వరి ఎండుతోంది

ABN , First Publish Date - 2022-01-23T05:45:20+05:30 IST

సాధారణంగా వరికి సాగు నీరు అందనప్పుడు పంట ఎండుతుంది. అది కూడా ఎక్కువగా ఎండ తీవ్రత ఉన్నప్పు డు మాత్రమే వరి పంట ఎండుతుంది.కానీ, ప్రస్తుతం వా తావరణ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.

వరి ఎండుతోంది

నాట్లు వేసి రోజులు గడుస్తున్నా ఎదగని పంట

చలి తీవ్రతే కారణమంటున్న వ్యవసాయాధికారులు

నాసిరకం విత్తనమే కారణమని రైతుల ఆవేదన


సూర్యాపేట సిటీ : సాధారణంగా వరికి సాగు నీరు అందనప్పుడు పంట ఎండుతుంది. అది కూడా ఎక్కువగా ఎండ తీవ్రత ఉన్నప్పు డు మాత్రమే వరి పంట ఎండుతుంది.కానీ, ప్రస్తుతం వా తావరణ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. చలితోపాటు మంచు కురుస్తుండగా, వరి పంటలు నిలువునా ఎండుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.


ప్రస్తుత యాసంగి సీజన్‌లో దొడ్డురకం సాగుచేస్తే ప్రభుత్వం కొనుగోలు చేయదనే కారణంతో ఉమ్మడి జిల్లా రైతులు అత్యధికంగా సన్న రకాల వరిని సాగుచేశారు. కాగా, సీజన్‌ ప్రారంభంలో ముందస్తుగా సాగు చేసిన వరి పొలాలు ప్రస్తుతం ఎండుతున్నాయి. నాటు వేసి నెల రోజులు గడిచినా పంట ఎదుగుదల లేకపోవడంతోపాటు పసుపు రంగులోకి మారి, కొద్దిరోజుల తర్వాత మాడిపోతోంది. ప్రధానంగా సన్న రకాలైన చింట్లు సాగుచేసిన పొలాల్లో ఈ సమస్య ఉంది. దీంతో ఏం చేయాలో పాలుపోక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చలిప్రభావం ఎక్కువగా ఉండటం వల్లే ఈ రకమైన సమస్య వస్తోందని వ్యవసాయాధికారులు చెబుతుండగా, నాసికరమైన విత్తనాల వల్లే పంట ఎదుగుదల లేక ఎండిపోతోందని రైతులు వాపోతున్నారు. 


ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా సన్నాల సాగు

యాసంగిలో వరి సాగు వద్దని ప్రభుత్వం ప్రచారం చేసినా రైతులు చాలా మంది దొడ్డు రకాలకు బదులు సన్నాలను సాగుచేశారు. నల్లగొం డ జిల్లాలో 4.80లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. జిల్లాలో నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ ఆయకట్టు ఉండటంతో అందులో వరి 4.60లక్షలు సాగవుతుందని లెక్కగట్టా రు. అయితే ఇప్పటి వరకు 3.50లక్షల ఎకరాల్లో వరి సాగైంది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఈ నెల 22వ తేదీ నాటికి వరి 43,200 ఎకరాల్లో సాగైంది. యాదాద్రి జిల్లాలో 4.50లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. అందులో వరి 2.50లక్షల ఎకరాల్లో సాగు కానుంది. కాగా, ఇప్పటి వరకు 65వేల ఎకరాల్లో వరి నాట్లు పూర్తయ్యాయి. పేట జిల్లాలో 43,200 ఎకరాల్లో వరి సాగుకాగా, సుమారు 20వేల ఎకరాలకుపైగా వరి పంట ఎండినట్టు సమాచారం. ఒక్కో గ్రామంలో 30 నుంచి 70 మంది రైతులు సన్నరకం ధాన్యం అందులో చింట్లను సాగుచేసి నష్టపోయారు. పంట చేతికి రాకుండానే సుమారు రూ.50వేల నుంచి రూ.1లక్ష వరకు రైతులు పెట్టుబడిని నష్టపోయారు.


పట్టించుకోని వ్యవసాయాధికారులు

యాసంగి సీజన్‌ ప్రారంభంలో ముందస్తుగా సన్నరకం ధాన్యాన్ని సాగు చేసిన పొలాల్లో పంట ఎదుగుదల లేదు. నాట్లు వేసి నెల గడుస్తున్నా పైరు పసుపు రంగులోకి మారింది. పసుపు రంగులోకి మారిన పంట కొద్దిరోజులకే ఎండిపోతోంది. పంటను రక్షించుకునేందుకు రైతు లు ఇప్పటికే రెండు నుంచి మూడుమార్లు వివిధ రకాల పురుగుమందుల ను పిచికారీ చేశారు. అయినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో పంటలను పరిశీలించి సలహాలు, సూచనలు చేయాల్సిన మండల వ్యవసాయాధికారులు పట్టించుకోవడం లేదు. కొంతమంది రైతులు ఈ విషయాన్ని పలుమార్లు వ్యవసాయాధికారుల దృష్టికి తీసుకెళ్లినా, స్పందన లేదని, కనీసం పొలాల వద్దకు కూడా రాలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. కౌలుకు తీసుకున్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.


నాసిరకం  విత్తనాలే కారణమా?

నాటు వేసిన కొద్దిరోజులకే పంట పసుపు రంగులోకి మారి ఎండిపోవడానికి నాసిరకం విత్తనాలే కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. ఓ ప్రముఖ కంపెనీకి చెందిన సన్నరకం విత్తనాలు చింట్లను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధిక మొత్తంలో రైతులు కొనుగోలు చేశా రు. విత్తన సంచికి రూ.1,000 నుంచి రూ.1,200 వరకు వెచ్చించి కొనుగోలుచేసి నారుపోశారు. ఆ తరువాత నాటువేశాక పొలం పచ్చగా మారకుండా, పసుపు రంగులోకి మా రడంతో రైతులు ఆందోళన చెందారు. దీంతో పంటను రక్షించుకునేందుకు పలు రకాల పురుగు మందు లు పిచికారీ చేశారు. అయినా ఎలాంటి ప్రభావం లేకపోగా, పంట మొత్తం మాడిపోయింది.


అధిక చలితోనే

చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్లే సీజన్‌ ప్రారంభంలో సాగు చేసిన వరి పంటలపై ఎక్కువ ప్రభావం పడిందని, దీంతో పంట ఎదుగుదల లేకుండా ఎండిపోతోందని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. చలిగాలులు ఎక్కువగా ఉండటం, మంచు కురుస్తుండటంతో సన్నరకాలు తట్టుకోలేవు. సాధారణంగా యాసంగిలో ఎక్కువగా దొడ్డు రకం ధాన్యానికి వాతావర ణం అనుకూలంగా ఉంటుంది. అయితే దొడ్డు రకాలను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడంలేదని, సన్నాలు సాగుచేయాలని ప్రభుత్వం సూచన మేరకు రైతులు చాలామంది వాటినే సాగు చేశారు. సన్నాలకు చలి వాతావరణాన్ని తట్టుకునే శక్తి తక్కువగా ఉంటుంది. సూర్యరశ్మి అధికంగా అవసరం. అయితే ప్రస్తుతం చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో సన్నరకం ధాన్యంలో సూక్ష్మపోషకాలు లోపిస్తున్నాయి.


సన్నరకాలతో నష్టపోయా : అంతయ్య, తాళ్లఖమ్మంపహడ్‌, సూర్యాపేట మండలం

యాసంగిలో సన్నరకం సాగు మంచిది కాదు అని తెలిసి కూడా, ప్రభుత్వ సూచన మేరకు 3ఎకరాలతోపాటు మరో 7ఎకరాలు కౌలు తీసుకోని సన్నరకం చింట్లను సాగు చేశా. నాట్లు వేసి నెల రోజులవుతున్నా పంట ఎదుగుదల లేదు. పూర్తిగా ఎండిపోయింది. సుమారు రూ.1.50లక్షల వరకు అప్పుచేసి పెట్టుబడి పెట్టా. పంట ఎండిపోవడంతో అప్పు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు.


చలి ఎక్కువగా ఉండటం వల్లే: డి.రామారావునాయక్‌, సూర్యాపేట జిల్లా వ్యవసాయాధికారి

సన్నరకం ధాన్యానికి సూర్యరశ్మి ఎక్కువ అవసరం. జిల్లాలో కొద్దిరోజుల నుంచి చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ సమయంలో సన్నరకం పంటలో ఎదుగుదల ఆలస్యంగా ఉంటుంది. చలి కారణంగా అక్కడక్కడ వరి ఎండిపోయింది. రైతులు వ్యవసాయాధికారుల దృష్టికి సమస్యను తీసుకురావాలి. వారి సూచనల మేరకు కంపోస్టు ఎరువులే వాడాలి. వేపనూనెను తక్కువ మోతాదులో పిచికారీ చేస్తే ఉపయోగం ఉంటుంది.

Updated Date - 2022-01-23T05:45:20+05:30 IST