రియల్టీ మార్కెట్లో మళ్లీ ఊపు

ABN , First Publish Date - 2021-01-12T09:26:24+05:30 IST

రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్లో మళ్లీ జోష్‌ కనిపిస్తోంది. కొవిడ్‌తో కుప్పకూలిన అమ్మకాలు గత ఏడాది అక్టోబరు నుంచి మళ్లీ పుంజుకున్నాయి.

రియల్టీ మార్కెట్లో మళ్లీ ఊపు

జోరందుకున్న కొత్త ప్రాజెక్టులు


న్యూఢిల్లీ : రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్లో మళ్లీ జోష్‌ కనిపిస్తోంది. కొవిడ్‌తో కుప్పకూలిన అమ్మకాలు గత ఏడాది అక్టోబరు నుంచి మళ్లీ పుంజుకున్నాయి. స్థిరాస్తి బ్రోకరేజీ సంస్థ ప్రాప్‌టైగర్‌ డాట్‌కామ్‌ సంస్థ ఇందుకు సంబంధించి ‘రియల్‌ ఇన్‌సైట్‌ క్యూ4, 2020 పేరుతో ఒక నివేదిక విడుదల చేసింది. మార్కెట్‌ కోలుకోవడంతో 2019తో పోలిస్తే 2020లో అమ్ముడుపోని యూనిట్ల సంఖ్య తొమ్మిది శాతం తగ్గి 7.18 లక్షల యూనిట్లకు చేరింది. వీటిని అమ్మేందుకు బిల్డర్లకు ఎంత లేదన్నా నాలుగేళ్లు పడుతుందని ప్రాప్‌టైగర్‌ నివేదిక తెలిపింది. 


కొత్త ప్రాజెక్టులు 

అమ్మకాలు పుంజుకోవడంతో బిల్డర్లు కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నారు. హైదరాబాద్‌తో సహా దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో 2020 అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో కొత్తగా 54,329 కొత్త యూనిట్ల నిర్మాణం ప్రారంభమైంది.   అంతకు ముందు త్రైమాసికంతో పోలిస్తే ఇది 173 శాతం, 2019 నాలుగో త్రైమాసికంతో పోలిస్తే 12 శాతం ఎక్కువ.  2020 సంవత్సరం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే మాత్రం కొత్త యూనిట్ల ప్రారంభం దాదాపు సగం తగ్గిపోయింది. 


అమ్మకాల్లోనూ జోష్‌

అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలూ ఊపందుకున్నాయి. ఈ కాలంలో హైదరాబాద్‌తో సహా దేశంలోని ప్రధాన నగరాల్లో 58,914 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంతకు ముందు త్రైమాసికంతో పోలిస్తే ఇది 68 శాతం ఎక్కువ. ఏడాది మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే మాత్రం 47 శాతం తగ్గి 1,82,639 యూనిట్లకు పడిపోయాయి.


ధరలు యథాతథం

గత ఏడాది మొత్తాన్ని పరగణనలోకి తీసుకుంటే దేశంలోని 8 ప్రధాన నగరాల్లో రియల్‌ ఎస్టేట్‌ ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. అతి పెద్ద మార్కెట్లయిన ముంబై, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి మార్పు లేదు. అహ్మదాబాద్‌, హైదరాబాద్‌ మార్కెట్లలో మాత్రం ధరల్లో 5 - 7ు పెరుగుదల కనిపించింది. 

Updated Date - 2021-01-12T09:26:24+05:30 IST