అమరుల త్యాగాలను స్మరించుకోవాలి

ABN , First Publish Date - 2021-10-22T05:28:37+05:30 IST

విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరులను స్మరించుకోవడం మన బాధ్యత అని, వారు చేసిన త్యాగాలు, సేవలు మరువలేనివని జిల్లా జడ్జి డా.వి.రాధాకృష్ణ కృపాసాగర్‌, కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు, ఎస్పీ సీహెచ్‌ సుధీర్‌ కుమార్‌ రెడ్డి అన్నారు.

అమరుల త్యాగాలను స్మరించుకోవాలి

  1. పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేం: జిల్లా జడ్జి, కలెక్టర్‌


కర్నూలు, అక్టోబరు 21: విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరులను స్మరించుకోవడం మన బాధ్యత అని, వారు చేసిన త్యాగాలు, సేవలు మరువలేనివని జిల్లా జడ్జి డా.వి.రాధాకృష్ణ కృపాసాగర్‌, కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు, ఎస్పీ సీహెచ్‌ సుధీర్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు పరేడ్‌ మైదానంలో అమరవీరుల స్థూపం వద్ద గురువారం స్మృతి పరేడ్‌ నిర్వహించారు. జిల్లా జడ్జి, కలెక్టర్‌, ఎస్పీ హాజరై పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అమర వీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. 


పోలీసు అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకునేందుకు సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించుకుం టున్నామని జిల్లా జడ్జి డా.వి.రాధాకృష్ణ కృపాసాగర్‌ అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసుల త్యాగాలను ఎన్నటికీ మరువకూడదని అన్నారు. 2006 గణాంకాల ప్రకారం ప్రపంచంలో సగటున ప్రతి లక్ష మంది ప్రజలకు 300 మంది పోలీసులు ఉన్నారని అన్నారు. విద్యార్థులు, ప్రజలు క్రమశిక్షణతో మెలిగేలా అవగాహన కల్పించాలని కలెక్టర్‌, ఎస్పీకి సూచించారు.


 1959 అక్టోబరు 21న జరిగిన దురదృష్టకర సంఘటనను గుర్తు చేసుకుంటూ, వారి త్యాగాలను స్మరించుకోవడం కోసం ఏటా అదే రోజున పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నామని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు అన్నారు. పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం అందరి బాధ్యత అని అన్నారు. పోలీసుల లేని సమాజాన్ని ఊహించలేమని అన్నారు. శాంతిభద్రతల కట్టడిలో పోలీసు వ్యవస్థ కీలకంగా పని చేస్తోందని కొనియాడారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో పోలీసులు వారి కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ విధులు నిర్వహించారని గుర్తు చేశారు. పోలీసుల సేవలను సమాజం ఎప్పుడూ గుర్తుంచుకుంటుందని అన్నారు. 


 దేశం కోసం ఎంతో మంది జవాన్లు తమ ప్రాణాలు అర్పించారని ఎస్పీ సుధీర్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. ప్రజారక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగనిరతిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినం పాటిస్తున్నామని అన్నారు. జిల్లాలో విధి నిర్వహణలో భాగంగా గత సంవత్సరం 16 మంది వీరయోధులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి నియంత్రణ విధుల్లో పాల్గొన్న పోలీసులు ఐదుగురు వీరమరణం పొందారని అన్నారు. వారినందరినీ స్మరించుకోవడం మన ధర్మం అని అన్నారు. సమాజం కోసం, భావి తరాల కోసం, ప్రజారక్షణం కోసం పోలీసులు అహర్నిశలు తమ ప్రాణాలను లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రాణాలు అర్పించిన ఒక్కొక్క అమర వీరుడికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కక్కరికి రూ.10 లక్షలు (భద్రత కింద రూ.5 లక్షలు, ఎక్స్‌గ్రేషియా కింద రూ.5 లక్షలు) అందజేసిందని ఎస్పీ తెలిపారు. ప్రజాశ్రేయస్సు, శాంతిభద్రతలే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. పోలీసులకు ప్రజల సహకారం చాలా అవసరమని, పోలీసులు పడుతున్న కష్టాన్ని, శ్రమను గుర్తిస్తే వారికి అదే సంతోషం అని ఇస్తుందన్నారు. 


అమరుల కుటుంబాలకు అండ


రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ జనార్దన్‌ కుటుంబానికి రూ.20 లక్షల భద్రత ఎక్స్‌గ్రేషియా చెక్కును అందజేశారు. దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో వీరమరణం పొందిన 377 మంది పోలీసుల పేర్లను ఏఆర్‌ డీఎస్పీ ఇలియాజ్‌ బాషా చదివి వినిపించారు. అందరీకీ శ్రద్ధాంజలి ఘటించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అమరులైన పోలీసు కుటుంబాల వారిని శాలువలతో సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సతీమణి నాగప్రశాంతి, సెబ్‌ అడిషినల్‌ ఎస్పీ తుహిన్‌ సిన్హా, హోంగార్డు కమాండెంట్‌ రామ్మోహన్‌, డీఎస్పీలు మహేశ్వరరెడ్డి, వెంకటాద్రి, వెంకట్రామయ్య, రమణ, కేవీ మహేష్‌, శ్రీనివాసరెడ్డి, రవీంద్రారెడ్డి, రామాంజినాయక్‌, ఇలియాజ్‌బాషా, ఏవో సురేష్‌బాబు, పోలీసు వెల్ఫేర్‌ డాక్టర్‌ స్రవంతి, సీఐలు, ఆర్‌ఐలు, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు నాగరాజు, పోలీసుల కుటుంబాలవారు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-22T05:28:37+05:30 IST