Abn logo
Nov 16 2020 @ 01:19AM

నన్ను నదిని చేసిన నది

Kaakateeya

నీలాటి రేవులో నన్నొక రాతిబండమీద కూర్చోబెట్టి

స్నానం చేయించేదట మా అమ్మ

ఓడరేవులో నా లేత పొట్టను తన రెండుచేతుల మధ్య వొడుపుగా పట్టుకుని

నీటివొంటిమీద తేలించి ఈత నేర్పేడు మా బావు

ఎండాకాలం మూడు సందెలలోనూ ఆడుకునేవాళ్ళం ఏరూ.. నేనూ

చలికాలం నడిమింటి సూర్యుడితో కలిసి రమ్మనేది ఏరు

వానాకాలం మాత్రం తనే మాయింటికొచ్చి నిలువెల్లా అల్లుకునేది నన్ను

ఒకరికొకరం నిమిషమైనా వొదలలేని నేస్తాలమైపోయాం

మేము ఇద్దరం అనే సంగతే మరిచిపోయాం

నా నరాల్లో నెత్తురై ప్రవహించేది ఏరు

ఏటి అలల పెదాలమీద నవ్వునై మురిసిపోయేవాణ్ణి నేను

ఏటివొడ్డున నిలబడి కెరటాలవేపు చూస్తే నా కలలు కనిపిస్తాయి

ఎదురుగా నిలిచి నా కళ్ళలోకి పరిశీలనగా చూస్తే

నదీజలాల నిర్మల ప్రతిబింబం పలకరిస్తుంది

అలలసవ్వడికి చెవియొగ్గితే వినిపిస్తుంది మీకు 

మా కరుణరసార్ద్ర యుగళగీతం

ఏటి ‘కల’ నేను

నాలో ‘కళ’ ఏరు

తన ప్రయాణానికి సార్థకత పంటపొలాల్లోనే

నా జీవనయానం సఫలమయ్యేది మానవ హృదయక్షేత్రాలలోనే

ఎర్రమట్టి నేలలనీ

నల్లరేగడి భూములనీ

ఎంపు లేదు నదికి

నేలకు నమస్కరించి చేలను వాగ్దానం చెయ్యడం మాత్రమే తెలుసు తనకి

నాలో ప్రవహించీ ప్రవహించీ నన్నే నదిగా మార్చేసిందది

పట్టే ప్రతి దోసిలినిండా ప్రేమను నింపాలని 

నేను నదినయ్యాకే తెలిసింది

ధూళిధూసరితమైన ఏ పాదం రేవులో దిగినా 

ప్రక్షాళన చెయ్యాలనే పాఠం నదే నేర్పింది నాకు

అదొక అందరికీ సాధ్యంకాని యోగమని బోధించింది

ఇరు తీరాల నడుమ ఏరు

రెండు అట్టల మధ్య నేను

మాదొక నిరంతర సమాంతర ప్రయాణం

మాదొక అవిశ్రాంత అనంత ప్రవాహగానం

కవిగా ప్రయాణించడమంటే నదిగా ప్రవహించడమే

కల్మషాల్ని, కశ్మలాల్ని కడిగేయడమే కదా పరమార్థం

ఏటికైనా.. కన్నీటికైనా

కన్నీరంటే కవిత్వానికి పర్యాయపదమే కదా

ఏరుగా మారడం కన్నా

నేరుగా పారడం కన్నా

ఏముంటుంది భాగ్యం ఏ మానవుడికైనా

నేను అడుగు పెట్టిన చోట హరిత కావ్యావిష్కరణ

నేను నడిచే దారిపొడవునా ఆకుపచ్చని గీతాలాపన

పల్లానికి మాత్రమే ప్రవహించే నది

నాకు పది దిక్కులలోనూ ప్రయాణించడం నేర్పింది

నదీమతల్లి కదా

నన్ను నదిని చేసిన నదికి కృతజ్నుడను సదా.

లాంగుల్య

Advertisement
Advertisement