గ్రామీణ పేదలే అధికం

ABN , First Publish Date - 2021-11-28T05:39:38+05:30 IST

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో స్థితిగతులు తెలుసుకోవడానికి నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5లో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.

గ్రామీణ పేదలే అధికం

  • ఉమ్మడి జిల్లాలో 5.83శాతం మంది పేదలు 
  • హైదరాబాద్‌ తర్వాత రాష్ట్రంలో అతి తక్కువ పేదరికం
  • మౌలిక వసతుల్లో మేడ్చల్‌ అగ్రస్థానం 
  • రంగారెడ్డి జిల్లాలో పెరిగిన స్త్రీల నిష్పత్తి

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి): హైదరాబాద్‌ జిల్లా తరువాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అతి తక్కువ పేదలు ఉన్నట్లు తాజాగా నీతి ఆయోగ్‌ విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది. అయితే, వీరిలో కూడా గ్రామీణ ప్రాంతాల్లోనే పేదలు ఎక్కువగా ఉన్నారు. ప్రజల ఆదాయం, వినియోగం, ఖర్చుతో పాటు విద్య, వైద్య, మౌలిక సదుపాయాల ఆధారంగా నీతి ఆయోగ్‌ ఈ నివేదిక రూపొందించింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఆధారంగా బహుముఖ కోణాల్లో పేదరికాన్ని విశ్లేషిస్తూ నివేదిక విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన రెండు వేర్వేరు నివేదికల్లో  ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అన్ని రంగాల్లో పురోగతి కనిపించింది. ముఖ్యంగా మేడ్చల్‌ జిల్లా అనేక అంశాల్లో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. పేదరికానికి సంబంధించి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఆధారంగా నివేదికలు రూపొందించారు. రాష్ట్రంలో సగటు పేదలు 13.74శాతం కాగా  అతి తక్కువగా హైదరాబాద్‌లో 4.27శాతం మంది పేదలు నమోదయ్యారు. తర్వాత ఉమ్మడి రంగారెడి జిల్లాలో 5.8శాతం పేదలున్నట్లు తాజా నివేదికలో వెల్లడైంది. ఇందులో గ్రామీణ పేదలే అధికంగా ఉండడం గమనార్హం. ఉమ్మడి  జిల్లాలో పట్టణ ప్రాంతంలో 3.29శాతం మంది పేదలుండగా గ్రామీణ ప్రాంతంలో 12.05శాతం మంది  ఉన్నారు. అలాగే వివిధ రాష్ట్రాలు,  జిల్లాల స్థితిగతులు తెలుసుకోవడానికి నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5లో కూడా ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. మౌలిక వసతులు, పౌరుల స్థితిగతుల విషయంలో మేడ్చల్‌ జిల్లా అగ్రస్థానంలో ఉంది. విద్యుత్‌, రక్షిత మంచినీరు, ఇతర మౌలిక సౌకర్యాల్లో మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాలు ముందంజలో ఉన్నాయి. అలాగే గతంలో విడుదల చేసిన నివేదికల్లో మాత, శిశు సంరక్షణ కార్యక్రమాల అమల్లో రంగారెడ్డి, మేడ్చల్‌ , వికారాబాద్‌ జిల్లాలు మంచి ఫలితాలు సాధించినట్లు వెల్లడైన విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రసవాలు  ఆసుపత్రుల్లో జరిగే విధంగా తీసుకుంటున్న చర్యల వల్ల నవజాత శిశువులు, బాలింతల మరణాలు కూడా తగ్గుముఖం పట్టాయి. పిల్లల టీకాల విషయంలోనూ పురోగతి కనిపిస్తోంది.


  • రంగారెడ్డి జిల్లాలో పెరిగిన స్త్రీల నిష్పత్తి

రంగారెడ్డిజిల్లాలో పురుషుల కంటే మహిళల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. రంగారెడ్డిలో మహిళల నిష్పత్తి 1,022(1000 మంది పురుషులకు) ఉన్నట్లు తాజా నివేదికలో వెల్లడైంది. అయితే మేడ్చల్‌ జిల్లాలో 996, వికారాబాద్‌ జిల్లాలో 998 మంది స్త్రీ నిష్పత్తి ఉండడం గమనార్హం. మేడ్చల్‌, వికారాబాద్‌ జిల్లాలతో పోలిస్తే రంగారెడ్డి జిల్లాలో ఇంత వ్యత్యాసం ఉండడంఆశ్చర్యకరమనే చెప్పాలి.

Updated Date - 2021-11-28T05:39:38+05:30 IST