మీనం..మోసం

ABN , First Publish Date - 2020-08-13T10:49:31+05:30 IST

నిరుపేదలైన మత్స్యకారులను ఆదుకునేందుకు ప్రభుత్వం నూరుశాతం సబ్సిడీతో చేపపిల్లల పంపిణీకి శ్రీకారం

మీనం..మోసం

చేపపిల్ల సైజు, ధరల్లో కాంట్రాక్టర్లు దగా 

అధికార పార్టీ పెద్దలదే పెత్తనం

కోర్టుకు చేరిన పంచాయితీ.. నిలిచిన టెండర్ల ప్రక్రియ


నల్లగొండ, ఆగస్టు 12  (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : నిరుపేదలైన మత్స్యకారులను ఆదుకునేందుకు ప్రభుత్వం నూరుశాతం సబ్సిడీతో చేపపిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టింది. కొందరు అక్రమార్కులు సర్కారు ఆలోచనను పక్కదారి పట్టించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికార పార్టీకి చెం దిన కొందరు ఏపీ రాష్ట్ర కాంట్రాక్టర్లతో కుమ్మక్కై దోపిడీకి పాల్పడుతున్నారు. దీనిపై వరంగల్‌ జిల్లాకు చెందిన నేత ఒకరు, మత్స్య సహకార ఐక్య కార్యాచరణ సంఘం కోర్టుకు వెళ్లడంతో జిల్లాలో ఈ నెల 5న ప్రారంభం కావల్సిన చేపపిల్లలు వదిలే కార్యక్రమం వాయిదా పడింది.


నల్లగొండ జిల్లాలో మొత్తం 770చెరువులు ఉండగా 5.80లక్షల చేపపిల్లలు పంపిణీ చేయాల్సి ఉంది. ఇందుకుగాను తొమ్మిది మంది కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేశారు. జిల్లాలో 151 సొసైటీలు ఉండగా ఇందులో 22,762 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో 1,273మంది మహిళా సభ్యులు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో ఎక్కడా చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలు లేకపోవడంతో ఏపీ నుంచి దిగుమతి చేసుకుంటారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ కాంట్రాక్టర్లదే హవా ఉండేది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో మత్స్య రంగంలో కొంత అనుభవం, సంబంధాలు ఉన్న అధికార పార్టీ రాష్ట్రస్థాయి నేతలు ప్రధానంగా వరంగల్‌, కరీంనగర్‌కు చెందిన వారు కాంట్రాక్టర్ల అవతారమెత్తారు. 60శాతం ఏపీ, 40శాతం తెలంగాణ వాటాలతో ప్రభుత్వ టెండర్లలో రింగ్‌ అవ్వాలని నిర్ణయించుకున్నారు.


అధికారుల సహకారంతో అంతా కుమ్మక్కై చేపపిల్లలు ఏపీ నుంచి కొనుగోలు చేసి తెలంగాణలోనే పెంచి, పోషించినట్టు రికార్డులు సృష్టిస్తారు. సైజు, సంఖ్యలో మోసాలు చేస్తారు. ఈ ఏడాది అదే కార్యక్రమం ఇప్పటికే పూర్తి కావాల్సి ఉంది. వరంగల్‌ జిల్లాకు చెందిన ఓ నేత గతంలో టీఆర్‌ఎ్‌సలో ఉండేవారు ఆయన తెలంగాణలో కొన్ని చెరువులు తీసుకొని చేప పిల్లల ఉత్పత్తికి అనుమతి పొందారు. రాజకీయ పరిణామాల క్రమంలో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. ఆయన్ని ఆర్థికంగా దెబ్బతీసేందుకు అధికార పార్టీ చెరువులు వెనక్కి తీసుకోవడం మొదలుపెట్టింది, దీంతో ఆయన తనే చేపపిల్లలు సరఫరా చేస్తానని, ఆమేరకు ఒప్పందం ఉందని, కావున టెండర్ల ప్రక్రియను ఆపాలంటూ కోర్టును ఆశ్రయించారు. చేప పిల్లల కొనుగోలులో అక్రమాలపై మత్స్యకార్మిక సంఘాలు ఐక్యవేదికగా ఏర్పడి కోర్టును ఆశ్రయించాయి. దీంతో జిల్లాలో చేపపిల్లల పంపిణీ నిలిచిపోయింది. 


బినామీ కాంట్రాక్టర్ల కొను‘గోల్‌మాల్‌’

ప్రభుత్వ లెక్కల ప్రకారం చెరువుల్లో వదిలే చేపపిల్ల రెండున్నర అంగుళాలు ఉండాలి, ఈ సైజు పిల్ల ధర రూ.1.25రూపాయలకు బహిరంగ మార్కెట్‌లో దొరుకుతుంది. జిల్లాకు సరఫరా చేసే కాంట్రాక్టర్లు అధికారులతో కుమ్మక్కై ముప్పావు అంగుళం ఉండే చేప పిల్లలను సరఫరా చేస్తున్నారు. దీని ధర కేవలం 25 పైసలు మాత్రమే ఉంటుంది. రికార్డుల్లో మాత్రం రెండున్నర అంగుళాల చేప పిల్లల సరఫరా జరిగిందని రాసేస్తారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాత్రం రికార్డులో పేర్కొన్నట్టు రెండున్నర అంగుళాల చేప పిల్లలనే పోస్తారు. అనంతరం అక్రమాలకు తెరలేపుతారు. సైజు, సంఖ్యలో భారీగా అక్రమాలకు పాల్పడి అందినకాడికి దోచుకుంటారు. అటు ఇటు కాని సైజుతో పెంచిన మత్స్యకారులు నిలువునా మోసపోతున్నారు. ఆ పిల్లలు బతకక ప్రైవేటుగా ఏపీకి  వెళ్లి కొనుగోలు చేసుకొని మళ్లీ పెంపకం చేసుకోవాల్సి ఉంటుంది.


బినామీ వ్యవస్థ పోతేనే ప్రయోజనం

చేపపిల్లల పంపిణీ వ్యవహారంలో మత్య్స కార్మికులను మాత్రమే భాగస్వాములను చే యాలి. గొర్రెలు కొనుగోలు చేసినట్టుగానే  మా సంఘాలు, ఫిషరీష్‌ డెవల్‌పమెంట్‌ అధికారి కలిసి చేపపిల్లలు కొనుగోలు చేయాలి. లేదా నాలుగు సంఘాలను ఒక బృందంగా తీసుకెళ్లాలి సాధ్యం కాకపోతే సంఘాల అకౌంట్లలో డబ్బు జమ చేస్తే మేమే కొనుగోలు చేసుకుంటాం. కాంట్రాక్టర్ల వ్యవస్థతో అధికారులు, బడా నేతలే లబ్ధి పొందుతున్నారు. చేపపిల్లల సరఫరాలో మోసాలను అధికారుల సమక్షంలోనే పట్టించి చూపించాం. ఈసారి సైతం ఆ మోసాలను ఎక్కడికి అక్కడ నిలువరించి సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచాలని మా సంఘాలు నిర్ణయించాయి. 

-  మురారి మోహన్‌, మత్స్యకార్మిక సంఘం ప్రధాన కార్యదర్మి


మూడు నాలుగు రోజుల్లో స్పష్టత

సబ్సిడీ చేప పిల్లల పంపిణీపై ఇప్పుడే ఏమీ చెప్పలేం. మూడు నాలుగు రోజుల్లో అన్ని వివరాలు వెల్లడిస్తాం.

- ఎం.చరిత, మత్య్సశాఖ డీడీ

Updated Date - 2020-08-13T10:49:31+05:30 IST