అయినా ఓకే!

ABN , First Publish Date - 2021-02-28T06:15:29+05:30 IST

విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులు నిబంధనలను తుంగలో తొక్కినా నో అనేవారు లేరు. అడ్డగోలుగా కులం కార్డును మార్చేసినవారు, సంతానం సంఖ్యను తగ్గించి చెప్పిన వారు ఎన్నికల బరిలో నిలిచారు. ఎన్నికల నిబంధనల ప్రకారం తప్పుడు అఫిడవిట్‌ ఇచ్చినా.. ముగ్గురు పిల్లలున్నా పోటీకి అనర్హులు. కానీ వారు వైసీపీ అభ్యర్థులైతే ఈ నిబంధనలు వర్తించవు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు సైతం చూసీచూడనట్టు ఉండిపోతారు.

అయినా ఓకే!
2014 ఎన్నికల్లో ఓసీగా ఆదిలక్ష్మి ఆఫిడవిట్‌

నాడు ఓసీ అభ్యర్థి.. నేడు బీసీ

ముగ్గురు పిల్లలున్నా పోటీకి సై

వైసీపీ అభ్యర్థులకు నిబంధనలు వర్తించవు

ఫిర్యాదు చేసినా పట్టించుకునేవారు లేరు

విజయవాడ కార్పొరేషన్‌లో ‘అధికార’ సిత్రాలు


విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులు నిబంధనలను తుంగలో తొక్కినా నో అనేవారు లేరు. అడ్డగోలుగా కులం కార్డును మార్చేసినవారు, సంతానం సంఖ్యను తగ్గించి చెప్పిన వారు ఎన్నికల బరిలో నిలిచారు. ఎన్నికల నిబంధనల ప్రకారం తప్పుడు అఫిడవిట్‌ ఇచ్చినా.. ముగ్గురు పిల్లలున్నా పోటీకి అనర్హులు. కానీ వారు వైసీపీ అభ్యర్థులైతే ఈ నిబంధనలు వర్తించవు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు సైతం చూసీచూడనట్టు ఉండిపోతారు. 


ఆంధ్రజ్యోతి, విజయవాడ : విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ 48వ డివిజన్‌ వైసీపీ కార్పొరేటర్‌ అభ్యర్థిగా అత్తులూరి ఆదిలక్ష్మి పోటీ చేస్తున్నారు. రిజర్వేషన్‌లో ఈ డివిజన్‌ బీసీ మహిళకు కేటాయించారు. అలాంటి స్థానంలో ఓసీ అయిన ఆదిలక్ష్మి పోటీలో ఉండటంపై జనసేన నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల్లో 32వ డివిజన్‌ నుంచి పోటీ చేసిన ఆదిలక్ష్మి తన ఎన్నికల అఫిడవిట్‌లో ఓసీగా పేర్కొన్నారు. డిక్లరేషన్‌లో కూడా ఎటువంటి రిజర్వేషన్‌ వర్తించదని సంతకం చేశారు. ఇప్పుడామె బీసీ మహిళ ఎలా అయ్యారనేది ప్రశ్న. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఆమె బీసీ కోటాలో పోటీ చేస్తున్నారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. ఆదిలక్ష్మి నామినేషన్‌ను, కులధ్రువీకరణ పత్రాలను పరిశీలించి ఆమెను పోటీకి అనర్హురాలిగా ప్రకటించాలని జనసేన నేత పోతిన మహేశ్‌ ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేశారు. 


రాష్ట్ర మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ 48వ డివిజన్‌ టికెట్‌ను అమ్ముకుని, బీసీలకు అన్యాయం చేశారని పోతిన ఆరోపించారు. రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్‌ను 34 నుంచి 24 శాతానికి తగ్గించి వారికి తీవ్ర ద్రోహం చేసిందని, తగ్గించిన బీసీ కోటాలోనూ ఓసీలు చొరబడి బీసీలకు అన్యాయం చేస్తున్నారని మహేశ్‌ ఆరోపించారు. బీసీలను రాజకీయంగా ఎదగనీయకుండా మంత్రి అడ్డుకుంటున్నారన్నారు. ఆదిలక్ష్మి వ్యవహారంపై స్థానిక ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, మంత్రి ఒత్తిళ్లతోనే వారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. 


ముగ్గురు పిల్లలున్నా..

విజయవాడ కార్పొరేషన్‌ పరిధిలోని 20వ డివిజన్‌ (కృష్ణలంక) వైసీపీ అభ్యర్థి అడపా శేషగిరిరావుపైనా ఎన్నికల అధికారులకు పలు ఫిర్యాదులు వెళ్లినా, స్పందన లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఈయన ఎన్నికల అఫిడవిట్‌లో తనకు ఇద్దరు పిల్లలని పేర్కొన్నారు. కానీ ఆయనకు ముగ్గురు పిల్లలంటూ సాక్ష్యాధారాలతోసహా ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. శేషగిరి ముగ్గురు బిడ్డలకు సంబంధించిన జనన ధ్రువీకరణ పత్రాలతో సహా ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు లేవని, ఈయన నామినేషన్‌ను పరిశీలించి వాస్తవాల ఆధారంగా శేషగిరిని అనర్హుడిగా ప్రకటించాలని టీడీపీ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2021-02-28T06:15:29+05:30 IST