అసలు గెలుపు టీడీపీదే!

ABN , First Publish Date - 2021-02-23T09:09:39+05:30 IST

‘‘ప్రజాస్వామ్యానికి-జగన్‌ రెడ్డి నియంతృత్వానికి మధ్య జరిగిన స్థానిక ఎన్నికల సంగ్రామంలో కొంత తేడాతో సంఖ్యా విజయం వైసీపీదైనా.. అసలు సిసలు గెలుపు టీడీపీదే’’ అని ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి

అసలు గెలుపు టీడీపీదే!

కార్యకర్తలు, నేతలకు నమస్కారం

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు: లోకేశ్‌


అమరావతి, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రజాస్వామ్యానికి-జగన్‌ రెడ్డి నియంతృత్వానికి మధ్య జరిగిన స్థానిక ఎన్నికల సంగ్రామంలో కొంత తేడాతో సంఖ్యా విజయం వైసీపీదైనా.. అసలు సిసలు గెలుపు టీడీపీదే’’ అని ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. ‘‘అంబేడ్కర్‌ రాజ్యాంగం ప్రకారం జరగాల్సిన ఎన్నికలను, జగన్‌రెడ్డి తన తాత రాజారెడ్డి రాజ్యాంగంతో అడ్డుకున్నారు. మన దేశానికి అర్థరాత్రి స్వాతంత్య్రం వస్తే.. నాలుగు విడతల పంచాయతీ ఎన్నికల్లో అర్థరాత్రి జగన్‌రెడ్డి ఫ్యాక్షన్‌ పాలిటిక్స్‌కి స్వాతంత్య్రం వచ్చింది. టీడీపీ మద్దతుతో పోటీచేసే అభ్యర్థుల్ని చంపేశారు. నామినేషన్‌ వేయకుండా కిడ్నాప్‌ చేశారు. బెదిరించారు. భయపెట్టారు. కట్టేసి కొట్టారు. అయినా వెనక్కితగ్గని టీడీపీ అభ్యర్థులు లెక్కింపులో ముందంజలో ఉంటే..  విద్యుత్‌ నిలిపేశారు. కౌంటింగ్‌ కేంద్రాలకు తాళాలేశారు. పోలీసులతో బెదిరించారు. దాడులు చేశారు.


టీడీపీ మద్దతుదారులు గెలిచిన చోట్ల రీకౌంటింగ్‌ పేరుతో వైసీపీ గెలుపు ప్రకటించుకున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఎన్నడూ లేనివిధంగా జగన్‌రెడ్డి అరాచకాలకు పాల్పడినా ధైర్యంగా ఎదురొడ్డి నిలిచి గెలిచిన టీడీపీ కార్యకర్తలు, నేతలు, అభిమానులందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నా. ప్రజాస్వామ్యాన్ని రక్షించిన ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నా’’ అని లోకేశ్‌ సోమవారం ట్వీట్‌ చేశారు. కాగా, గ్రామాల్లో టీడీపీ పటిష్టంగా ఉందని పంచాయతీ ఎన్నికల ద్వారా నిరూపితమైందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. అధికార పార్టీ నేతల దాడులు, ధన ప్రవాహాన్ని టీడీపీ శ్రేణులు ఎదురొడ్డి పోరాడాయని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు ప్రజాస్వామాన్ని ఖూనీ చేశారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. ఇంత దారుణమైన ఎన్నికలను తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదని ట్వీట్‌ చేశారు. 


వార్‌ సీబీఎన్‌ సైడ్‌: జవహర్‌

సన్నబియ్యం సన్నాసి వైసీపీ నాయకుల పూర్వీకుల ఊళ్లని లెక్కేసుకుంటే.. టీడీపీ గెలిచిన స్థానాల వివరాలు తెలుస్తాయని మాజీ మంత్రి జవహర్‌ విమర్శించారు. ఆ ఊళ్లో మేము పుట్టలేదని ఒకడు, అది మా పూర్వీకుల ఊరని మరొకడు, అసలు మా ఊరు ఏపీలోనే లేదని ఇంకో వైసీపీ నాయకుడు భుజాలు తడుముకున్నప్పుడే.. వార్‌ వన్‌సైడ్‌ కాదు.. సీబీఎన్‌ సైడ్‌ అని తేలిపోయిందన్నారు. అధికార పార్టీ అరాచకం, ఎన్నికల అధికారుల స్వామిభక్తి పారాయణం, కొందరు పోలీసు అధికారుల బరితెగింపు.. కలిపినా అధికార పార్టీకి 90ు పంచాయతీల్లో గెలుపు సాధ్యం కాలేదని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఎద్దేవా చేశారు.  


ఉత్తరాంధ్రకు నీళ్లెలా?: బుద్దా వెంకన్న 

‘‘పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వను 41.15 మీటర్లకు తగ్గించేలా నిర్మిస్తే.. ఉత్తరాంధ్ర సుజల సవ్రంతికి నీళ్లెలా వస్తాయి? విశాఖ ప్రజల అవసరాలు ఎలా తీరతాయి?’’ అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రశ్నించారు. కేంద్రం ముందు మెడలు వంచేసి, పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్ధ్యాన్ని 41.15 మీటర్లకు తగ్గించి, మీ దొంగల బ్యాచ్‌ చేస్తున్న పనులు అందరికీ తెలుసు అంటూ ఎంపీ విజయసాయిరెడ్డిపై మండిపడ్డారు. కాగా, స్థానిక ఎన్నికల్లో వైసీపీ గెలిచింది సగం పంచాయతీలేనని, 80ు గెలిచిందంటూ అధికార పార్టీ నాయకులు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం విమర్శించారు.  

Updated Date - 2021-02-23T09:09:39+05:30 IST