వీరుల త్యాగాలు వృథా కానివ్వం

ABN , First Publish Date - 2021-06-23T05:57:52+05:30 IST

ఎంతోమంది త్యాగధనుల పోరాటాల ఫలితంగా ఏర్పడిన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ బారి నుంచి పరిరక్షించి, వీరుల త్యాగాలు వృథా కానివ్వమని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ మంత్రి రాజశేఖర్‌ అన్నారు.

వీరుల త్యాగాలు వృథా కానివ్వం
దీక్షా శిబిరంలో ప్రసంగిస్తున్న మంత్రి రాజశేఖర్‌

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ మంత్రి రాజశేఖర్‌

కూర్మన్నపాలెం, జూన్‌ 22: ఎంతోమంది త్యాగధనుల పోరాటాల ఫలితంగా ఏర్పడిన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ బారి నుంచి పరిరక్షించి, వీరుల త్యాగాలు వృథా కానివ్వమని  విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ మంత్రి రాజశేఖర్‌ అన్నారు. కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 131వ రోజు కొనసాగాయి. మంగళవారం ఈ దీక్షలలో ఎస్‌ఎంఎస్‌-2 ఇంటక్‌ యూనియన్‌ కార్మికులు కూర్చున్నారు. ఈ శిబిరంలో మంత్రి రాజశేఖర్‌ మాట్లాడుతూ కరోనా ఉధృతంగా ఉన్నా స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ ఉద్యమంలో కార్మికులు పాల్గొంటున్నారని, కొంతమంది వైరస్‌ బారినపడి మృతి చెందారని ఆవేదన వ్యక్తంచేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ మాట్లాడుతూ ఉద్యోగ భద్రత, సామాజిక న్యాయం ప్రభుత్వ రంగంలోనే ఉంటుందన్నారు. మన దేశంలో 2018-19లో 106 మిలియన్‌ టన్నుల ఉక్కు ఉత్పత్తి జరుగగా, ప్రైవేట్‌ రంగంలో 86 శాతం, ప్రభుత్వ రంగంలో 14 శాతం మాత్రమే జరిగిందన్నారు. ఇది ఇలా కొనసాగితే పారిశ్రామిక రంగానికి దేశానికి అవసరమైన ఉక్కు ఉత్పత్తి కోసం ప్రైవేట్‌ రంగం వైపు చూడాలన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు జె.అయోధ్యరామ్‌, రమణమూర్తి, సంపూర్ణం, గంగవరం గోపి, మురళీరాజు, రామచంద్ర రాజు, కేఎస్‌ఎన్‌ రావు, సురేశ్‌బాబు, రెడ్డి, జగదీశ్‌ కుమార్‌, రామయ్య, సుబ్బయ్య, నగేశ్‌, సాహు, సురేశ్‌, ఆంజనేయ, రమణ, ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-23T05:57:52+05:30 IST