Abn logo
Jun 17 2021 @ 00:32AM

దారులు ఇలా.. వెళ్లేదెలా?

జిల్లాలో తొలకరి వర్షాలకే అధ్వానంగా మారిన రహదారులు

అడుగడుగునా గుంతలు.. ప్రయాణికుల అవస్థలు

కార్యాలయాలకే పరిమితమవుతున్న అధికారులు

దారిలేక గోసపడుతున్న మారుమూల గ్రామాల ప్రజలు

ఆదిలాబాద్‌, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం ఏటా కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేస్తున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం ఆశించిన విధంగా కనిపించడం లేదు. దీంతో వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రయాణికులు పడరాని పాట్లు పడుతున్నారు. ‘రాజుల పైసా రాళ్ల పాళ్లు’ అన్న చందంగా అధికారుల తీరు మారిందంటున్నారు. కొత్త రోడ్ల నిర్మాణానికి చూపుతునంత ఆసక్తి రోడ్ల నాణ్యత పై చూపక పోవడంతో జిల్లాలోని మారుమూల గ్రామాలకు వెళ్లే రోడ్ల నాణ్యత మూన్నాళ్ల ముచ్చటగానే మారుతోంది. జిల్లాలో రోడ్డు భవనాల శాఖ పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో రోడ్ల నిర్మాణాలను చేపడుతున్న ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోవడమే లేదు. కొత్తవి, పాతవి కలుపుకొని ప్రస్తుతం జిల్లాలో రూ.200 కోట్లకు పైగానే రోడ్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మారుమూల గ్రామీణ ప్రాంతాల రోడ్లన్నీ తొలకరి వర్షాలకే అతుకులబొంతగా మారినా అధికారులకు పట్టింపే కరువవుతోంది. ఏదైనా ఆపద వస్తే ప్రయాణం చేయడానికి నరకయాతన పడాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. అధ్వానంగా తయారైన రోడ్లపై ప్రయాణం చేసేందుకు ప్రజలు జంకుతున్నారు. మరమ్మతులకు నోచుకోక పోవడంతో భారీ గుంతలు ఏర్పడి తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. జిల్లాలోని 18 మండలాల పరిధిలో ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాహనాలు తరచూ మరమ్మతులకు రావడంతో ప్రయాణికులకు ఆర్థికభారం పెరిగిపోతోంది. గుంతలుపడిన రోడ్లపై నిత్యం ప్రయాణం చేస్తే వెన్నునొప్పి, ఇతర ఇబ్బందులు పొంచి ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే వేసిన రోడ్లనే పదే పదే వేస్తూ నిధుల దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు రోడ్ల నిర్మాణం పనుల్లో రాజకీయ జోక్యం పెరిగిపోవడంతో అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో యేడాది గడవక ముందే రోడ్లన్నీ గుంతలుపడి అధ్వానంగా మారుతున్నాయి. ఏటా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడమే తప్ప.. మంజూరు చేయించి రోడ్లను మరమ్మతులు చేపట్టిన దాఖలాలే కనిపించడం లేదు. నేతల ఒత్తిళ్లతో అవసరం లేని గ్రామాలకు రోడ్లు, కల్వర్టులను నిర్మిస్తున్న అవసరం ఉన్న చోట మాత్రం నిధులు మంజూరుకాక పోవడంతో ఏటా ప్రజలు ప్రయాణపు ఇబ్బందులు పడుతునే ఉన్నారు.

మరమ్మతులు కరువు..

రోడ్ల నిర్మాణాలను చేపట్టి వదిలేయడంతో ఏళ్ల తరబడి మరమ్మతులు కరువవుతున్నాయి. రోడ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే పది కాలాల పాటు రోడ్డు పనులు పదిలంగా ఉంటాయి. కానీ జిల్లాలో ఎక్కువగా నల్ల రేగడి నేలలే కావడంతో రోడ్డు నాణ్యత ప్రశ్నార్థకంగా మారుతోంది. చిన్నపాటి వర్షాలకే రోడ్లన్నీ గుంతలుపడి ప్రమాదకరంగా మారుతున్నాయి. అయితే వర్షం కురిసిన వెంటనే రోడ్డుపై వర్షపు నీరునిల్వకుండా చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే రోడ్డుపై నుంచి వర్షపు నీరు వెంటనే కిందికి జారిపోయే విధంగా రోడ్లను నిర్మించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తారు రోడ్లపై కేజ్‌విల్‌ వాహనాలు పరిమితికి మించిన భారీ వాహనాలను నడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. జిల్లాలో ఎన్నో గ్రామాలకు వెళ్లేందుకు సరైన రోడ్డు గ్రామాలు లేక పోవడంతో తొలకరి వర్షాలకే బాహ్య ప్రపంచానికి దూరం కావాల్సి వస్తోంది. అధికారుల అలసత్వం, నిర్లక్ష్యానికి గ్రామీణ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రయాణం చేస్తున్నారు. అత్యవసర సమయంలో ఊరును దాటి బయటకు రావాలంటే నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. చిన్నపాటి వర్షాలకే ఒర్రెలు, వాగులు పొంగి పారడంతో వరద నీటిని దాటే అవకాశం లేక రోజుల తరబడి గ్రామాలకే పరిమితమవుతున్నారు.

నగుబాటుగా మారుతున్న నాణ్యత..

జిల్లాలో నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణం పనుల్లో నాణ్యత కరువవుతోంది. అడుగడుగునా క్వాలిటీ విభాగం అధికారుల వైఫల్యమే కనిపిస్తోంది. రోడ్డు నిర్మాణం పనుల్లో అధికారులు నిక్కచ్చిగా వ్యవహరించి నాణ్యత ప్రమాణాలను పాటించే విధంగా పర్యవేక్షణ చేయాల్సి ఉంది. కానీ క్వాలిటీ విభాగం అధికారులే అంతగా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. సిబ్బంది కొరత కారణంగా పనులపై పర్యవేక్షణ కనిపించడం లేదు. రోడ్డు నిర్మాణం పూర్తయ్యే వరకువివిధ దశల్లో నాణ్యతా ప్రమాణాలను పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. కానీ పనులు పూర్తయిన తర్వాతనే తూతూ మంత్రంగా రోడ్డు సాంపుల్లు సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌లకు పంపుతున్నారు. ఒకవేళ నాణ్యత లేదని తెలిసిన ఆ వెంటనే గుట్టు చప్పుడు కాకుండా కాంట్రాక్టర్లు అధికారులను మేనేజ్‌ చేస్తున్నారు. నాణ్యత లేకుండా పనులుచేస్తే సదరు కాంట్రాక్టర్‌ నుంచి నిధులను రికవరీ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు జిల్లాలో ఏ ఒక్క కాంట్రాక్టర్‌పై అలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలే కనిపించడం లేదు. పనులు నాణ్యతగా ఉన్నాయని క్వాలిటీ అధికారులు నిర్ధారణ చేసిన తర్వాత కూడా యేడాది గడవక ముందే కంకర తేలి గుంతలు పడి కనిపించడం  ఏమిటో అధికారులకే తెలియాలి మరి. పనుల నాణ్య తపై సామాన్యులు సైతం వేలెత్తి చూపే పరిస్థితులు నెలకొంటున్న ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ అధికారుల తీరులో మాత్రం మార్పు కనిపించడమే లేదు.