పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

ABN , First Publish Date - 2021-10-22T06:16:57+05:30 IST

పోలీస్‌ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని, వారి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ అన్నారు.

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
అమరవీరుల స్తూపానికి సెల్యూట్‌ చేస్తున్న ఎస్పీ

- శాంతియుల సమాజమే పోలీస్‌ లక్ష్యం

- ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌

గద్వాల క్రైం, అక్టోబరు 21 : పోలీస్‌ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని, వారి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ అన్నారు. పోలీస్‌ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం జిల్లా కేంద్రంలోని సాయుధ దళ కార్యాలయంలో పోలీస్‌ ప్లాగ్‌డే కార్యక్రమాన్ని ఽఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ మాట్లాడుతూ ఎంతోమంది పోలీస్‌ అమరుల ప్రాణ త్యాగ ఫలితంగా నేడు సమాజం స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతోందన్నారు. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత మాట్లాడుతూ విధి నిర్వహణలో వీరమరణం పొందిన పోలీసుల త్యాగం మరువలేనిదన్నారు. పోలీసులు లేని సమాజాన్ని ఊహించడం కష్టమన్నారు. అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను మరింతగా బలోపేతం చేయలన్నారు. ప్రతీ ఒక్క పోలీస్‌ అధికారి ఆత్మసాక్షిగా పని చేసి నప్పుడే ప్రజల్లో గుర్తింపు ఉంటుందన్నారు. మహిళల భద్రత కోసం ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ ఆధ్వర్యంలో షీటీంలను ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషమన్నారు. అనంతరం అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద శ్రద్దాంజలి ర్యాలీని ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో పోలీస్‌ అధికారులు, సిబ్బంది, ఎన్‌సీసీ స్టూడెంట్స్‌ పాల్గొన్నారు. అంతకుముందు పోలీసు అమరుల స్థూపం వద్ద నివాళి అర్పించారు. కార్యక్రమంలో గద్వాల సీఐ షేక్‌ మహబూబ్‌ బాషా, అలంపూర్‌ సీఐ సూర్యానాయక్‌, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. 


ప్రాణత్యాగానికి వెనుకాడేది లేదు : కమాండెంట్‌ రామ్‌ప్రకాష్‌ 

ఇటిక్యాల : సమాజ శ్రేయస్సు, శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైతే ప్రాణత్యాగం చేయడానికి కూడా పోలీసులు వెనుకాడరని పదవ పోలీస్‌ బెటాలియన్‌ కమాండెంట్‌ బీ రామ్‌ ప్రకాష్‌ అన్నారు. ఇటి క్యాల మండలంలోని ఎర్రవల్లి చౌరస్తాలో వున్న పదవ పోలీస్‌ బెటాలియన్‌లో గురు వారం పోలీసు అమరవీరుల దినోత్సవం నిర్వ హించారు. ముందుగా అమర వీరుల స్తూపం వద్ద నివాళి అర్పించారు. అనంతరం కమాండెంట్‌ మాట్లాడుతూ దేశ భద్రత కోసం ప్రాణాలు అర్పించిన పోలీసులను స్మరించుకొని, నివాళి అర్పించడం శాంతి భద్రతలు కాపాడడంలో మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తుందన్నారు. అనంతరం పోలీసు అమరుల కుటుంబ సభ్యులను పరామర్శించి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమాండెంట్లు అనీల్‌కుమార్‌, నాగనాయక్‌, ఆర్‌ఐలు రాజేష్‌, రాజారావు,గోపాల్‌, రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.





Updated Date - 2021-10-22T06:16:57+05:30 IST