Abn logo
Jan 16 2021 @ 03:27AM

నిరసన మహిళారైతుల హక్కు

ఢిల్లీ సరిహద్దులలో రైతులు కొనసాగిస్తున్న ఉద్యమానికి సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాల విచారణ సందర్భంగా ‘స్త్రీలు, వృద్ధులు ఈ నిరసనలో ఉండనవసరం లేదు, వాళ్ళను ఇళ్లకు వెళ్ళమని చెప్పండి’ అని ప్రధాన న్యాయమూర్తి రైతుల తరఫున వాదిస్తున్న న్యాయవాదులతో అన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో పితృస్వామిక ఆలోచనావిధానం ఎంతగా పాతుకు పోయిందో ఈ వ్యాఖ్యలు నిరూపిస్తాయి. ఇది, దేశపౌరులుగా నిరసన తెలపడానికి మహిళలకు ఉన్న ప్రాథమిక హక్కును కాలరాయడమే కాదు, ఈ ఉద్యమంలో మహిళా రైతులుగా నిరసన తెలిపే హక్కు కూడా వారికి లేదని చెప్పటమే అవుతుంది. వ్యవసాయరంగానికి మహిళా రైతులు మహిళా వ్యవసాయ కూలీలు చేస్తున్న దోహదం పట్ల సుప్రీంకోర్టుకు ఏమాత్రం అవహగాన లేదనే వాస్తవాన్ని ఈ వ్యాఖ్యలు బయటపెడుతున్నాయి. ప్రధానన్యాయమూర్తి వ్యాఖ్యలు ‘మగవాళ్ళు ఉద్యమాలు చేస్తారు, మహిళలు ఇళ్లకు వెళ్ళండి’ అనే ధోరణిని ప్రతిఫలిస్తున్నాయి.


యాభై రోజులకు పైగా ఢిల్లీ సరిహద్దులలోను, దేశవ్యాప్తంగాను సాగుతున్న రైతాంగ ఉద్యమంలో పురుషులే కాదు పెద్ద సంఖ్యలో మహిళారైతులు, వ్యవసాయకూలీలు కూడా పాల్గొంటున్నారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాలతో పాటు ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర నుంచి కూడా మహిళలు, పురుషులు, వృద్దులు ప్రతిరోజు ఢిల్లీ సరిహద్దులకు నిరంతరం ప్రవాహంలాగా వెళుతున్నారు. దేశ చరిత్రలో మొట్టమొదటిసారి అన్ని సెక్షన్ల రైతులు సాగుదారులు, కౌలుదారులు, మహిళారైతులు, ఆదివాసీ రైతులు, వ్యవసాయకూలీలు– వ్యవసాయరంగాన్ని కార్పొరేట్ కబంధ హస్తాలకు ధారాదత్తం చేయవద్దని ముక్త కంఠంతో నినదిస్తున్నారు. మూడు వ్యవసాయచట్టాలు తమకు ఏ విధంగా హాని కలిగిస్తాయో మహిళా రైతులు అర్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే సంక్షోభంలో కూరుకుపోయిన తాము మరింతగా నష్టపోకుండా ఉండాలంటే కొత్త సాగుచట్టాలు రద్దయ్యే వరకు పోరాడటం ఒక్కటే మార్గమని నమ్ముతున్నారు. 


ఉద్యమంలో మహిళా రైతుల భాగస్వామ్యాన్ని మొదట్లో మీడియా పట్టించుకోకపోయినప్పటికీ వారి సంఖ్య గణనీయంగా ఉండడంతో వారి గురించిన కథనాలు, ఇంటర్వ్యూలు ఇవ్వక తప్పలేదు. ఉద్యమంలో ఎందుకు పాల్గొంటున్నారో మహిళలు చాలా స్పష్టంగా చెబుతున్నారు. వాళ్లు ఢిల్లీ సరిహద్దులలో తక్కువసంఖ్యలోనే ఉన్నప్పటికీ పంజాబ్, హర్యానాలలో ప్రతి గ్రామంలో, ప్రతి పొలంలో వారి నిరసన సాగుతూనే ఉంది. చాలా గ్రామాలలో ఇంటిలోని మగవాళ్ళు ఢిల్లీ సరిహద్దులలో ఆందోళన చేస్తుంటే మహిళలు ఇళ్లు, పొలాలు చూసుకుంటున్నారు. భూమిని దున్ని నాట్లు వేస్తున్నారు. ఢిల్లీ సరిహద్దులలో కూర్చున్న ఒకొక్క పురుషుడి కుటుంబం నుంచి కనీసం ఇద్దరు మహిళలు వారి సొంత ఊళ్లలో ఆ ఉద్యమాన్ని రకరకాల రూపాలలో కొనసాగిస్తున్నారు. 


కొత్త సాగుచట్టాలు మొత్తంగా రైతుల ప్రయోజనాలకు హాని కలిగించటమే కాదు, వ్యవసాయరంగంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న చిన్న సన్నకారు రైతులు,  భూమిలేని వ్యవసాయకూలీలలో అత్యధికులుగా ఉన్న మహిళారైతులపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఇప్పటికే రైతులుగా గుర్తింపు లేక, భూమి, నీరు, అడవులు వంటి వనరులపై సమాన హక్కులు లేక, సాగుకు అవసరమైన రుణాలు, సబ్సిడీలు, బడ్జెట్‌లు మార్కెట్ సౌకర్యాలు వంటి మద్దతు వ్యవస్థలు అందుబాటులో లేక ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటున్న మహిళారైతులకు ఈ చట్టాలు మరింత నష్టాన్ని కలిగిస్తాయి. సాగుదారులుగా మహిళారైతులు నష్టపోవటంతో పాటు మార్కెట్ ధరల అస్థిరత్వం కారణంగా వ్యవ సాయ కూలీలలో అత్యధికులుగా ఉన్న మహిళల వేతనాలపై కూడా పరోక్ష ప్రభావం పడుతుంది.  


మహిళారైతులు ప్రస్తుతం తమ ఉత్పత్తులను మార్కెట్‌యార్డుల బయట ఎక్కువగా చిన్న వ్యాపారస్థులకు అమ్ముకుంటున్నారు. మార్కెట్ యార్డులు, కనీస మద్దతు ధర ఉన్నప్పుడు, మార్కెట్ బయట కొనుగోలు చేసే చిన్న వ్యాపారస్థులకు కూడా కనీస మద్దతు ధర ఒక కొలమానంగా ఉంటుంది. మార్కెట్‌యార్డులు లేకుండా వ్యాపారస్థులే ధరలు నిర్ణయించే పరిస్థితి ఏర్పడి మహిళా రైతులు మరింత నష్టపోతారు. దేశవ్యాప్తంగా మహిళారైతులు ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పడుతున్నారు. వారు ఇప్పటికే ప్రభుత్వం నుంచి తగినంత సహాయం అందక తమ ఉత్పత్తులను మార్కెట్ చేసుకోవటంలో అనేక ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఈ కొత్త చట్టాల అమలుతో వారు పెద్ద కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడవలసి ఉంటుంది. రైతులకు కంపెనీలకు మధ్య తలెత్తే వివాదాల పరిష్కారాన్ని కొత్త చట్టం సివిల్ కోర్టుల పరిధి నుంచి తీసివేసి ప్రభుత్వ అధికారులకు కట్టబెడుతున్నది. పేద రైతులు వివాదాల పరిష్కారానికి అధికారుల చుట్టు తిరగటం తలకు మించిన భారమవుతుంది. అత్యధిక శాతం రైతులు, ప్రత్యేకించి మహిళా రైతులు అక్షరాస్యత లేనివారు, వాళ్ళకి ఒప్పందాలను అర్ధం చేసుకునే సామర్ధ్యం ఉండదు. నిత్యావసర వస్తువుల సవరణ చట్టం వల్ల ఆహారధాన్యాల ధరలు పెరిగిపోయి వినియోగదారులకు నష్టం కలుగుతుంది. ఇది పేద కుటుంబాలకు చౌక ధరలకు ఆహారధాన్యాలను అందించే ప్రభుత్వ పంపిణి వ్యవస్థకు గొడ్డలిపెట్టు అవుతుంది. 


జనవరి 18వ తేదీని ‘మహిళా కిసాన్ దివస్’, అంటే మహిళా రైతుల నిరసన దినోత్సవంగా జరపాలని ఢిల్లీలో ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా (400కు పైగా రైతు సంఘాలు, సంస్థల ఐక్య వేదిక) పిలుపు నిచ్చింది. ఈ పిలుపు వ్యవసాయరంగంలో మహిళల పాత్రను గుర్తించి వారి గొంతుకను వినిపించడానికి ఉద్దేశించింది. ఈ రంగంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తు న్నప్పటికీ రైతులు అనే గుర్తింపు లేక మహిళలు ప్రభుత్వానికీ, వ్యవసాయ విధానాలకూ దూరంగానే ఉండిపోతున్నారు. ఇదే ధోరణి సమాజంలోనూ, మీడియాలోను కూడా ప్రతిఫలిస్తున్నది. మహిళలు ఇంటిలో, కుటుంబ భూమిలో చేస్తున్న వేతనాలు లేని పనిని అధికారిక గణాంకాలు ‘శ్రమ’గా గుర్తించటంలేదు. ఈ రోజున దేశ వ్యవసాయ రంగంలో మహిళలు పేరు లేని ముఖాలుగా మారిపోయారు. 


ఈ నేపథ్యంలో ‘మహిళలు ఉద్యమంలో పాల్గొనాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఇళ్లకు వెళ్ళిపోవాలి’ అని చెప్పే హక్కు, అధికారం సుప్రీంకోర్టుకు లేదు. మహిళల రక్షణ కోసమే ఈ వ్యాఖ్యలు చేశామని ప్రధాన న్యాయమూర్తి తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేసినప్పటికీ, వారి సమస్యలను పరిష్కరించటానికి ఎటు వంటి ప్రయత్నం చేయకుండా రక్షణ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంటుంది. నిరసన తెలిపే హక్కు మహిళలకు పౌరులుగా రాజ్యాంగం కల్పించింది, రైతులుగా ఆ హక్కును వారే సాధించుకున్నారు, దీనిని కాదనే అధికారం సుప్రీంకోర్టుకు కూడా లేదు. మహిళా రైతుల పోరాటం కొత్త సాగుచట్టాలకు వ్యతిరేకంగా, కనీస మద్దతు ధరల చట్టబద్ధత కోసమే కాకుండా మరింత ముందుకెళ్లి తాము రైతులుగా గుర్తింపు పొందే వరకు, వనరులపై హక్కులు సాధించే వరకు కొనసాగుతుంది. 

ఎస్.ఆశాలత

మహిళా రైతుల హక్కుల వేదిక 

Advertisement
Advertisement
Advertisement