ప్రశ్నించే హక్కును హరిస్తున్నారు

ABN , First Publish Date - 2022-01-28T04:42:01+05:30 IST

ప్రశ్నించే హక్కును హరించాలనుకోవడం తగదని, పోలీసులు కేసుల్లో అసలు దోషులను తప్పిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి పేర్కొన్నారు.

ప్రశ్నించే హక్కును హరిస్తున్నారు
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి

కేసుల్లో అసలు దోషులను పోలీసులు తప్పిస్తున్నారు :  వరద రాజులరెడ్డి 

ప్రొద్దుటూరు (అర్బన్‌), జనవరి 27: ప్రశ్నించే హక్కును హరించాలనుకోవడం తగదని, పోలీసులు కేసుల్లో అసలు దోషులను తప్పిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక నెహ్రూ రోడ్డులోని ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ బీసీ నేత నందం సుబ్బయ్య హత్యను ఎవరు చేశారనేది జిల్లా ప్రజలందరికీ తెలుసన్నారు. 150 మంది ప్రభుత్వ సిబ్బంది, అధికారులు చూస్తుండగా చేసిన హత్యలో అసలు దోషులను పట్టుకోలేదని ఆరోపిస్తే నాకు నోటీసులు ఇస్తారా అన్నారు. నందం సుబ్బయ్య కేసులో ఆయన భార్య అపరాజిత కూడా పోలీసుల విచారణపై ఆరోపణలు చేసి బీసీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారన్నారు. ఈ కేసులో హైకోర్టు రిటైర్డ్‌ జడ్జితో విచారణ జరిపిస్తే సాక్ష్యం చెప్పటానికి బాధితులు ముందుకు వస్తారన్నారు. పోలీసులు పక్షపాత రహితంగా, నీతివంతంగా పనిచేయాలని తాను కోరడం నేరమా అని ప్రశ్నించారు. రాజుపాళెం మండలం చిన్నశెట్టిపల్లె హరిజనవాడ వద్ద పదిమంది దాడి చేస్తే ఏడుగురిపై కేసులు పెట్టి కేవలం నలుగురిని అరెస్ట్‌ చేసి మిగతా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేయలేదన్నారు. వెంగళాయిపల్లెలో తనీష్‌రెడ్డి అనే బాలుడి హత్య కేసులో తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా అసలు దోషులు ఇద్దరిని కేసునుంచి తప్పించారన్నారు. పోలీసులు లంచాలు తీసుకుని నిందితులను కేసుల నుంచి తప్పిస్తున్నారని బాధితులు ఆరోపిస్తే దానిని సరిదిద్దాల్సిన బాధ్యత జిల్లా పోలీసు అధికారిగా ఎస్పీదే అన్నారు. సీనియర్‌ మాజీ ప్రజాప్రతినిధులుగా ప్రశ్నించే తమ హక్కులను హరించాలనుకుంటేసుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ను కలిసి ఫిర్యాదు చేస్తానన్నారు. ఈ సమావేశంలో చిన్నశెట్టిపల్లె బాధితుడు ఉమామహేశ్వరరెడ్డి, వెంగళాయిపల్లె బాధితుడు సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-28T04:42:01+05:30 IST