Abn logo
Apr 7 2021 @ 02:40AM

రివర్స్‌ అద్భుతం

 • బిరబిరా గోదారి.. గలగలా మంజీర!
 • ప్రధాన నది నుంచి ఉప నదికి ప్రవాహం
 • మండుటెండల్లో మహత్తర జల దృశ్యం
 • కొండపోచమ్మ సాగర్‌ నుంచి హల్దీ వాగుకు
 • అక్కడి నుంచి మంజీర గుండా నిజాం సాగర్‌కు
 • వర్గల్‌ మండలం అవుసులపల్లిలోని సంగారెడ్డి 
 • కెనాల్‌లో నీటిని విడుదల చేసిన ముఖ్యమంత్రి
 • నీటిలో పువ్వులు చల్లి పట్టు వస్త్రాల సమర్పణ
 • పాములపర్తి వద్ద గజ్వేల్‌ కెనాల్‌కూ గేట్ల ఎత్తివేత
 • నాలుగు జిల్లాల్లో 16 వేల ఎకరాలకుపైగా లబ్ధి
 • నీటి విడుదల తర్వాత విక్టరీ సింబల్‌.. పరవశం’’’


సిద్దిపేట, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): ఎక్కడైనా ఉప నది నీళ్లు ప్రధాన నదిలో కలుస్తాయి! కానీ, కాళేశ్వరం ప్రాజెక్టుతో రివర్స్‌ ఇంజనీరింగ్‌కు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. గోదారమ్మకు కొత్త దిశ చూపించారు. ప్రధాన నది గోదావరి నీటిని మండే ఎండా కాలంలో ఉప నది మంజీరకు తీసుకొచ్చారు! ఎండిపోయే మంజీరకు కొత్త జీవం కల్పించారు. నదుల అనుసంధానానికి కొత్త అర్థం చెప్పారు. తద్వారా, కాళేశ్వరం ప్రాజెక్టులో మరో అపూర్వ జల దృశ్యం ఆవిష్కృతమైంది. కొండపోచమ్మ సాగర్‌ నుంచి గోదారమ్మ నిజాం సాగర్‌ దిశగా బిరబిరా కదిలి వెళ్లింది. ఇప్పటి వరకూ బీడు వారిన భూముల్లో ఇప్పుడు ఇక పంట సిరులు సాక్షాత్కరించనున్నాయు. ఈ మేరకు సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్‌ నుంచి కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్‌కు గోదావరి నీటిని సీఎం కేసీఆర్‌ విడుదల చేశారు. మంగళవారం ఉదయం 11.15 గంటలకు వర్గల్‌ మండలం అవుసులపల్లి వద్దనున్న సంగారెడ్డి కెనాల్‌ నుంచి హల్దీ వాగులోకి నీళ్లు వెళ్లేలా గేట్లెత్తారు.

నీటిని విడుదల చేసి సంప్రదాయబద్ధంగా పసుపు కుంకుమ, పట్టు వస్ర్తాలు, పూలు, పంచద్రవ్యాలు, నాణేలను నీటిలో వదిలారు. ఈ నీళ్లు వర్గల్‌ మండలం తునికిఖల్సా వద్ద హల్దీ వాగులోకి చేరతాయి. దీనిపై 32 చెక్‌డ్యాములు ఉన్నాయి. తద్వారా, మండలంలోని 633 ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం చేకూరుతుంది. అలాగే, మెదక్‌ జిల్లా తూప్రాన్‌, వెల్దుర్తి, కుల్చారం, మెదక్‌ మండలాల్లోని సుమారు 13,600 ఎకరాల ఆయకట్టుకు లబ్ధి కలుగుతుంది. ఇక, హల్దీ వాగు ద్వారా ఈ నీళ్లు 70 కిలోమీటర్లు ప్రయాణించి మెదక్‌ జిల్లా ర్యాలమడుగు వద్ద మంజీర నదిలో కలుస్తాయి. అనంతరం, అక్కడి నుంచి 26 కిలోమీటర్ల దూరంలోని నిజాం సాగర్‌ రిజర్వాయర్‌కు చేరతాయి. కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లోని ఆయకట్టు భూములకు ఈ నీళ్లు వరంగా మారనున్నాయి. 15 టీఎంసీల సామర్థ్యం కలిగిన కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్‌లో ప్రస్తుతం 8 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. సుమారు ఒక టీఎంసీ నీటిని నిజాంసాగర్‌కు తరలిస్తున్నారు.


గజ్వేల్‌ సస్యశ్యామలం

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలోని గజ్వేల్‌ మండలాన్ని సస్యశ్యామలం చేయడానికి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌ గోదావరి నీటిని వదిలారు. మర్కుక్‌ మండలం పాములపర్తి గ్రామం వద్ద సంగారెడ్డి కెనాల్‌కు అనుసంధానంగా నిర్మించిన గజ్వేల్‌ కెనాల్‌లోకి నీటిని విడుదల చేశారు. ఇక్కడ కూడా ప్రత్యేక పూజల్లో పాల్గొని, వేదమంత్రాల నడుమ గోదావరి నీళ్లకు సీఎం పుష్పాభిషేకం చేశారు. ఈ నీళ్లు గజ్వేల్‌ మండలంలోని 8 గ్రామాల్లో 19 చెరువులు, కుంటల్లోకి చేరనున్నాయి. సుమారు 2 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుంది.

స్పీకర్‌కు అస్వస్థత

నీటి విడుదల కార్యక్రమం సందర్భంగా అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌ నుంచి సీఎం కేసీఆర్‌ వెంట వచ్చిన ఆయన పాములపర్తిలో పూజలు జరుగుతుండగా అస్వస్థతకు లోనై కిందపడిపోయారు. అక్కడున్న నేతలు ఆయనను పట్టుకున్నారు. బాగా చెమటలు పట్టడంతో వెంటనే వైద్య సిబ్బందిని పిలిపించారు. వారు పరీక్షలు చేసి ఏ సమస్యా లేదని తేల్చారు. కాసేపు కుర్చీలో కూర్చొని ఆ తర్వాత తేరుకున్నారు. స్వయంగా తానే నడుచుకుంటూ వెళ్లి వాహనంలో కూర్చున్నారు. ఎండల కారణంగానే ఇలా జరిగి ఉండొచ్చని వైద్యులు చెప్పారు.


మంత్రి హరీశ్‌ పర్యవేక్షణతో ప్రశాంతం

ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, జిల్లా కలెక్టర్‌ వెంకట్రామి రెడ్డి పర్యవేక్షణతో సీఎం పర్యటన ప్రశాంతంగా సాగింది. సోమవారం మధ్యాహ్నమే ఈ కార్యక్రమం ఖరారు కావడంతో మంత్రి హరీశ్‌రావు హుటాహుటిన వర్గల్‌ మండలం అవుసులపల్లి, మర్కుక్‌ మండలం పాములపర్తి వద్ద పర్యవేక్షించారు. ప్రజలు, స్థానికులు ఎవరూ రావొద్దని తెలిపారు. సోమవారం అర్ధరాత్రి దాకా మంత్రి, కలెక్టర్‌ ఫోన్లతో సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీస్‌ యంత్రాంగం భారీ బందోబస్తు చేపట్టింది.


ఆనందపరవశుడైన కేసీఆర్‌

కార్యక్రమం ఆద్యంతం సీఎం కేసీఆర్‌ ఆనంద పరవశంతో కనిపించారు. వర్గల్‌ మండలం అవుసులపల్లి, మర్కుక్‌ మండలం పాములపర్తి గ్రామాలకు వచ్చినప్పుడు ఉత్సాహంగా ఉన్నారు. కొండపోచమ్మ సాగర్‌ నుంచి సంగారెడ్డి కెనాల్‌లో పారుతున్న నీటిని చూసి పరవశించిపోయారు. అక్కడి నుంచి హల్దీ వాగులోకి నీటిని విడుదల చేసి జై తెలంగాణ అంటూ ‘విక్టరీ’ సింబల్‌ చూపించారు. గోదావరి నీళ్లకు నమస్కరించారు. అక్కడికి వచ్చిన స్థానికులు, రైతులకు అభివాదం చేశారు. దాదాపు గంటపాటు పర్యటించిన కేసీఆర్‌ ఉన్నంత సమయం చెరగని చిరునవ్వుతో కనిపించారు. సిద్దిపేట, మెదక్‌, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు.


నది నుంచి ఉప నదికి..!

వానలు, వరదలకు మంజీర నదిలోకి చేరిన నీళ్లు.. నిజాం సాగర్‌ ద్వారా నిజామాబాద్‌ జిల్లాలోని కందకుర్తి వద్ద గోదావరి నదిలో కలుస్తాయి. అక్కడి నుంచి ఎస్సారెస్పీ రిజర్వాయర్‌కు చేరతాయి! కానీ, ఇప్పుడు మేడిగడ్డ నుంచి మధ్య మానేరుకు అక్కడి నుంచి కొండపోచమ్మ సాగర్‌కు వచ్చిన గోదావరి జలాలు.. సంగారెడ్డి కెనాల్‌ ద్వారా హల్దీ వాగుకు చేరతాయి. అనంతరం మంజీర నదికి జీవం పోస్తాయి. ఆ తర్వాత నిజాం సాగర్‌కు చేరతాయి. రాబోయే రోజుల్లో ఎస్సారెస్పీకి చేరే అవకాశం ఉంది!! 

Advertisement
Advertisement
Advertisement