నేతాజీ విగ్రహం పెట్టినంత మాత్రానికి బాధ్యత తీరిపోదు : మమత బెనర్జీ

ABN , First Publish Date - 2022-01-23T22:06:53+05:30 IST

న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాశ్ చంద్రబోస్ విగ్రహం

నేతాజీ విగ్రహం పెట్టినంత మాత్రానికి బాధ్యత తీరిపోదు : మమత బెనర్జీ

కోల్‌కతా : న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాశ్ చంద్రబోస్ విగ్రహం పెట్టినంత మాత్రానికి కేంద్ర ప్రభుత్వ బాధ్యత తీరిపోదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ అన్నారు. నేతాజీ 125వ జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ట్విటర్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు. 


తమ ఒత్తిడి మేరకే నేతాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారని మమత అన్నారు. విగ్రహాన్ని ఏర్పాటు చేసినంత మాత్రానికి కేంద్ర ప్రభుత్వ బాధ్యత తీరిపోదని, ఆయనను గౌరవించినట్లు కాదని చెప్పారు. ఆయన మరణించిన తేదీ ఇప్పటికీ తెలియదన్నారు. 


‘‘నేతాజీకి ఏం జరిగిందో మనకు ఇప్పటికీ తెలియదు. ఇప్పటికీ అది ఓ అంతుబట్టని రహస్యంగానే ఉంది. ఫైళ్ళను పరిశీలించడానికి అందుబాటులో ఉండేవిధంగా చేస్తామని ఈ ప్రభుత్వం చెప్పింది. నేతాజీపై ఫైళ్ళను డిజిటలైజ్ చేశామని, డీక్లాసిఫై చేశామని చెప్పింది’’ అని మమత అన్నారు. 


నేతాజీ సుభాశ్ చంద్రబోస్ పేరు మీద ఓ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. అదేవిధంగా ఇండియన్ నేషనల్ ఆర్మీ స్మారకార్థం ఓ కట్టడాన్ని నిర్మిస్తామన్నారు. 


గణతంత్ర దినోత్సవాల కవాతు కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నేతాజీపై రూపొందించిన శకటాన్ని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిందని మండిపడ్డారు. అదే శకటాన్ని కోల్‌కతాలో జరిగే గణతంత్ర దినోత్సవాల్లో ప్రదర్శిస్తామని చెప్పారు. గతంలో రవీంద్రనాథ్ ఠాగూర్‌పై రూపొందించిన శకటాన్ని కూడా కేంద్రం తిరస్కరించిందన్నారు. ఎందుకీ ఎలర్జీ అని ప్రశ్నించారు. నేతాజీ జయంతి రోజును జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 


Updated Date - 2022-01-23T22:06:53+05:30 IST