Abn logo
Jun 3 2020 @ 00:00AM

రెక్కల గుర్రంపై...

భారత్‌లోనే మొట్టమొదటి మహిళా ‘మోటోవ్లాగర్‌’ ఆమె. ‘రైడర్‌ గర్ల్‌’గా యూట్యూబ్‌లో 3.7 లక్షల మంది అభిమానుల మనసు గెలిచిన ఘనత. బైక్‌ రైడింగ్‌ చేస్తానంటే ‘అమ్మాయివి... నీవల్ల ఏమౌతుంద’న్నారు. కానీ... అబ్బాయిలకే సాధ్యమనుకున్నది తను సాధించి చూపించింది. అభిరుచిని ఆస్వాదిస్తూ... దూరతీరాలను కలుపుకొంటూ... బైక్‌పై దేశాన్ని చుట్టేస్తున్న 26 ఏళ్ల ముంబై యువతి విశాఖా ఫల్సంగే మనోగతం ఇది.


‘‘అమ్మాయిలు అంతరిక్షంలోకి వెళుతున్నా... మనదేశంలో ఇంకా అక్కడక్కడ లింగ వివక్ష కనిపిస్తూనే ఉంది. నాలాంటి మధ్యతరగతి, సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన మహిళలకు నిజంగా ఇది శాపమనే చెప్పాలి. మాది ముంబై. అంతటి మహానగరంలో కూడా నాకు ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయంటే నమ్మలేం. ఊహ తెలిసినప్పటి నుంచి బైక్‌లన్నా, వాటిపై రైడింగన్నా తగని మోజు. క్రమంగా అది పిచ్చిగా మారింది. 


అబ్బాయిలతో పోటీ... 

నా రైడింగ్‌ సైకిల్‌తో మొదలైంది. చిన్నప్పుడు మా కాలనీలోని మగపిల్లలతో పోటీపడేదాన్ని. కొన్నాళ్లకు వాళ్ల చేతుల్లోకి బైక్‌లు వచ్చాయి. నాకూ బైక్‌ కొనిపెట్టమని నాన్నను అడిగాను. ‘వాళ్లేనా... నేనూ బండి  నడిపించగలను’ అనుకున్నా. ఆ చుట్టుపక్కల అంతమంది మగ స్నేహితులున్నా ఆడపిల్లను నేనొక్కదాన్నే! క్రికెట్‌, ఫుట్‌బాల్‌, బ్యాడ్మింటన్‌... వాళ్లతో కలిసి అన్ని ఆటలూ ఆడేసేదాన్ని. కానీ ఏ రోజూ చదువును నిర్లక్ష్యం చేయలేదు. టెన్త్‌ వరకు మా బ్యాచ్‌లో నేనే టాపర్‌ని. స్కూల్‌ ప్రెసిడెంట్‌ని కూడా! ఏ కార్యక్రమం జరిగినా నేనే యాంకర్ని. ఎన్ని ఉన్నా బైక్‌లపై నా మోజు తగ్గలేదు. 


కాలేజీలో షురూ... 

ట్వల్త్‌ స్టాండర్డ్‌ తరువాత ఎంబీయే (ఇంటర్నేషనల్‌ మార్కెటింగ్‌, ఫైనాన్స్‌)లో చేరాను. అసలే కాలేజీ... వయసు టీనేజీ. ఉత్సాహంతో ఉరకలేసే మనసు అది. అక్కడే నా అభిరుచి మరింత బలపడింది. అభిరుచి అనేకంటే... పిచ్చి అంటేనే బాగుంటుందేమో! అవును... ఎప్పుడూ బైక్‌ రైడింగ్‌ వైపే మనసు లాగేస్తుండేది. అప్పుడు నిర్ణయించుకున్నాను... నా మనసుకు నచ్చిన దారిలోనే నడవాలని. కాలేజీలో స్నేహితులతో కలిసి అప్పుడప్పుడూ బైక్‌ రైడింగ్‌ చేసేదాన్ని. చివరకు నా చేతులోకీ ఓ బైక్‌ వచ్చింది. సెకండ్‌హ్యాండ్‌ది. ఇక అప్పుడు అనిపించింది... నాకూ స్వేచ్ఛ లభించిందని! 


టెన్త్‌ నుంచే ఉద్యోగం... 

అన్నట్టు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. నా ఉద్యోగ ప్రస్థానం టెన్త్‌ అవ్వగానే మొదలైంది. అప్పుడు మా కుటుంబ పరిస్థితుల వల్ల ముంబయ్‌లోని ఓ బేకరీలో పార్ట్‌టైమ్‌ క్యాషియర్‌గా చేరాను. ఇష్టం లేదు. కానీ తప్పలేదు. నెలకు రూ.2,000 జీతం. సాయంత్రం 6 నుంచి రాత్రి 12 దాకా షిఫ్ట్‌. అయితే పదిహేను రోజుల్లోనే ఆ ఉద్యోగం వదిలేయాల్సివచ్చింది. ఓ మధ్యవయస్కుడు రోజూ నన్ను ఫాలో అయ్యేవాడు. దాంతో భయమేసి ఉద్యోగం మానేశాను. తరువాత షాపింగ్‌ మాల్స్‌లో కరపత్రాలు పంచిపెట్టా. ప్రమోషన్లు, పెళ్లిళ్లు, పత్రికా సమావేశాలు... చేయని ఈవెంట్‌ లేదు. ఆదాయం బానే వచ్చేది. కొంతకాలం పెద్ద కంపెనీల్లో పని చేశా. ఎన్నో ఉద్యోగాలు మారా. ఎక్కడా కుదురు లేదు. నాకు తెలిసి ఒకేచోట ఎక్కువ కాలం పని చేసిందంటే... నెల రోజులు! బహుళజాతి సంస్థల్లో ఉన్నప్పుడు వీకెండ్స్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి బైక్‌ రైడింగ్‌కు వెళ్లేదాన్ని. అదే సమయంలో కొన్ని షోస్‌ కూడా నిర్వహించాను. ఉద్యోగం నా ఒంటికి అస్సలు పడదని అర్థమైంది. ముఖ్యంగా ‘9 టు 5’ జాబ్‌, అదీ ఒకరి అదుపాజ్ఞల్లో ఉండడమంటే... ఏదో బందీగా ఉన్న అనుభూతి. అదే రైడింగ్‌ అయితే... నాకు నచ్చిన ప్రాంతానికి.. నాకు ఇష్టమొచ్చినప్పుడు వెళ్లొచ్చు. నాకు నేనే బాస్‌. బోర్‌ కొట్టే అవకాశమే లేదు. 


సవాళ్లు ఎన్నో... 

సోలో బైక్‌ రైడింగ్‌ని ఎంత ఆస్వాదిస్తామో అంతే స్థాయిలో సవాళ్లు, సమస్యలు కూడా ఎదురవుతాయి. ఒకసారి రాత్రిపూట ఓ గ్రామంలో ఆగాల్సివచ్చింది. అక్కడ బస చేయడానికి ఒకే హోటల్‌ ఉంది. కానీ ఒంటరి మహిళా పర్యాటకురాలినన్న కారణంతో వాళ్లు గది ఇవ్వలేదు. దానివల్ల వారికేం ఇబ్బందో నాకు అర్థం కాలేదు. నా పరిస్థితి అర్థం చేసుకుని, ఊళ్లోవాళ్లే ఆశ్రయం ఇచ్చారు. ఈ విషయాన్ని నా ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో పోస్ట్‌ చేశాను. క్షణాల్లో నా ఫాలోయర్స్‌ ఆ హోటల్‌పై వందల కొద్దీ నెగెటివ్‌ రివ్యూలు రాశారు. సామాజిక మాధ్యమాల శక్తి ఏమిటో నాకు అప్పుడు అర్థమైంది.  ఎక్కువమంది అమ్మాయిలు ఈ వైపు  రావాలి. నా ప్రయత్నం కూడా అదే.

అదే తొలి బైక్‌... 

అది 2015. అంటే నా కలల బైక్‌ నా ముందు ప్రత్యక్షమైన సందర్భం. ఉద్యోగం చేస్తూ దాచుకున్న డబ్బులతో పాటు, కాస్త లోన్‌ తీసుకుని ‘కేటీఎం డ్యూక్‌ 390’  కొనుక్కున్నా. ఖరీదు రూ.2.8 లక్షలు. ఆ క్షణం నా ఆనందం మాటల్లో చెప్పలేను. ఆ తరువాత ఉద్యోగానికి బైబై చెప్పేసి, బైక్‌ ఎక్కేశాను. ఇక అదే నా జీవితం అయిపోయింది. లద్దాఖ్‌, అలీబాగ్‌, మనాలీ, రోహ్‌తక్‌... ఇలా ఎన్నో ప్రాంతాలకు రైడింగ్‌ చేసుకొంటూ వెళ్లాను. వీటిల్లో నాకు ఇష్టమైన సోలో రైడింగ్‌లు కూడా ఉన్నాయి. కానీ, నా రైడింగ్‌ ప్రస్థానం ప్రారంభానికి ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి. మా బంధువులు, సన్నిహితుల్లో నన్ను ఎవరూ ప్రోత్సహించలేదు. బైకర్స్‌ క్లబ్‌లకు వెళితే... ‘ఆడపిల్లవి... నీవల్ల ఏమవుతుంది’ అంటూ చిన్నబుచ్చారు. సభ్యత్వం కోసం ఎప్పుడు వెళ్లినా... ‘ఇప్పుడు కాదు... మళ్లీ రా’ అంటూ తిప్పించుకున్నారు. అమ్మాయిగా పుడితే ఇన్ని ఇబ్బందులా! బైక్‌ రైడింగ్‌ అంటే అదేదో తమవల్లే అవుతుందనేది చాలామంది అబ్బాయిల అభిప్రాయం. మాకేం తక్కువ! నేను పట్టు వదల్లేదు. చివరకు అనుకున్నది సాధించాను. 


ఆలోచన... ఆచరణ... 

తరచూ బైక్‌ రైడింగ్‌ చేస్తున్నప్పుడు నాకు ఓ ఆలోచన వచ్చింది... నా అనుభవాలు అందరితో పంచుకొంటే ఎలా ఉంటుందని! అదే ‘మోటోవ్లాగర్‌’ కావడానికి బీజం వేసింది. భారత్‌లో పురుష ‘మోటోవ్లాగర్‌’లు అయితే ఉన్నారు కానీ మహిళలు లేరు. నేను పూర్తి స్థాయిలో ‘వ్లాగింగ్‌’ చేయాలనుకున్నా. ‘మోటోవ్లాగింగ్‌’ అంటే రైడింగ్‌ చేస్తూ, జర్నీని వీడియో తీస్తూ, ఆయా విశేషాలను పంచుకోవడం. హెల్మెట్‌లో కెమెరా పెట్టుకొని వీడియోలు తీయడం మొదలుపెట్టాను. వాటిని నా యూట్యూబ్‌ ఛానల్‌ ‘రైడ్‌ గర్ల్‌ విశాఖ’లో పోస్ట్‌ చేస్తున్నాను. 2017లో ప్రారంభించిన ఈ ఛానల్‌కు ఇప్పుడు 3.7 లక్షల మంది సబ్‌స్ర్కైబర్స్‌ ఉన్నారు. అలా దేశంలో మొట్టమొదటి మహిళా ‘మోటోవ్లాగర్‌’గా నిలిచాను. 


రికార్డులు... సవాళ్లు...  

ఈ రైడింగ్‌ అభిరుచి వల్ల ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో రెండుసార్లు నా పేరు నమోదైంది. బైక్‌పై అండమాన్‌ అండ్‌ నికోబార్‌ వెళ్లిన తొలి మహిళగా ఒకసారి, భారత్‌లో మొట్టమొదటి మహిళా ‘మోటోవ్లాగర్‌’గా మరొకసారి రికార్డులు దక్కాయి.

Advertisement
Advertisement
Advertisement