మరబొమ్మల్లా మట్టి మనుషులు

ABN , First Publish Date - 2020-12-29T09:12:05+05:30 IST

లక్షలాది రైతులు ఢిల్లీ నగరానికి పోటెత్తారు. కేంద్రప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయచట్టాలను ఉపసంహరించుకోవాలని...

మరబొమ్మల్లా మట్టి మనుషులు

కార్పొరేటీకరణ వల్ల వ్యవసాయరంగం సంక్షోభానికి గురి అవుతుందనేది స్పష్టం. ప్రభుత్వం ఎన్ని వాదనలు చేసినా రైతులు కోలుకోలేని విధంగా నష్టపోతారనేది ఒక నిండు నిజం. ఈ సంక్షోభాల ప్రభావం మరీ ముఖ్యంగా మహిళా కార్మికులపై దారుణంగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు.


లక్షలాది రైతులు ఢిల్లీ నగరానికి పోటెత్తారు. కేంద్రప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయచట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధానిని దిగ్బంధం చేశారు. చలిగాడ్పులకు చలించకుండా కొత్త సాగుచట్టాలను ప్రతిఘటిస్తున్నారు. రైతుల ఈ అలుపెరగని పోరాటం ప్రారంభమై 30 రోజులు దాటింది. మూడు డిగ్రీలలో గుడారాలు వేసుకొని ఢిల్లీ సరిహద్దుల్లోనే తిష్ట వేశారు. 80 ఏళ్ళు పైబడ్డ వృద్ధుల నుంచి 10 ఏళ్ళ బాలుర దాక గడ్డ కట్టించే చలిలో రోడ్లపై దీక్షలో కూర్చున్నారు. ఈ ఎదురీత వ్యవసాయరంగ చరిత్రలోనే అరుదైనది. దేశం అన్ని మూలల నుంచి సాంస్కృతిక సాహిత్య రంగాలతో బాటు అన్ని రంగాలవారు ఈ పోరాటానికి మద్దతు తెలుపుతున్నారు. ఢిల్లీకి సమీపంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల రైతులు కూడా పంజాబ్‌, హర్యానా రైతులతో కలిసి పోరాటంలో పాల్గొంటున్నారు. ఈ పోరాటానికి దేశవ్యాప్తంగా సకల రైతులు మద్దతు తెలపడానికి ప్రధాన కారణం నరేంద్రమోదీ ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్‌ వ్యవస్థలను కార్పొరేట్ పరిధిలోకి మార్చటమే.


కొత్త వ్యవసాయచట్టాలు తమ వ్యవసాయాన్ని ధ్వంసం చేస్తాయని రైతులు అభిప్రాయపడుతున్నారు. అంబానీ లాంటి కార్పొరేట్ కుబేరులు వ్యవసాయరంగంపై పెత్తనం వహించేలా చేయడమే ఈ కొత్తచట్టాల లక్ష్యమని రైతులు నమ్ముతున్నారు. గత ముప్పై ఏళ్ళ సరళీకరణ, ప్రైవేటీకరణ అభివృద్ధి నమూనా తమకు చేదు అనుభవాలనే మిగిల్చాయని రైతులు భావిస్తున్నారు. కొత్త సాగుచట్టాలు సేద్యరంగాన్ని పూర్తిగా కార్పొరేటీకరణ చేయనున్నందున స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన తమ వ్యవసాయ జీవనోపాధులను కోల్పోతామని రైతులు భయపడుతున్నారు. జీవనోపాధులతో పాటు భూమిని కూడా కోల్పోతామని వారు గట్టిగా నమ్ముతున్నారు. తత్కారణంగానే మొక్కవోని పట్టుదలతో ఆ చట్టాలను రద్దు చేసి తీరవలసిందేనని డిమాండ్ చేస్తున్నారు. వీటిని మినహా మరి దేన్నీ తాము అంగీకరించబోమని స్పష్టం చేస్తున్నారు. 


రైతుల భయాల లాంటివే గతంలో ఈ వ్యాసకర్త మూడు దశాబ్దాల పాటు నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడయ్యాయి. హైదరాబాద్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెదక్‌ జిల్లాలోని గ్రామంలో ఆ అధ్యయనాన్ని నిర్వహించాను. 1979లో అధ్యయనం ప్రారంభించిన నాడు ఆ గ్రామంలో వరిపంట ప్రధాన పంటగా ఉండేది. ఆ గ్రామానికి 13 కిలోమీటర్ల దూరంలో ఆసియాలోని చాలా పెద్దదైన పారిశ్రామికవాడ అభివృద్ధి చెందింది. ఈ గ్రామంలో మూడు దశాబ్దాల కాలంలో వచ్చిన మార్పులను పరిశీలిస్తే రైతుల ప్రస్తుత భయాందోళనలకు సాక్ష్యాధారాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆ గ్రామంలో, ముఖ్యంగా వ్యవసాయరంగంలో వస్తున్న మార్పుల గురించి 1979, 1995-–96లో, 2009–-10లలో జరిపిన మూడు సర్వేలలో అధ్యయనం చేశాం. ఈ మూడు సర్వేలలోనూ గ్రామంలో అవే కుటుంబాల నుంచి వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని సేకరించాం. మహిళల జీవనాధారాలైన వ్యవసాయవృత్తులు, మహిళల పనులలో మార్పులు, వారి జీవనస్థాయిలలో మార్పుల వంటి అంశాలు ఈ అధ్యయనంలో ఉన్నాయి. అందులోనూ మహిళల జీవనవృత్తులు, జీవనస్థాయిలపై ప్రైవేటీకరణ, కార్పోరేటీకరణల ప్రభావాలు ప్రధాన అంశాలుగా ఉన్నాయి. 


ప్రస్తుత రైతుల పోరాటంలో మహిళా రైతులు పూర్తి నిబద్ధతతోను, సంపూర్ణ అవగాహనతోను తమ పాత్రను నిర్వహిస్తున్నారు. ఉదాహరణకు హరిందర్‌ బిందూ లాంటి మహిళా నాయకురాలు ఎన్నో గ్రామాలకు వెళ్ళి కార్యకర్తలను చైతన్యపరుస్తున్నారు. పోరాట లక్ష్యాలపై అవగాహన కల్పిస్తున్నారు. అయినా మహిళల భూమికపై సరైన చర్చ జరగడం లేదు. పోరాట ప్రదేశంలో ఎంతోమంది మహిళలు పురుషులతోబాటు క్రియాశీలంగా పాల్గొంటున్నారు. ఒకవేళ పోరాటప్రాంతానికి పోలేకపోతే, పంటలను రక్షించుకునే పనిలో ఉండటం, పోరాటంలో పాల్గొంటున్న పురుషులకు కావలసిన సదుపాయాలను సమకూర్చటం లాంటి ఎన్నో బాధ్యతలను నిర్వహిస్తున్నారు. మహిళల పాత్ర లేనట్లయితే ఈ పోరాటానికి సమస్యలు ఎక్కువగా ఉండేవి. ఈ బాధ్యతలన్నీ వీరు నిర్వహించినా అవేవీ చర్చకు రావటం లేదు. 


ఈ వ్యాసకర్త సేకరించిన సమాచార విశ్లేషణలోకి వెళితే మొదటి సర్వేకాలం నాటికి (1979–-80) గ్రామ కుటుంబాలలో 82 శాతం వ్యవసాయమే జీవనాధారంగా కలిగి ఉన్నాయి. ఈ వ్యవసాయ కుటుంబాలలో 62 శాతం మహిళా కార్మికులున్నారు. ఈ అంశం వ్యవసాయరంగ మనుగడకు సంబంధించి చాలా ప్రధానమైనది. గ్రామంలో ఉన్న మొత్తం భూమిలో 90 శాతం భూమి వ్యవసాయభూమిగా ఉండేది. ఆ భూమికి కావలసిన అభివృద్ధి కార్యక్రమాలకు, నీటిపారుదల ఇత్యాది వసతుల కల్పనకు ప్రభుత్వమే బాధ్యత వహించింది. కాబట్టి చిన్న, సన్నకారు రైతులు వ్యవసాయంలో మనగలిగారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా హరిత విప్లవ సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయాభివృద్ధి కోసం అనుసంధానం చేయడం జరిగింది. వరి ఒక అత్యవసర పంట. దీనికి పేదరికాన్ని తగ్గించే శక్తి ఉన్నది. ప్రత్యేకించి 70వ దశకంలో వరిపంట సాగుకు ప్రాధాన్యమిచ్చారు. వరి పంటలో మహిళాకార్మికుల పాత్ర కీలకమైనది. హరితవిప్లవానికి నీటిపారుదల తోడై ఆ సమయంలో వ్యవసాయకుటుంబాల ఆదాయాలు వేగంగా పెరిగాయి. ఇలాంటి కారణాల మూలంగా కరోనా సంక్షోభ కాలంలో వలస కార్మికులు తమ గ్రామాలకు చేరితే ఆహారానికి సమస్య ఉండదంటూ చిన్న పిల్లలను చంకలో ఎత్తుకొని, మూటలు తలపై మోసుకొని వందల కిలోమీటర్లు కాలినడకన వెళ్లారు. కార్పొరేట్ ‌సంస్థల ప్రాబల్యం వల్ల లక్షల టన్నుల ధాన్యం గోడౌన్‌లలో ఉన్నా వలస కార్మికులను ఆదుకునే ప్రయత్నం జరగలేదు!


1990 దశకంలో ఆర్థిక సంస్కరణల పేరుతో జరిగిన మార్పుల వల్ల అంతకుముందు ఎన్నడూ లేని విధంగా వ్యవసాయరంగం మార్కెట్‌ ఆధారిత ఉత్పాదకాలు వాడటం, ఆ రంగంలో అమలుపరుస్తున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం ఉపసంహరించుకోవటం మొదలైన పెను మార్పులు జరిగాయి. 1995–-96లో జరిపిన రెండవ సర్వే నాటికి సరళీకరణ, ప్రైవేటీకరణ ప్రక్రియలు ఊపు అందుకుని వ్యవసాయ ఉత్పాదకాల ధరలపై ప్రభుత్వ నియంత్రణ లేకుండాపోవటం వల్ల రైతులపై అధిక ధరల భారం పడింది. దీనితో సన్నచిన్న రైతులు తమ భూమిలో సాగుకు బదులు వ్యవసాయేతర పనులకు మారడం ప్రారంభమయింది. ఇక 2009–-10లో మూడవ సర్వే నాటికి సన్నకారు, చిన్నకారు రైతులు తమ కమతాలను అమ్మడం, వారు దిగుబడి చేసిన అల్ప ఉత్పత్తుల ధరలు ఉత్పాదకాల ధరలలాగ పెరగకపోవడం వల్ల ఒక ఎకరంలో రైతు వరిపంటకు దాదాపు రూ.10,000 నష్టాన్ని భరించవలసి వచ్చింది.

సన్నకారు, చిన్నకారు రైతులు ఈ పరిస్థితులను తట్టుకోలేక రోజువారీ వేతన పనులకు వెళుతూ, రోడ్లు వేసే కాంట్రాక్టర్లకు తమ పంటభూముల నుంచి మట్టి అమ్ముకొని జీవనం గడిపే దయనీయమైన స్థితి వచ్చింది. మట్టి తీయడం వల్ల గుంతలు పడిన భూములు వర్తమానంలో గానీ, భవిష్యత్తులో గానీ సాగుకు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. తాతల కాలం నుంచి భద్రజీవితానికి ఆసరా ఇచ్చిన వ్యవసాయ భూములపై ఆధారపడలేక ఉపాధుల కోసం వ్యవసాయేతర రంగాలకు మారడానికి సిద్ధమయ్యారు. ఆసియాలోనే అతిపెద్దదైన పారిశ్రామికవాడగా వృద్ధి చెందిన ఆ ప్రాంతంలో వ్యవసాయ ఉత్పత్తుల నుంచి బయటికి వచ్చిన మహిళలకు ఆ పరిశ్రమలు గౌరవప్రదమైన ఉపాధులను కల్పించలేదు. చాలామంది గృహిణులుగా ఇంటి పనులకు పరిమితమై ఉత్పత్తి కార్మికులుగా తమ అస్తిత్వం పోగొట్టుకున్నారు. ఇక విద్యావంతులైన వారి పిల్లలను ఆ పరిశ్రమలలోకి తీసుకున్నా భద్రత కొరవడిన ఉద్యోగాలవి. వారికి అతి స్వల్ప వేతనాలు మాత్రమే లభించాయి.

మొట్టమొదట ఈ పరిశ్రమల స్థాపన, ఆ గ్రామంలోని ప్రభుత్వ భూమి సేకరణతో మొదలయింది. రైతులకు రక్షణగా ఉన్న ప్రభుత్వం కమిషన్‌ ఏజెంట్‌లా మారి రైతుల పంటభూములను కొని ధరల యంత్రాంగాన్ని చురుకుగా ఏర్పరచి ప్రైవేటు పరిశ్రమలకు భూమిని ఇవ్వడం మొదలు పెట్టింది. గతంలో ఆ గ్రామచరిత్రలో అలా ఎప్పుడూ జరగలేదు. ప్రభుత్వం రైతుల నుంచి 40 ఎకరాల భూమిని సేకరించి ప్రైవేటు పరిశ్రమలకు ఇచ్చింది. దీనితో స్పెక్యులేటివ్‌ బిజినెస్‌ (సట్టా వ్యాపారం) ఊపందుకొన్నది. భూమికి ధర పెరిగి మార్కెట్‌లో అమ్మే వస్తువుగా మారిపోయింది.

ఎన్ని పరిశ్రమలు పెట్టినా రెండోతరం విద్యావంతులకు కూడా సుస్థిరమైన ఉద్యోగాలు రాలేదు. శ్రమ దోపిడీ యథేచ్ఛగా కొనసాగింది. పరిశ్రమల యాజమాన్యాలు అత్యధిక లాభాలను అత్యల్ప సమయంలో సముపార్జించుకునే లక్ష్యంగా ఆ ఉద్యోగాలు ఉన్నాయనేది ఒక కఠోర వాస్తవం. తత్ఫలితంగా పని పద్ధతులన్నీ లభాలు సమకూర్చేవిగా మాత్రమే మిగిలిపోయాయి. ఉదాహరణకు ఈ పరిశ్రమలు విధించిన నియమాల ప్రకారం అమ్మాయిలు ఉద్యోగాలు పొందేందుకు పెళ్ళి కానంతవరకే అర్హులు. ఈ అమ్మాయిల వయసు 18–-19 ఏళ్ళ మధ్య ఉండాలి. దీంతో 20–-21 సంవత్సరాలకు వారికి పెళ్ళి కాగానే ఉద్యోగం ఊడిపోతుంది. ఇలా అమ్మాయిల ఉద్యోగం ఊడటంతో, కొత్త అమ్మాయిలను మళ్ళీ అవే షరతు లతో ఉద్యోగంలోకి తీసుకోవడం వల్ల, వీళ్లు అస్థిరకార్మికులు (ఫ్లీటింగ్‌ లేబర్‌)గా మాత్రమే మిగిలారు. లేదా ట్రైనింగ్ ఉద్యోగాలల్లో ఉన్నందున వారికి స్టైఫండు ఇస్తారు. అది వేతనం కాదు కాబట్టి, వీరి పనికి ఉత్పత్తితో ముడిపడిన శ్రమగా గుర్తింపు వచ్చే అవకాశాలే లేవు.

ఈ అభివృద్ధి అనుభవాన్ని పరిశీలిస్తే గ్రామంలో వ్యవసాయరంగం కార్పొరేటీకరణ వల్ల సంక్షోభానికి గురి అవుతుందనేది స్పష్టం. మొత్తం అభివృద్ధి నమూనాలో రైతులే కాక మహిళలు మరింత ఎక్కువగా నష్టపోతారు. ఈ అంశం మీద లోతైన చర్చ జరగవలసిన అవసరముంది. ఇలాంటి చేదు అనుభవాల వల్లే ఇవాళ రైతులు, వారి కుటుంబసభ్యులు అందరూ పోరాటంలో భాగమయ్యారు. ప్రభుత్వం ఎన్ని వాదనలు చేసినా కార్పొరేటీకరణ వల్ల వ్యవసాయరంగం కోలుకోలేని దెబ్బ తింటుందనేది ఒక నిండు నిజం. ఈ సంక్షోభాల ప్రభావం మహిళా కార్మికులపై దారుణంగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. 

డాక్టర్ వనమాల

పాలమూరు అధ్యయన వేదిక

Updated Date - 2020-12-29T09:12:05+05:30 IST