాటికి వినియోగిస్తే మూడు లేదా ఐదు లేదా పది సంవత్సరాల అనంతరం ప్రయోజ నాలు సమకూరతాయి. అటువంటి ప్రాజెక్టుల అమలుకు సుదీర్ఘ వ్యవధి పడుతుంది కనుక వాటి ప్రయోజనాలు సమకూరడానికి సైతం సుదీర్ఘకాలం పడుతుంది. ద్రవ్య విధానం వ్యవహారమైన కరెన్సీనోట్ల ముద్రణ భారం భవిష్యత్తులో ఉంటుంది దేశ ఆర్థిక వ్యవస్థలో రూ.100 కోట్ల విలువైన కరెన్సీ నోట్లు చెలామణీలో ఉన్నాయనుకోండి. మార్కెట్లో కొనుగోలుకు రూ.100 కోట్ల విలువైన సరుకులు అందుబాటులో ఉంటాయి. సరుకులు, నగదు సమానస్థాయిలో ఉంటాయి. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ అదనంగా రూ.10 కోట్ల విలువైన కరెన్సీ నోట్లు ముద్రించడం జరిగితే వాణిజ్య బ్యాంకుల ద్వారా ప్రభుత్వం ఆ సొమ్మును పొందుతుంది. ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న సరుకుల విలువ గతంలో మాదిరిగానే రూ.100 కోట్లు మాత్రమే కాగా చెలామణీలో ఉన్న కరెన్సీ నోట్లు రూ.110 కోట్లకు పెరిగాయి. పర్యవసానంగా గతంలో రూ.10 ధర పలికిన కలం ఇప్పుడు రూ.11 ధర పలుకుతుంది ఎందుకంటే ఇప్పుడు కరెన్సీ నోట్లు అధిక సంఖ్యలో చెలామణీలో ఉన్నాయి. సరుకులేమో యథావిధిగా రూ.100 కోట్ల కిమ్మతు చేసేవి మాత్రమే ఉన్నాయి. అయితే ధరల పెరుగుదలకు కొంత సమయం పడుతుంది. 


ప్రభుత్వం అప్పులు తీసుకుంటుంది కదా. ఆ డబ్బును బ్యాంకుల నుంచి పొందిన డబ్బును ప్రభుత్వం ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖకు కేటాయించిందనుకోండి. ఆ మంత్రిత్వ శాఖ హై వేల నిర్మాణానికి టెండర్లను పిలుస్తుంది. ప్రభుత్వం ఆమోదించిన కాంట్రాక్టర్ హై వేను నిర్మిస్తాడు. బిల్లు పెడతాడు. ప్రభుత్వం అతనికి డబ్బు చెల్లిస్తుంది. అలా డబ్బు ఆర్థిక వ్యవస్థలో చెలామణీలోకి వస్తుంది. ఈ దృష్ట్యా ద్రవ్య విధానం ప్రజలపై మోపే భారం భవిష్యత్తులో మాత్రమే సంభవిస్తుంది. గ్రామీణ ఉపాధి హామీ పథకంపై వినియోగించిన డబ్బుతో ప్రయోజనాలు వెంటనే సమకూరగా హై వేల నిర్మాణానికి వెచ్చించిన డబ్బుతో ప్రయోజనాలు భవిష్యత్తులో సమకూరతాయి. ఈ కారణంగానే ప్రభుత్వం ద్రవ్య విధానం పట్ల మొగ్గుచూపుతుంది. కోశ విధానాని కంటే ద్రవ్య విధానానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తుంది. ప్రజలకు సబ్సిడీపై సరఫరా చేసే ఆహారధాన్యాలు సమకూర్చడం వల్ల రాజకీయ వేత్తలు ప్రయోజనం పొందుతారు. అయితే ఈ వితరణ ఫలితంగా భావి తరాలపై ఆర్థిక భారం పడుతుంది. అది వారికి అనివార్యం. ద్రవ్య విధానాన్ని కాకుండా కోశ విధానాన్ని అనుసరిస్తే భావితరాల వారి శ్రేయస్సు కోసం వర్తమాన తరాల వారే ఆర్థిక భారాన్ని మోయవలసి వుంటుంది. పిల్లల చదువు సంధ్యలకు కుటుంబ పెద్ద బాధ్యతగా ఆర్థిక భారాన్ని మోసినట్టుగానే సమాజం భావి తరాల గురించి ఆలోచించవలసివున్నది. 


ద్రవ్య విధానం ప్రజల నిశిత పరీక్షను తప్పించుకుంటుంది. కోశ విధానం ప్రజలను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. కనుక పన్నులు ఎందుకు పెంచారని, తామెందుకు అధికపన్నులు చెల్లించాలని ప్రజలు తప్పక ప్రశ్నిస్తారు.ప్రభుత్వం నుంచి సమాధానాలను డిమాండ్ చేస్తారు. ప్రభుత్వ వ్యయాలలో అవినీతిని, నిధుల దుర్వినియోగాన్ని వారు ప్రశ్నిస్తారు. తమపై అధిక పన్నులు విధించే ముందు ప్రభుత్వం తన ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకోవాలని కోరుతారు. ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించినప్పుడే ప్రజలూ చట్టాలను తుచ తప్పకుండా పాటిస్తారు. పాలకులు గుర్తుంచుకోవల్సిన సత్యమిది. ద్రవ్య విధానం అమలుపై ప్రజల నిశిత దృష్టి వుండదు. కరెన్సీ నోట్ల ముద్రణ, వాటిని బ్యాంకులకు సరఫరా చేయడం, ప్రభుత్వ బాండ్లను బ్యాంకులు కొనుగోలుచేయడం, తద్వారా లభించిన రాబడిని ప్రభుత్వం వినియోగిస్తున్న తీరు తెన్నులు మొదలైన వాటితో ప్రజలకు నిమిత్త ముండదు. అవి వారి ప్రత్యాక్షానుభవాలలోకి రాని వ్యవహారాలు. మరి ప్రభుత్వం ద్రవ్య విధానాన్నే ఎక్కువగా ఇష్టపడడంలో ఆశ్చర్యమేముంది? కరోనా మహమ్మారితో దేశ ఆర్థిక వ్యవస్థకు, ప్రజల ఆదాయాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ నష్టం నుంచి కోలుకోవడం ఎలా? ఏమైనా ఆ నష్టాన్ని మనకు మనమే భరించాలి, అదెంత కష్టమైనా సరే. ఎట్టి పరిస్థితులలోను భావితరాల వారి సంక్షేమానికి హాని జరగకుండా మనం వ్యవహరించాలి. ఈ నైతిక కర్తవ్య పాలన జరగాలంటే ద్రవ్య విధానాన్ని కాకుండా కోశ విధానాన్ని మాత్రమే మనం అనుసరించాలి.

భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Advertisement
Advertisement

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేమరిన్ని...

Advertisement