నదీ ఒక కాటికాపరి

ABN , First Publish Date - 2021-05-24T09:47:38+05:30 IST

ఈ వేళకు సూదుల్ని గుచ్చి నిద్రలేపుతాను ఒంటరి భూగోళాన్ని గీసుకొని జీవిస్తున్న మనుషులకు....

నదీ ఒక కాటికాపరి

ఈ వేళకు సూదుల్ని గుచ్చి

నిద్రలేపుతాను

ఒంటరి భూగోళాన్ని గీసుకొని

జీవిస్తున్న మనుషులకు

ఒక కొత్తకాలాన్ని బహుకరిస్తాను


చేతుల చలనం చచ్చుబడి

ఎండిపోయిన మల్లెచెట్టయిన చోట

ఇంత ధైర్యంనింపిన సేంద్రీయ ఎరువుల్ని వెదజల్లుతాను


తడి అంటించుకోని తనతనం నుండి

కన్నీళ్లనైన భద్రపరుస్తాను రాబోయే తరాలకోసం

చకోర పక్షి చూపులను వెన్నెలకోసం

తీసిపెడతాను.


మాట పోల్చుకోని జాడలల్ల

కళ్ళకు బతుకు భాషను అతికిస్తాను

గావుపట్టి ఏడుస్తున్న శ్వాసకు

తిప్పతీగనై అల్లుకుపోతాను


ఋతువులు కొన్నిసార్లు రక్తంలో

మునిగితేలే బుడుబుంగలవుతాయి

మనమూ వాటివెనకే ఈదాలి

కాళ్లకు శవాల్ని మోసుకుపోతున్న

చేపపొలుసులు తగిలి

మళ్లీ మనుషుల్లా మారిపోతాము


నదులు ప్రవహించే స్మశానాలవుతున్నప్పుడు

సింహాసనం సింగారించుకుంటున్నది

దేశం నీడ పాడెలా మారుతుంటే

విస్టా వెలుతురులో 

      రాజభవనం మెరుగులు దిద్దుకుంటున్నది


అలల సాక్షిగా కన్నీళ్ళ మీదైనా నిర్జీవదేహాన్ని

మోయాల్సింది మనమే


బతుకు నిట్టాడు నమ్మకం,

నటన కాదు

వేముగంటి మురళి

96765 98465

Updated Date - 2021-05-24T09:47:38+05:30 IST