వ్యాక్సిన్‌ తీసుకోనివారికే ప్రమాదమెక్కువ

ABN , First Publish Date - 2021-10-21T09:42:23+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకునే విషయంలో చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటున్నారని ప్రజారోగ్య సంచాలకుడు (డీపీహెచ్‌) డాక్టర్‌ గడల శ్రీనివాసరావు తప్పుబట్టారు.

వ్యాక్సిన్‌ తీసుకోనివారికే ప్రమాదమెక్కువ

  • వైరస్‌ సోకుతున్న వారిలో 60% టీకా వేసుకోనివారే..
  • రెండు డోసులు పూర్తయిన వారిలో 5-10% మందికే ఇబ్బంది
  • రాష్ట్రంలో ఇంకా 50 లక్షల డోసుల వ్యాక్సిన్‌ నిల్వ
  • పిల్లలకు 2,3 వారాల్లో వ్యాక్సినేషన్‌
  • కోటి మంది పిల్లలకు జైడస్‌ వ్యాక్సిన్‌: డీపీహెచ్‌ శ్రీనివాసరావు


హైదరాబాద్‌, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకునే విషయంలో చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటున్నారని ప్రజారోగ్య సంచాలకుడు (డీపీహెచ్‌) డాక్టర్‌ గడల శ్రీనివాసరావు తప్పుబట్టారు. వ్యాక్సిన్‌ వేసుకోని వారికే వైరస్‌ సోకే ప్రమాదం ఎక్కువగా ఉందన్నారు. తాజాగా నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల్లో.. ఒక్క డోసు కూడా వ్యాక్సిన్‌ను తీసుకోనివారే ఎక్కువ శాతం మంది ఉన్నారని తెలిపారు. బుధవారం కోఠిలోని తన కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఇప్పటికే రష్యా, యూకేలలో కేసులు, మరణాలు పెరుగుతున్నాయని, అందుకే ప్రజ లు తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు 69 లక్షల మంది ఇంకా ఒక్క డోసు కూడా టీకా వేసుకోలేదని, వీరంతా వెంటనే వేసుకోవాలన్నారు. మొదటి డోసు వేసుకున్నవారు రెండో డోసు వేసుకునే విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దని, తప్పకుండా రెండో డోసును వేసుకోవాలని సూచించారు. రెండు డోసుల వ్యాక్సిన్‌ వేసుకున్న వారికి వైరస్‌ సోకే ప్రమాదం చాలా తక్కువేనన్నారు. వైరస్‌ సోకుతున్న వారిలో 60ు మంది వ్యాక్సిన్‌ తీసుకోనివారే ఉంటున్నారని తెలిపారు. మొదటి డోసు తీసుకున్నవారిలో 30ు మందికి కరోనా సోకే అవకాశాలున్నాయని, ఇలాంటివారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రెండు డోసులు పూర్తయినవారిలో 5-10ు మందికి మాత్రమే కొవిడ్‌ సోకే అవకాశాలున్నాయన్నారు.


ఒకటి రెండు రోజుల్లో మూడు కోట్ల డోసులు పూర్తి..

రాష్ట్రంలో ఒకటి రెండు రోజుల్లో మూడు కోట్ల డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తి కానుందని డీపీహెచ్‌ తెలిపారు. ఇప్పటివరకు 75ు మందికి తొలి డోసు, 39ు మందికి రెండో డోసు టీకాలు వేయడం పూర్తయిందన్నారు. ఇంకా 37ు మంది ప్రజలకు రెండో డోసు వేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 50 లక్షల డోసుల వ్యాక్సిన్‌ నిల్వ ఉందని వెల్లడించారు. ఇప్పటికైతే రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందని, పాజిటివ్‌ కేసులు 0.4ు మాత్రమే ఉన్నాయని తెలిపారు. వ్యాక్సిన్‌ వేసుకుంటే కరోనా నుంచి 99ు వరకు రక్షణ ఉంటుందని చెప్పారు. గడువు ముగిసినా ఇప్పటివరకు రెండో డోసు తీసుకోనివారు రాష్ట్రంలో 36.35 లక్షల మంది ఉన్నారని వివరించారు. రాష్ట్రంలో ఇక చిన్న పిల్లలకు కూడా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. దీనిని వచ్చే రెండు మూడు వారాల్లో ప్రారంభిస్తామన్నారు. 2 నుంచి 18 ఏళ్ల వయసు వారికి వేసే జైడస్‌ వ్యాక్సిన్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చెప్పారు. త్వరలో భారత్‌ బయోటెక్‌ వారి కొవాగ్జిన్‌కు సైతం అనుమతులు వచ్చే అవకాశం ఉందన్నారు. కోటి మంది పిల్లలకు వ్యాక్సిన్‌ వేయాల్సి ఉంటుందని వివరించారు. బూస్టర్‌ డోసుకు సంబంధించి భారత్‌లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, భవిష్యత్తులో బూస్టర్‌ డోసును వేసే అవకాశం ఉండొచ్చని ఆయన తెలిపారు.


అందుకే మాస్క్‌ ధరించలేదు..

విలేకరుల సమావేశంలో మాస్క్‌ ధరించకపోవడంపై డీపీహెచ్‌ను ప్రశ్నించగా... ప్రజల్లో చర్చ జరగాలనే ఉద్దేశంతోనే ధరించలేదని తెలిపారు. కొవిడ్‌ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న సమయంలో అందరూ మాస్కులు ధరించారని, ఇప్పుడు 20 శాతం మంది కూడా పెట్టుకోవడం లేదని అన్నారు. మాస్క్‌ ధరించకపోతే కరోనాను నియంత్రించడం కష్టమని చెప్పారు. ఈ ప్రమాదం గురించి ప్రజలకు తెలియజేసేందుకే ఇలా చేశానన్నారు.

Updated Date - 2021-10-21T09:42:23+05:30 IST