‘ఏడీసీసీ’లో పాలన అస్తవ్యస్తం

ABN , First Publish Date - 2021-10-18T06:12:10+05:30 IST

జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో పాలన అస్తవ్యస్తంగా మారింది. పాలకవర్గసభ్యులు, అధికారుల మధ్య సమన్వయం కొరవడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

‘ఏడీసీసీ’లో పాలన అస్తవ్యస్తం
ఏడీసీసీ బ్యాంకు ప్రధాన కార్యాలయం

పాలకవర్గం సభ్యులు, అధికారుల మధ్య కొరవడిన సమన్వయం

ఉద్యోగంలో చేరిననాటి నుంచి ఒకే చోట విఽధులు

పాలకవర్గం మారినా... స్థానచలనం లేని ఉద్యోగులు

ఏళ్ల తరబడి పాతుకుపోయిన వైనం

అవినీతి, అక్రమాలకు ఊతం

చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న సహకారశాఖ అధికారులు

కొందరిది ఆడిందే ఆట.. పాడిందే పాట....

చుట్టపుచూపుగా విధులకు వస్తున్న పలువురు ఉద్యోగులు


అనంతపురం క్లాక్‌టవర్‌, అక్టోబరు 17 : జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో పాలన అస్తవ్యస్తంగా మారింది. పాలకవర్గసభ్యులు, అధికారుల మధ్య సమన్వయం కొరవడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో అధికారులు, ఉద్యోగులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తూ బ్యాంకును అదోగతిపాలు చేస్తున్నారు. ఏడీసీసీ బ్యాంకులో కొందరు ఉద్యోగంలో చేరిన నాటి నుంచి ఒకే చోట విధులు నిర్వహిస్తుండటం నమ్మలేని నిజం. సుమారు సగానికి మందికి పైగా అధికారులు, ఉద్యోగులు ఇలా ఒకే చోట విధులు నిర్వహిస్తున్నారు. తద్వారా అవినీతి, అక్రమాలకు ఆజ్యం పోస్తున్నారనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆ ఏడీసీసీ బ్యాంకు పాలక వర్గాలు మారినా.. ఆ అధికారులు, ఉద్యోగులు మాత్రం అదే సీట్లోనే పదిలంగా ఉంటున్నారు. బ్యాంకులో లోటు పాట్లపై  ఆప్కాబ్‌కు ఎప్పటికప్పుడు సమాచారం ఇయాల్సిన సహకార శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో అవినీతి, అక్రమాలను మరింత ప్రోత్సహించినట్లైంది. ఇక కొన్ని బ్రాంచలలో ఉద్యోగులు చుట్టపుచూపుగా విధులకు వచ్చి వెళ్తుంటారు. కళ్యాణదుర్గం, తాడిపత్రి, గుంతకల్లు తదితర శాఖల్లో ఈ తతంగం కొన్నేళ్ళుగా నడుస్తున్నా ప్రశ్నించేవారే కరవయ్యారు. పొరపాటున ఈ విషయాన్ని ఏ ఉద్యోగి అయినా ప్రశ్నిస్తే ఇక కక్షసాధింపులు, వేధింపులే.


28 శాఖల్లోనూ ఇదే పరిస్థితి..

ఏడీసీసీ బ్యాంకుకు సంబంధించి జిల్లాలో ఒక ప్రధాన కార్యాలయం, 28 శాఖలు ఉన్నాయి. ప్రధాన కార్యాలయంలో సుమారు 10 మంది ఉద్యోగులు 20 ఏళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నారు. కళ్యాణదుర్గం, రాయదుర్గం, పామిడి, గోరంట్ల, గుంతకల్లులోనూ ఇదే పరిస్థితి. మూడేళ్లకు కచ్చితంగా ఒకసారి బదిలీ చేయాలనే నిబంధన ఉన్నా.. అది అమలుకు నోచుకోవడం లేదు. ఒక బ్రాంచలో పనిచేసిన తరువాత తిరిగి అదే శాఖకు బదిలీ చేయకూడదనే నిబంధననూ తుంగలో తొక్కేశారు.


పెరిగిన అవినీతి, అక్రమాలు ... 

ఏడీసీసీ బ్యాంకులో ఉద్యోగులు ఒకేచోట ఏళ్లతరబడి ఉండటంతో అవినీతి, అక్రమాలు పెరిగాయి. ఇటీవల ధర్మవరం, యాడికి, మడకశిర శాఖల్లో డీ-ఫారం పట్టాలకు ముడుపులు తీసుకొని రుణాలు ఇచ్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో బాధిత రైతులు కలెక్టర్‌కు, జిల్లా సహకార శాఖ అధికారి, ఏడీసీసీ బ్యాంకు చైర్‌పర్సన, సీఈఓల దృష్టికి తీసుకెళ్లారు. 2012లో రూ.12 లక్షల రుణాలో గోల్‌మాల్‌ చేసిన ఓ అధికారిపై ఇప్పటివరకూ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. అదే ఏడాదిలో బంగారానికి సంబంధించి మరో ఘటనలోనూ అధికారులపై చర్యలు శూన్యం. ఇలా అవినీతిపరులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడంతో.. వారి మరింత అక్రమాలకు పాల్పడుతున్నారు. 


అసిస్టెంట్‌ మేనేజర్లే ఇనచార్జిలు... 

జిల్లాలోని పలుశాఖల్లో అసిస్టెంట్‌ మేనేజర్‌లే ఇనచార్జిలుగా వ్యవహరిస్తున్నారు. ప్రధాన కార్యాలయంలో ఒకరిద్దరూ మేనేజర్లు అవసరం ఉంది. అయితే ఇక్కడ ఏకంగా 10 మంది వరకు మేనేజర్‌ స్థాయి అధికారులు ఉన్నారు. దీంతో జిల్లా కేంద్రంలోని రామ్‌నగర్‌ బ్రాంచ, గుడిబండ, కొత్తచెరువు, వజ్రకరూరు, తనకల్లు, పెనుకొండ, హిందూపురం తదితర ప్రధానశాఖల్లో సైతం అసిస్టెంట్‌ మేనేజర్లే ఇనచార్జి మేనేజర్లగా చలామణి అవుతున్నారు. 


Updated Date - 2021-10-18T06:12:10+05:30 IST