పోరాటాల్లో మహిళల పాత్రే కీలకం

ABN , First Publish Date - 2021-03-08T08:40:51+05:30 IST

భారతదేశ చరిత్రలో జరిగిన అన్ని పోరాటాల్లో పురుషుల కంటే మహిళల పాత్రే కీలకమని ప్రముఖ రచయిత, విమర్శకుడు అల్లం రాజయ్య అన్నారు.

పోరాటాల్లో మహిళల పాత్రే కీలకం

  • గ్రామీణ మహిళలపై అదనపు శ్రమ భారం
  • ఢిల్లీలో రైతాంగ ఉద్యమంతో చైతన్యం
  • ‘ప్రరవే’ సదస్సులో అల్లం రాజయ్య

వరంగల్‌ కల్చరల్‌, మార్చి 7: భారతదేశ చరిత్రలో జరిగిన అన్ని పోరాటాల్లో పురుషుల కంటే మహిళల పాత్రే కీలకమని ప్రముఖ రచయిత, విమర్శకుడు అల్లం రాజయ్య అన్నారు. ఉత్పత్తి ప్రక్రియల్లో మహిళల భాగస్వామ్యాన్ని పక్కన పెట్టి చరిత్ర లేకుండా చేయటం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కేంద్రంలోని పింగిళి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక (ప్రరవే), కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది. ‘తెలుగు సాహిత్యం- రైతాంగ సమస్యలు’ అనే అంశంపై ప్రరవే జాతీయ అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో అల్లం రాజయ్య కీలకోపన్యాసం చేశారు. భారతదేశ సామాజిక పరిణామాల్లో అన్ని రంగాల్లోనూ మహిళల సంపూర్ణ ప్రాతినిధ్యం ఉందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలపై అదనపు శ్రమ భారం పెరుగుతోందని తెలిపారు. ప్రస్తుతం దేశంలో మహిళల శ్రమను లెక్కించే పరికరాలు అందుబాటులో లేవన్నారు. చరిత్ర అధ్యయనానికి సరైన టూల్స్‌(పరికరాలు) కావాలని అభిప్రాయపడ్డారు. అన్ని రంగాల్లోనూ పితృస్వామిక భావజాలంతో ఉన్న సమాజ ధోరణిలో మార్పు రావాలని ఆకాంక్షించారు.


ఢిల్లీలో రైతుల ఉద్యమంతో అన్ని వర్గాల్లోనూ కదలిక, చైతన్యం వచ్చిందని చెప్పారు. మనిషి ఉత్పత్తి ప్రక్రియలో భాగం కాబట్టి మన చుట్టూ ఉన్న పరిసరాలను కూడా ఎప్పటికప్పుడు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కాగా ‘కాలంలో.. ప్రరవే క్షేత్ర పర్యటనలు’ పేరిట ప్రచురించిన పుస్తకాన్ని ప్రముఖ నవలా రచయిత డాక్టర్‌ అంపశయ్య నవీన్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో అత్యంత కీలకమైనది వ్యవసాయరంగమేనని అన్నారు. ఢిల్లీలో రైతుల ఆందోళన, అమరావతిలో రైతుల నిరసనలు, కరోనా కాలంలో వలస కార్మికుల అవస్థలపై రచయితల అధ్యయనాలు ఆలోచింపజేసేలా ఉండాలని సూచించారు. 


ప్రపంచీకరణతో పెరిగిన రైతాంగ సమస్యలు: గోపరాజు సుధ

ప్రపంచీకరణతో రైతాంగ సమస్యలు పెరిగాయని ఉపన్యాసకురాలు, స్ర్తీవాద రచయిత్రి గోపరాజు సుధ అన్నారు. ‘నూతన ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో వ్యవసాయ సంక్షోభాలు-మహిళలు 1991-2020’ అనే అంశంపై సుధ ప్రసంగించారు. ప్రపంచీకరణ ఫలితంగా రైతు కుటుంబాల్లో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని, మృతుల కుటుంబాల్లో మహిళలే పెద్దదిక్కు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘తెలుగు సాహిత్యం- నూతన ఆర్థిక సంస్కరణల భిన్న పార్శ్వాలు’ అనే అంశంపై కోడం కుమారస్వామి మాట్లాడారు. ‘భారత దేశ వ్యవసాయ విధానాలు-చట్టాలు-ఆచరణ పరిణామాలు- 1947-1965’ అంశంపై జహారా, ‘1947-1965 మధ్య తెలుగు సాహిత్యం-రైతాంగ సమస్యల ప్రతిఫలనం’పై గుత్తికొండ చంద్రకళ పత్ర సమర్పణ చేశారు. ‘హరిత విప్లవం - పరిణామాలు 1966-1990’ అనే అంశంపై లంకా పాపిరెడ్డి, ‘తెలుగు సాహిత్యంలో హరిత విప్లవ పరిణామాల ప్రతిఫలనం’పై వంగాల సంపత్‌రెడ్డి ప్రసంగించారు. 

Updated Date - 2021-03-08T08:40:51+05:30 IST