స్మృతిగా మిగిలిన చైతన్యచరిత్ర

ABN , First Publish Date - 2021-01-20T09:06:37+05:30 IST

చరిత్రను ముఖ్యంగా నిజాం వ్య‌తిరేక పోరాట చ‌రిత్ర‌ను అన్ని కోణాల నుంచి స్వానుభ‌వంతో విశ్లేషించి, వివ‌రించే స్వాతంత్య్ర యోధులు బూర్గుల న‌ర్సింగ‌రావు అదే చ‌రిత్రలో...

స్మృతిగా మిగిలిన చైతన్యచరిత్ర

చరిత్రను ముఖ్యంగా నిజాం వ్య‌తిరేక పోరాట చ‌రిత్ర‌ను అన్ని కోణాల నుంచి స్వానుభ‌వంతో విశ్లేషించి, వివ‌రించే స్వాతంత్య్ర యోధులు బూర్గుల న‌ర్సింగ‌రావు అదే చ‌రిత్రలో భాగ‌మైపోయారు. కురుక్షేత్రం మ‌ధ్య యుద్ధరేఖ గీసిన త‌ర్వాత అటు ప‌క్క తాత‌, గురువు, అన్న ఎవ‌రున్నా గురి చూసి గుండెల్లో బాణం కొట్టాల‌ని బోధించిన గీత‌కారుణ్ణి అనుస‌రించి హైద‌రాబాద్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి స్వ‌యంగా పెదనాన్న అయిన బూర్గుల రామ‌కృష్ణారావు మీద‌నే పర్జ‌న్య శంఖాన్ని పూరించారు న‌ర్సింగ‌రావు. ఫ‌లితంగా పెదనాన్న ప్ర‌భుత్వం జారీ చేసిన అరెస్ట్ వారెంట్‌తో 1949లో చంచ‌ల్‌గూడలో జైలుశిక్ష అనుభ‌వించారు.


పెదనాన్న రామకృష్ణారావు, తండ్రి వెంకటేశ్వరరావుతో పాటు కుటుంబసభ్యులంతా స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనడం వల్ల చిన్ననాడే ఆయనలో సామాజిక చింతన మొదలయింది. పైనున్న బ్రిటిష్ పాలకుల ఆదేశాలతో కళ్లెం లేని ఆర్థిక దోపిడీ, గ్రామాల్లో రజాకార్ల అరాచకాలు, నిజాం కోసం కేవలం పన్ను వసూలుదారులుగా మారిన ఫ్యూడల్ దొరల దోపిడీ మధ్య గ్రామీణ రైతాంగం నలిగిపోతున్నా, కాంగ్రెస్ పార్టీ శాంతిమంత్రం జపించడం నరసింగరావు లేతమనసుకు నచ్చలేదు. ఫలితంగా ఆయన సాయుధ రైతాంగ పోరా టానికి నాయకత్వం వహిస్తున్న కమ్యూనిస్టు రాజకీయాలకు ఆకర్షితుడైనారు. వివేకవర్ధని కాలేజీలో, నిజాం కాలేజీలో చదువుతుండగానే ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూని యన్ స్థాపించి, నిజాం అరాచకాలకు వ్యతిరేకంగా ఊరేగింపులు, సభలు నిర్వహించారు. కోఠీలో బ్రిటీష్ రాజ‌ప్ర‌తినిధి రెసిడెంట్ ఇంటికి సరిగ్గా ఎదురుగా హ‌స్మ‌త్ గంజ్‌లో బ్రిటీష్ స‌ర్కార్‌కు, నిజాం ప్ర‌భువుకు వ్య‌తిరేకంగా 1948లో పెద్ద స‌భ జ‌రుప‌గా పోలీసులు ముట్ట‌డించి రెండు గేట్లు మూసివేశారు. జ‌లియ‌న్‌ వాలా‌బాగ్ వ‌లె స‌భికుల‌పై కాల్పులు జ‌ర‌పాల‌ని పోలీసులు కుట్ర పన్నితే న‌ర్సింగ‌రావు చాక‌చ‌క్యంగా ఒక్కొక్క‌రినే స‌న్న‌టి గ‌ల్లీ నుంచి బ‌య‌ట‌కు పంపించారు.


బూర్గుల రామ‌కృష్ణారావు స‌న్నిహితుడైన ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ షోయ‌బుల్లాఖాన్ నిజాం అరాచ‌కాల‌ మీద త‌న ఇమ్రోజ్ (నేడు) ప‌త్రిక‌లో పుంఖానుపుంఖాలుగా వెలువ రించే వార్తా క‌థ‌నాలు చ‌దివి న‌ర్సింగ‌రావు ఆవేశ‌ప‌ డేవారు. ‘గ‌దోంకీ బిర్యానీ, దోబియోంకీ ప‌రేషానీ’ అనే శీర్షిక‌తో వార్త ప్ర‌చురించిన త‌ర్వాత ఆగ్ర‌హించిన ర‌జాకార్లు బ‌ర్కత్‌పురాలో షోయ‌బుల్లాఖాన్ మీద దాడి చేసి చేతులు న‌రికి హ‌త్య‌ చేయడానికి పొరుగునే ఉన్న న‌ర్సింగ‌రావు ప్ర‌త్య‌క్ష సాక్షి. సాయుధులైన శ‌త్రువుల‌ను సాయుధంగానే ఎదుర్కోవాల‌ని న‌మ్మి ఆయ‌న తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి హైద‌రాబాద్‌లో మ‌ద్ద‌తు కూడగ ‌ట్టారు. తెలుగు భా‌ష‌ను అణ‌గ‌దొక్కి అధికార భాష‌గా ఉర్దూను ప్రోత్స‌హించి ఉత్త‌రాది వారికే నిజాం స‌ర్కారు ఉద్యోగాలు క‌ట్ట‌బెట్టడంతో స్థానికుల‌కే ఉద్యో గాలంటూ ముల్కీ ఉద్య‌మం ఆరంభించారు. నిజాం త‌ర్వాత రామ‌కృష్ణారావు హయాంలో కూడా 1952లో ముల్కీ ఉద్య‌మానికి బూర్గుల నాయ‌క‌త్వం వ‌హించారు. విద్యార్థుల ఊరేగింపుపై ముస్లిం జంగ్ వంతెన వద్ద పోలీ సులు జరిపిన కాల్పుల్లో 13 మంది చ‌నిపోవ‌డంతో రామ కృష్ణారావు ప్ర‌భుత్వం సంక్షోభ ప‌రిస్థితి ఎదుర్కోవాల్సి వ‌చ్చింది.


క‌మ్యూనిస్టు పార్టీకి అనుబంధంగా ఉన్న అఖిల భార‌త విద్యార్థి స‌మాఖ్య 1955లో ల‌క్నోలో నిర్వహించిన సమావేశంలో తొలి అధ్య‌క్షుడిగా న‌ర్సింగ‌రావు ఎన్నిక‌య్యారు. ప్ర‌ముఖ వైద్యురాలు మంగూత‌ను 1957లో ఆయ‌న కులాంత‌ర వివాహం చేసుకున్నారు. ఆ త‌ర్వాత కొంతకాలం ఇంగ్లాండ్‌లో ఉన్న‌త విద్యను అభ్య‌సించి హైద‌రాబాద్‌కు తిరిగి వ‌చ్చి ప‌లు క‌ళాశాల‌ల్లో రాజ‌నీతి శాస్త్రం అధ్యాప‌కుడిగా ప‌ని చేశారు. ప‌లు ప్ర‌జా ఉద్య‌మాల్లో పాల్గొంటూనే ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోని త‌మ స్వగ్రామం బూర్గుల అభివృద్ధికి కృషి చేశారు. గ్రామంలో హైస్కూల్, ప్రాథ‌మిక విద్యాకేంద్రం, అంగ‌న్‌వాడీల స్థాప‌న కోసం వంద‌లాది ఎక‌రాల భూమిని దానం చేశారు. ఆయ‌న పోరాటా‌ల ఫ‌లితంగా బూర్గుల‌లో రైల్వేస్టేష‌న్ ఏర్పాటు అయింది. ఒక స్పిన్నింగ్ మిల్లు, చిన్న జౌళి మిల్లు ఏర్పాటయ్యాయి. అనేక స్వ‌చ్చంద సంస్థ‌లు గ్రామానికి వ‌చ్చి సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాయి.


విద్యార్థి ఉద్య‌మం నుంచి ఆయ‌న కార్మికోద్య‌మంలోకి దూకారు. అధ్యాప‌కుడిగా కొన‌సాగుతూనే కార్మికసంఘాల‌తో మ‌మేకమ‌య్యారు. ఏఐటీయుసీ నాయ‌కునిగా కోఠీ లోని శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయ ఆంధ్ర‌భాషా నిల‌యం నుంచి కార్మికుల ఊరేగింపుకు నాయ‌క‌త్వం వ‌హిస్తే ఐఎన్‌టీయుసీ నేత‌లు దాడి చేశారు. తీవ్రంగా గాయ‌ప‌డిన న‌ర్సింగ‌రావుకు ఆస్ప‌త్రిలో ఐఎన్‌టీయుసి నేత సంజీవ‌రెడ్డి క్ష‌మాప‌ణ‌లు చెప్పవ‌ల‌సి వ‌చ్చింది.


రామ‌కృష్ణారావు తర్వాత వ‌చ్చిన ఏ ముఖ్య‌మంత్రినీ న‌ర్సింగ‌రావు వ‌దిలిపెట్ట‌లేదు. తెలంగాణ తొలి ద‌శ ఉద్య‌మంపై 1969లో మేధావుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. తెలంగాణ ప‌ట్ట‌భ‌‌ద్రుల సంఘం స్థాపించారు. తెలంగాణ మ‌లిద‌శ ఉద్యమానికి 1994 నుంచి బాస‌ట‌గా నిలిచారు. ఆర్థిక స‌ర‌ళీక‌రణ‌ విధానాల‌తో ప్రైవేటీక‌ర‌ణ, ప్రపంచీక‌ర‌ణ వ‌ల్ల కొత్తూరు, ప‌ఠాన్‌చెరు, ఆజామాబాద్, కాటెదాన్, స‌నత్‌న‌గ‌ర్‌, ఉప్ప‌ల్, చెర్ల‌ప‌ల్లి పారిశ్రామిక‌ల వాటిక‌‌ల్లో ప‌రిశ్ర‌మ‌లు ఒక్కొక్క‌టిగా మూత‌బ‌డుతుంటే, గ్రామాల్లో వ్య‌వ‌సాయోత్ప‌త్తి నాశ‌నం అవుతుంటే, ప్ర‌తిఘ‌ట‌న‌గా ఆరం‌భమైన తెలంగాణ ఉద్య‌మానికి తాత్విక పునాది వేశారు. ఉద్య‌మాన్ని త‌న ఆట‌పాట‌ల‌తో ఉత్తేజ‌ప‌రుస్తున్న బెల్లి ల‌లిత‌ను స‌ర్కారు గూండాలు హ‌త్య‌చేసి 17 ముక్క‌లు చేసి పారేస్తే త‌ల్లడిల్లిన నర్సింగ‌రావు పురానాపూల్‌లో విప్ల‌వ‌క‌వి ఎంటీ ఖాన్ ఇంట ఉద్య‌మ‌కారుల‌ను పిలిచి స‌మావేశం ఏర్పాటు చేశారు. అక్క‌డినుంచే ప్రొఫెస‌ర్ కేశ‌వ‌రావు జాద‌వ్ బ‌య‌ల్దేరి భువ‌న‌గిరిలో దైర్యంగా స‌భ‌లు, ఊరేగింపులు నిర్వ‌హించారు. విప్ల‌వోద్య‌మాల మూలంగా ఎంటీఖాన్ మాటిమాటికి జైలు పాలై ఉద్యోగం పోగొట్టుకుంటే తాను సంపాద‌కుడిగా ఉన్న ఇంగ్లీష్ ప‌త్రిక ‘న్యూస్ టైం’లో సంపాద‌కీయాలు రాసే బాధ్య‌త‌ను అప్ప‌జెప్పారు. టీచర్‌ను పాత్రికేయుడిగా మార్చి, బ‌త‌క‌లేని బ‌డి పంతులును బ‌త‌క‌రాని పాత్రికేయునిగా మార్చాను అని ఖాన్ మీద నర్సింగ‌రావు జోకు వేసేవారు.


ఇంగ్లిష్, ఉర్దు భాష‌ల సొగ‌సు అవ‌గ‌తం చేసుకున్న న‌ర్సింగ‌రావు ఇల్లు సాహితీవేత్త‌లు, క‌ళాకారులు, క‌వులు, మేధావుల‌తో క‌ళ‌‌కళ‌లాడుతుండేది. మగ్దూం మొహియుద్దీన్, స‌త్య‌నారాయ‌ణ రెడ్డి, రాజ‌బ‌హ‌దూర్ గౌర్, న‌టి షబానా ఆజ్మీ తండ్రి, ప్ర‌ముఖ ఉర్దూక‌వి కైఫీ ఆజ్మీ ఆయ‌న భార్య‌, షౌక‌త్ ఆజ్మీ, జ‌వ్వాద్ ర‌జ్వీ, స‌రోజినీ నాయుడు కుమారుడు డాక్ట‌ర్ జ‌య‌సూర్య‌, ప్ర‌ముఖ స‌ర్జ‌న్ సి.రాజ‌గోపాల‌న్, డాక్ట‌ర్ స‌త్య‌పాల్ తులి, డాక్ట‌ర్ క‌న్నబీరన్, కాళోజి వంటి బుద్ధిజీవుల‌తో, ఉద్య‌మ‌కారుల‌తో నిరంత‌రం చ‌ర్చోప‌చర్చలు జ‌రిపేవారు. ఈ మ‌హామ‌హులు ఈ త‌రానికి తెలియ‌క‌పోవ‌చ్చు కానీ వీరి పోరాటాల వ‌ల్ల‌నే నేడు స‌మాజం ఈ మాత్ర‌మైనా కుంటుతున్న‌ది.


తెలంగాణ సాయుధ పోరాటం త‌ర్వాత పోరాట ల‌క్ష్యాలు నెర‌వేరాయా? అని త‌రుచూ వాదోప‌వాదాలు సాగేవి. ర‌జాకార్ వ్య‌తిరేకోద్య‌మం త‌ర్వాత 1948 సెప్టెంబ‌ర్ 17న జ‌రిగింది తెలంగాణ విలీన‌మా? విమోచ‌నా? విద్రోహ‌మా? అని ప్ర‌తిసారీ మీమాంస త‌లెత్తేది. ఒక్కొక్క పార్టీది ఒక్కో వైఖ‌‌రైతే, న‌ర్సింగ‌రావు మాత్రం మూడూ నిజ‌మేనని స‌మాధానం చెప్పేవారు. హైద‌రాబాద్ రాష్ట్రం భార‌త రిప‌బ్లిక్‌లో విలీనం వాస్త‌వమే క‌దా అనేవారు. వెట్టిచాకిరి నుంచి విముక్తి కూడా నిజ‌మే క‌దా! అని ముక్తాయించేవారు. ‘ఐతే పోరాట ల‌క్ష్యం నెర‌వేర‌లేదు, అమ‌రుల త్యాగఫ‌లం నిష్ప్ర‌యోజ‌నం అయింది. ఒక్క ర‌జాకార్‌కు కూడ శిక్ష ప‌డ‌లేదు. నిజాం చివ‌రి ప్ర‌ధాని లాయ‌క్ అలీ, కాశీం ర‌జ్వీ స‌గౌర‌వంగా పాకిస్థాన్ పారిపోయేటట్లు ప్ర‌భుత్వ‌మే సౌక‌ర్యం క‌ల్పించింది. బైరాన్‌ప‌ల్లిలో వంద మంది రైతుల‌ను కాల్చి చంపి వారి భార్య‌ల బ‌ట్టలు విడిపించి బ‌తుక‌మ్మ‌లు ఆడించిన ముష్క‌రుల‌కు శిక్ష‌లు ప‌డ్డాయా? ప‌క్క‌నే కూటిగ‌ల్లులో 40 మంది గ్రామీణుల‌ను కాల్చిచంపిన న‌ర‌హంత‌కులు గాంధీ టోపీలు ధ‌రించి స‌గౌర‌వంగా మ‌న మ‌ధ్య‌నే తిరుగాడుతుంటే మ‌న ర‌క్తం స‌ల‌స‌ల మ‌స‌ల‌దా? గుండ్రాంప‌ల్లిలో 200 మందిని చంపి బావిలో ప‌డేసిన దుర్మార్గుల‌ను ప‌ట్టుకోవ‌డానికి క‌నీసం నామ‌మాత్రంగానైనా ప్ర‌య‌త్నం జ‌రిగిందా? దున్నేవానికే భూమి నినాదంతో పోరాటం మొద‌లైతే రైతుకు, రైతుకూలీకి నిల‌వ నీడ కూడా లేకుండా పోయింది’ అని జైని మ‌ల్ల‌య్య గుప్త‌తో క‌లిసి ఆయ‌న వాపోయేవారు. తెలంగాణ ప‌ల్లెలు నిర్దూమ‌ధామం చేసిన వారికి అండ‌గా నిలిచిన నిజాంకు ప్ర‌భుత్వం రాజ్‌ప్ర‌ముఖ్‌గా సింహాసనం వేసి రాజ్‌భ‌వ‌న్‌లో 1956 వ‌ర‌కు విరాజితుల‌ను చేశారు. అంతేకాకుండా, ఆయనకు భారీ మొత్తంలో రాజభరణం కూడా అందజేసేవారు. నిజాం దురాగ‌తాల మీద పోరాటం చేసిన వారిని న‌మ్మించి బంధించి, జైళ్ల‌లో ఏళ్ల‌త‌ర‌బ‌డి పెట్టారు. న‌ల్లా న‌ర్సింహులు వంటి యోధుణ్ణి 1959 వ‌ర‌కు జైలులో బంధించ‌డం విద్రోహం కాదా అని ఆయ‌న త‌రుచూ ప్ర‌శ్నించేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ వారికి ఇదే గతి పునరా వృతమవుతుంది. ఏ ఆంధ్రుల పెత్తనానికి వ్యతిరేకంగా పోరాటం చేశారో, అదే ఆంధ్రులకు కాంట్రాక్టులు కట్టబెడతారు, ప్రభుత్వ భూములు అప్పచెబుతారు అని ఆనాడే నర్సింగరావు భవిష్యవాణి పలికారు. 


తెలంగాణ చ‌రిత్ర గురించి, పోరాట వివ‌రాల గురించి ఏ సందేహం క‌లిగినా ఆయ‌న తడుముకోకుండా వివ‌రాలు ఏక‌రువు పెట్టేవారు. ఎప్పుడూ త‌న వాద‌మే స‌రైన‌ద‌నే పంతానికి పోయేవారు కాదు. వ‌య‌సులో చిన్న వాళ్ల‌మైనా మా వాదం శ్రద్ధగా వినేవారు. ‘ఇక న‌న్ను నేను స‌వ‌రిం చుకుంటున్నాను’ అని స‌హృద‌యంతో చెప్పేవారు. త‌న స‌మ‌కాలికులు ఒక్కొక్క‌రు గ‌తించిపోతుంటే త‌ల్ల‌డిల్లే వారు. ఆయ‌న కూడా చ‌రిత్రలో లీనం కావ‌డంతో చరిత్ర గురించి సందేహాలు తీర్చేవారు క‌రువైనార‌నే బాధ ఎన్నటికీ తీర‌నిది.

పాశం యాదగిరి

(సీనియర్‌ జర్నలిస్టు)

Updated Date - 2021-01-20T09:06:37+05:30 IST