పాలకులకు సద్బుద్ధి ప్రసాదించాలి

ABN , First Publish Date - 2022-01-27T08:08:55+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన పీఆర్సీని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు జిల్లావ్యాప్తంగా నిరసనకు దిగాయి.

పాలకులకు సద్బుద్ధి ప్రసాదించాలి
తిరుపతిలో అంబేడ్కర్‌ విగ్రహానికి పీఆర్సీ సాధన సమితి వినతి పత్రాలు

అంబేడ్కర్‌, గాంధీ విగ్రహాలకు  ఉద్యోగ, ఉపాధ్యాయుల వినతి పత్రాలు


తిరుపతి, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన పీఆర్సీని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు జిల్లావ్యాప్తంగా నిరసనకు దిగాయి. బుధవారం జిల్లాలో పలు చోట్ల ర్యాలీలు నిర్వహించిన ఉద్యోగ, ఉపాధ్యాయులు రివర్స్‌ పీఆర్సీని వెంటనే వెనక్కు తీసుకునేలా పాలకులకు సద్బుద్ధి ప్రసాదించాలని కోరుతూ వినతి పత్రాలను అంబేడ్కర్‌, గాంధీ విగ్రహాలకు సమర్పించారు. తిరుపతి నగరంలో ఉద్యోగ,ఉపాధ్యాయులు మహా త్ముడి విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. మదనపల్లెలో ఉపాధ్యాయులు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించి పీఆర్సీ రద్దుకు డిమాండ్‌ చేశారు. పలమనేరులో ఉద్యోగ, ఉపాధ్యాయ,కార్మిక సంఘాల ప్రతినిధులు మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. పుంగనూరు, రామసముద్రం, నిమ్మనపల్లె మండల కేంద్రాల్లో సైతం ఉపాధ్యా యులు నిరసన ప్రదర్శనలు నిర్వహించి అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేశారు. శ్రీకాళ హస్తిలో ఉద్యోగులు నిరసన ప్రదర్శన నిర్వహించిన అనంతరం అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రం అందజేయగా కుప్పంలో రివర్స్‌ పీఆర్సీకి వ్యతిరేకంగా ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. పీలేరులో పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించగా కలకడలో అంబేడ్కర్‌ చిత్రపటానికి ఉపాధ్యాయులు వినతి పత్రం అందజేశారు. వెదురుకుప్పం, కార్వేటినగరం మండలం టీకేఎం పేట గ్రామాల్లో అంబేడ్కర్‌ విగ్రహాలకు ఫ్యాప్టో నేతలు వినతిపత్రం సమర్పిం చగా సత్యవేడు, పుత్తూరుల్లో ఉద్యోగ జేఏసీ ఽఆధ్వర్యంలో పీఆర్సీ రద్దు డిమాండ్‌ చేస్తూ దర్నాలు నిర్వహించారు.


నేటినుంచి నెలాఖరు వరకు కలెక్టరేట్‌ వద్ద రిలే దీక్షలు

చిత్తూరు: రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్ఫూర్తితో ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని పీఆర్సీ సాధన సమితి జిల్లా కన్వీనర్‌ రాఘవులు స్పష్టం చేశారు. బుధవారం ఎన్‌జీవో భవన్‌లో గణతంత్ర దిన వేడుకలు నిర్వహించారు. అనంతరం వివిధ సంఘాల నాయకులతో కలిసి మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహిస్తూ దర్గా సర్కిల్‌ వద్దకు చేరుకున్నారు. అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి... ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల ప్రకారం ఉద్యమిస్తామని చెప్పారు. గురువారం నుంచి ఈ నెల 30వ తేది వరకు కలెక్టరేట్‌ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేస్తామని పేర్కొన్నారు. ఈ దీక్షల విజయవంతానికి అన్ని సంఘాల ప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.పీఆర్సీ సాధన సమితి నాయకులు రఘు, ప్రభాకర్‌, గంటా మోహన్‌, జీవీ రమణ, శివయ్య, సుబ్రహ్మణ్యం, చెంగల్రాయ మందడి, కుమారస్వామి యాదవ్‌, ముక్తార్‌ అహ్మద్‌, శ్రీనివాసమూర్తి, బాలసుబ్రహ్మణ్యం, ప్రదీప్‌, మహేష్‌, మురళి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-27T08:08:55+05:30 IST