నిరంతర ప్రార్థనతోనే ఫలితం

ABN , First Publish Date - 2021-03-12T05:39:26+05:30 IST

ఒక నగరంలో ఒక న్యాయమూర్తి ఉండేవాడు. ఆయనకు దేవుడంటే భయం లేదు. మనుషులంటే గౌరవం లేదు. ఆ నగరంలో నివసిస్తున్న వితంతువు ఒకరు ఆయన దగ్గరకు తరచూ వస్తూ ఉండేది

నిరంతర ప్రార్థనతోనే ఫలితం

ఒక నగరంలో ఒక న్యాయమూర్తి ఉండేవాడు. ఆయనకు దేవుడంటే భయం లేదు. మనుషులంటే గౌరవం లేదు. ఆ నగరంలో నివసిస్తున్న వితంతువు ఒకరు ఆయన దగ్గరకు తరచూ వస్తూ ఉండేది. ‘‘ఒకరితో నాకు వివాదం ఉంది. ఆ వివాదాన్ని పరిష్కరించి, నాకు న్యాయం జరిగేలా చూడండి’’ అని కోరుతూ ఉండేది. 


ఇలా... ఆమె అతన్ని కలుస్తూనే ఉంది. తన మొర వినిపిస్తూనే ఉంది. ఆయన చాలాకాలం పాటు ఆమెను పట్టించుకోలేదు. కొన్నాళ్ళ తరువాత ఆ న్యాయమూర్తి ‘నాకు దేవుడంటే భయం లేదు. మనుషుల పట్ల గౌరవం లేదు. కానీ ఈ వితంతువు పదే పదే వచ్చి నన్ను విసిగిస్తోంది. నేను ఆమెకు న్యాయం జరిగేలా చూస్తాను. ఆ తరువాత ఇక ఆమె ఇలా తరచూ వచ్చి నన్ను విసిగించదు’ అని తనలో తాను అనుకున్నాడు. 


ఈ కథను ఏసుప్రభువు తన అనుయాయులకు చెప్పి, ‘‘అన్యాయపరుడైన ఆ ఆ న్యాయమూర్తిలో కలిగిన ఈ ఆలోచనను గమనించారా? అటువంటి వ్యక్తికే ఇలాంటి ఆలోచన కలిగినప్పుడు, తాను ఎంచుకున్న వాళ్ళకూ, రేయింబవళ్ళు తననే ప్రార్థిస్తున్న వాళ్ళకూ దేవుడు తప్పనిసరిగా న్యాయం చెయ్యడంటారా? నేను చెబుతున్నాను వినండి, ఆయన వారికి త్వరగా న్యాయం జరిగేలా చూస్తాడు’’ అని అన్నాడు.


లౌకికమైన ప్రపంచంలో చేసే ప్రతి పనికీ తక్షణమే ఫలితాలు లభించాలని మానవులు కోరుకుంటారు. దైవాన్ని ప్రార్థిస్తున్నప్పుడు సైతం వెంటనే ప్రతిఫలం దొరకాలని ఆశిస్తారు. కానీ ఎప్పుడు, ఎలాంటి ఫలితాన్ని ఇవ్వాలనే నిర్ణయం దైవానిదే. అయితే, ఎప్పుడో అందే ప్రతిఫలానికి ఎల్లప్పుడూ ఎందుకు ప్రార్థించాలనే సంశయగ్రస్తులు కూడా ఉంటారు. ఏ ప్రయత్నమైనా పట్టువిడవకుండా చేస్తేనే ఫలితం ఉంటుంది. ప్రార్థన కూడా అంతే! చిత్తశుద్ధితో దైవాన్ని నిరంతరం ప్రార్థించేవారికి తప్పనిసరిగా ఫలాలు లభిస్తాయి.

Updated Date - 2021-03-12T05:39:26+05:30 IST