Abn logo
Sep 20 2021 @ 23:16PM

132కేవీ సబ్‌స్టేషన్‌లోని మరమ్మతు కేంద్రం పూర్తిగా దగ్ధం

గజ్వేల్‌లో కాలిన ట్రాన్స్‌ఫార్మర్‌ మరమ్మతు కేంద్రాన్ని పరిశీలిస్తున్న సీజీఎం బిక్షపతి

దాదాపు 90 ట్రాన్స్‌ఫార్మర్లు, మెటీరియల్‌ దగ్ధం

33కేవీ లైన్‌ తెగిపడడంతో ప్రమాదం

ఘటనా స్థలాన్ని పరిశీలించిన టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీజీఎం బిక్షపతి, ‘గడ’ ఎస్‌వో ముత్యంరెడ్డి


గజ్వేల్‌, సెప్టెంబరు 20: గజ్వేల్‌లోని 132కేవీ సబ్‌స్టేషన్‌లో ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతు కేంద్రం పూర్తిగా దగ్ధమైంది. ఆదివారం రాత్రి కురిసిన గాలివానకు 132కేవీ నుంచి 33కేవీ సబ్‌స్టేషన్‌కు వెళ్లే విద్యుత్‌వైరు తెగి ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతు కేంద్రంపై పడింది. దీంతో షార్ట్‌ సర్క్యూట్‌ ఏర్పడి మంటలు వ్యాపించాయి. గమనించిన చుట్టుపక్కల వారు ఫైర్‌ ఇంజన్‌కు ఫోన్‌చేయగా అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ మంటలు చల్లారలేదు. మరమ్మతు కేంద్రం పూర్తిగా దగ్ధమైంది. మొదట సబ్‌ స్టేషన్‌లో పైకి ఎగిసిన మంటలను చూసి సబ్‌స్టేషన్‌ కాలిపోయిందని అంతా భావించారు. కానీ మరమ్మతు కేంద్రంలో అగ్నిప్రమాదం జరగడం, ఆ సమయంలో సిబ్బంది ఎవరూ అక్కడ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఘటనా స్థలాన్ని అర్ధరాత్రి ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతా్‌పరెడ్డి పరిశీలించారు. విద్యుత్‌ సరఫరా జరిగేంత వరకు అక్కడే ఉండి అధికారులను సమన్వయం చేస్తూ పనులను చేయించి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరింపజేశారు. 


అగ్ని ప్రమాదంతో రూ.కోటి నష్టం

 సబ్‌స్టేషన్‌లో జరిగిన షార్ట్‌సర్క్యూట్‌తో మరమ్మతు కేంద్రంలో రూ. కోటి ఆస్తి నష్టం వాటిల్లినట్లు టీఎ్‌సఎస్పీడీసీఎల్‌ సీజీఎం బిక్షపతి తెలిపారు. సోమవారం 132కేవీ సబ్‌స్టేషన్‌ను ఆయన ఎస్‌ఈ శ్రీనాథ్‌, డీఈ శ్రీనివా్‌సచారి, లక్ష్మీనారాయణ, బి.శ్రీనివాస్‌, ఏపీఎస్పీఎం ఆనందరావు, ఏఈ జగదీశ్‌ ఆర్యలతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. వైరు తెగిపోవడం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని వివరించారు. అనంతరం గడ ఎస్‌వో ముత్యంరెడ్డి సబ్‌స్టేషన్‌ను పరిశీలించి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు.