అరుదైన ఔషధపు మొక్క

ABN , First Publish Date - 2021-06-08T06:08:22+05:30 IST

మనిషిత్వం మసకబారుతూ గాయాలు నెత్తురు గక్కుతుంటే

అరుదైన ఔషధపు మొక్క

మనిషిత్వం మసకబారుతూ 

       గాయాలు నెత్తురు 

             గక్కుతుంటే

శత్రువు అస్తిత్వం 

    పొట్టలోకి ఆయుధాన్ని 

     బలంగా దించినపుడు

యుద్ధ విరామ కాలాన 

  కలల గుండెల్లో తూటాలు 

        దిగిన చీకటి రాత్రి

దేశానికి గర్భస్రావం

ఈ ఋతువున మనుషులంతా నిన్ను వెతుకుతుంటారు

నువ్వు అరుదైన ఔషధపు మొక్కవి!

వేదికల్ని వెక్కిరించడం

నిత్యం పెనుగులాడే అక్షర మొలల్ని దించడం

పొగరుబోతు వాక్యాల్ని ధిక్కరించడం

రెక్కలు తెగిన పక్షుల్ని సిద్ధాంతీకరించడం

భూమ్మీద కాండ్రించి ఉమ్మినట్టు దళారీతనం ముఖంపై...

విరబూసిన మోదుగు పూలన్నీ

మిగులగాసిన ద్రాక్షగుత్తులన్నీ

బలిసినోడి సంకన జేరినప్పుడు

నువ్వు గోబీ ఎడారిలో గిరిజన వీరుని బాణానివి

మై డియర్ సోషల్ విలన్ కోలపూడి ప్రసాద్! 

నిప్పులు చెలరేగితేనే జీవితం

దమ్మిడీకి కొరగానోనివి అన్నప్పుడే బతికినట్టు

బతికీ బతకనట్టు బతకడం తెలియనోడ!

కోలపూడి ప్రసాద్ జీవితం వికటించి చనిపోయాడు

లోకమంతా రొచ్చులా గోచరించిందని తెలుసు

ప్రజాస్వామ్యం లైసెన్సుడు పడుపువృత్తై 

రోత పుట్టించిందనీ తెల్సు

జీతం రాళ్ల కోసం పాకులాడే భద్రజీవిగా బతకలేక

మాట మాత్రం చెప్పకుండా జీవితాన్ని సర్దేశావా?!

చాలా రాసేదుందన్నవ్!

అప్పుడే పోయావు మరణ తీవ్రత లేకుండానే...

నేనొప్పుకోను

రా... కో.ప్ర. రా...! 

         కొత్త ఎం.బి.సి. రాజ్యాంగం రాసుకుందాం!


- డా. కదిరె కృష్ణ

95052 51975

Updated Date - 2021-06-08T06:08:22+05:30 IST